రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తీరుపై విస్మయం

28 Oct, 2020 10:49 IST|Sakshi

ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యం?

సుప్రీంకోర్టు ఆదేశాలు పట్టించుకోవడం లేదు

చంద్రబాబు చెప్పినట్లే నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు

అప్పుడు సాధ్యం కానిది... ఇప్పుడెలా సాధ్యం

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు

సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వ్యవహార శైలి వివాదానికి దారితీసింది. రాజకీయ పార్టీలతో ఈసీ విడివిడిగా సమావేశం కావడంపై దుమారం రేగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఈసీ సమావేశాలు నిర్వహించడం పట్ల అన్ని వర్గాల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఈసీ చెబుతుండగా, కోవిడ్‌ భయంతో భేటీలే విడివిడిగా జరుపుతుంటే ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సంప్రదాయాలకు భిన్నంగా, దేశంలో ఎక్కడాలేని విధంగా వింత పోకడ అవలంబిస్తున్న తీరుపై రాజకీయ వర్గాలు విస్తుపోతున్నాయి. కాగా ఈసీ, నేడు నిర్వహించిన సమావేశానికి బీజేపీ, బీఎస్పీ నేతలు హాజరయ్యారు. కాసేపటి క్రితమే ఈ భేటీ ముగిసింది.(చదవండి: స్థానిక ఎన్నికల నిర్వహణపై నేడు అభిప్రాయ సేకరణ)

ఇక సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నందుకే, ఆయన నిర్వహిస్తున్న రాజకీయ పార్టీల సమావేశానికి వెళ్లడం లేదని వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని మరోసారి స్పష్టం చేశారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలను తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఈసీ ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. ఎన్నికల కమిషనర్‌... చీఫ్ సెక్రటరీని సంప్రదించలేదు. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలో ఉన్న వ్యక్తిగా నిమ్మగడ్డ వ్యవహరించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రాజకీయ పార్టీలను భేటీకి పిలవడం సరైందేనా’’అని ప్రశ్నించారు. (చదవండి: నిమ్మగడ్డ సమావేశానికి వైఎస్సార్‌సీపీ వెళ్లదు)

‘‘చంద్రబాబు నాయుడు చెప్పినట్లే నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారు. టీడీపీ నేతలను సంప్రదించి సమావేశాలు పెడుతున్నారు. అన్ని పార్టీలను సమన్వయం చేసుకోకుండా నిమ్మగడ్డ ముందుకెళ్తున్నారు. ఒక పార్టీకి, వర్గానికి చెందిన వ్యక్తిగా ఆయన వ్యవహరిస్తున్నారు’’అని అంబటి విమర్శించారు. రాష్ట్రంలో మూడు కోవిడ్‌ కేసులు కూడా లేని రోజుల్లో.. ఏ రాజకీయ పార్టీలను అడిగి ఎన్నికలు వాయిదా వేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు రాజకీయంలో నిమ్మగడ్డ రమేష్‌ భాగమేనని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు