సాగర్‌పై ఏపీ చర్యలు న్యాయమైనవే: మంత్రి అంబటి

1 Dec, 2023 13:35 IST|Sakshi

సాక్షి, గుంటూరు: నాగార్జున సాగర్‌ డ్యామ్‌ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని, తెలుగు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించవద్దని మంత్రి అంబటి రాంబాబు కొన్ని మీడియా సంస్థలకు హితవు పలికారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ వ్యవహారానికి రాజకీయపరమైన ముడిపెట్టడం తగదని.. తెలంగాణలో ఏ పార్టీ వచ్చినా తమకు సంబంధం లేదని అన్నారు.

‘‘ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయి. తెలంగాణలో మా పార్టీ లేదు. అక్కడ మేం పోటీ చేయలేదు. అలాంటప్పుడు ఏపార్టీని ఓడించాల్సిన అవసరం మాకు ఉండదు కదా. మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టును మేము వాడుకోం’’ అని మంత్రి అంబటి స్పష్టం చేశారు.

‘‘నాగార్జున సాగర్‌పై దండయాత్ర చేసినట్టు‌ ఎల్లోమీడియా వార్తలు రాసింది. ఎవరిష్టం వచ్చినట్టు వారు రాశారు, టీవీల్లో చూపించారు. నిన్న మేము చేపట్టిన చర్య న్యాయమైనది, ధర్మమైనది. రాష్ట్ర విభజ తర్వాత నదీ జలాలను కూడా విభజించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఉమ్మడిగా ఉన్నాయి. బీజేపీ కిషన్ రెడ్డి నిన్న కొన్ని వాస్తవాలను కూడా అంగీకరించారు. కానీ ఏపీకి చెందిన కొన్ని పత్రికలు రాద్దాంతం చేశాయి’’ అంటూ మంత్రి  అంబటి మండిపడ్డారు.

వాస్తవానికి నది, డ్యాంలో సగం మాత్రమే తెలంగాణ పరిధిలో ఉంటుంది. కానీ ఈ చివరి వరకు మొత్తం తెలంగాణ ఆక్రమించింది. చంద్రబాబు హయాంలో చూస్తూ ఊరుకున్నారు. అప్పట్లో నీటి విడుదలకు కూడా తెలంగాణ ఒప్పుకోలేదు. మన భూభాగంలోకి మన పోలీసులు వెళ్తే దండయాత్ర ఎలా అవుతుంది. రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు సమాధానం చెప్పాలి. తెలంగాణలో ఏదో పార్టీకి మేము మద్దతు తెలిపేందుకే ఇలా చేశామని కూడా వార్తలు రాయటం అవివేకం. మేము తెలంగాణలో పోటీ చేయటం లేదు. ఏ పార్టీకీ మద్దతు ఇవ్వటం లేదు. మన హక్కులను చంద్రబాబు తెలంగాణకు ధారపోశారు. ఓటుకు నోటు కేసు వలన ఇలా చేశారు. మన హక్కులను మనం కాపాడుకుంటే దండయాత్ర ఎలా అవుతుంది?’’ అని మంత్రి అంబటి ప్రశ్నించారు.

‘‘చంద్రబాబు ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. జగన్ ప్రభుత్వం చేసి సక్సెస్ అయింది. దీంతో టీడీపీ నాయకులు ఏమీ మాట్లాడలేక పోతున్నారు. పురంధేశ్వరి మాత్రం ఆంధ్రా హక్కులను నీరు గార్చేలా మాట్లాడటం దారుణం. 13వ గేటు వరకు మా హక్కు ఉంది. ఒక అడుగు ముందుకు వేసి మా హక్కులను మేము సాధించాం. చంద్రబాబు అప్పట్లో తెలంగాణకు లొంగిపోయారు.’’ అని మంత్రి దుయ్యబట్టారు.

తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసు చెల్లదు. ఘటన జరిగింది ఏపీలో ఐతే తెలంగాణ లో కేదు నమోదు ఏంటి?. కృష్ణా బోర్డుకానీ, కేంద్ర జలశక్తి కానీ ఎవరైనా వచ్చి పరిశీలించవచ్చు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా స్వాగతిస్తాం. మా పార్టీ అక్కడ పోటీ చేయటం లేదు. తెలంగాణలో చంద్రబాబు కుల సంఘాలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాయి. రాహుల్, ప్రియాంక గాంధీ సభల్లో కాంగ్రెస్ జెండాలతో పోటీగా టీడీపీ జెండాలు కూడా కనిపించాయి. పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులను ఓడించటానికి చంద్రబాబు కులం వారు భారీగా డబ్బు ఖర్చు పెట్టారు. తెలంగాణలో జనసేన అవసరం లేదు, ఏపీలో అవసరమా. పవన్‌ పిచ్చోడేమోకానీ, ఆయన కులం పిచ్చిది కాదని చంద్రబాబు గుర్తించాలి’’ అంటూ మంత్రి అంబటి వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు