ప్రజా పాలనకు మతం మరకలా?

7 Jan, 2021 06:01 IST|Sakshi

విపక్షాలపై ఎమ్మెల్యే అంబటి మండిపాటు

కులవాది చంద్రబాబు హయాంలో 40 దేవాలయాలు నేలమట్టం

దేవుళ్లను చెత్తబుట్టలో వేసిన దారుణ చరిత్ర నీదే

బూట్లతో గుడికి వెళ్లే నువ్వు హిందుత్వవాదివా?

సాక్షి, అమరావతి: ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికి మతం మరకలు అంటించేందుకు సంకుచిత రాజకీయాలకు పాల్పడుతున్నారని పార్టీ అధి కార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రాజకీయ భవిష్యత్‌ కనుచూపు మేరలో కానరాక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అసహనంతో చేస్తున్న మత రాజకీయాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. కులమతాలకు అతీతంగా సీఎం జగన్‌ పాలన సాగుతోందని గుర్తు చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. 

మత మార్పిడులు కాదు.. పార్టీ మార్పిడులు
పద్నాలుగేళ్లు పాలించానని చెప్పుకునే చంద్రబాబు తన కులాన్ని కాపాడుకోవడమే కానీ హిందువులకు చేసిన మేలు ఏమిటని అంబటి ప్రశ్నించారు. ‘నిజంగా నువ్వు హిందుత్వవాదివే అయితే అమరావతిలో అమరలింగేశ్వరస్వామి బొమ్మ పెట్టుకోవాలే గానీ నీ సీటు వెను క బుద్ధుడి బొమ్మ ఎందుకు పెట్టుకున్నావు?’ అని నిలదీశారు. గతంలో ఆయనకు శ్రీ రాముడు ఎందుకు గుర్తుకు రాలేదో చెప్పాలన్నారు. నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన జగన్‌మోహన్‌రెడ్డిపై మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నారంటూ చంద్రబాబు చేసిన విమర్శలను ఖండించారు. పెద్ద ఎత్తున అమలు చేస్తు న్న సంక్షేమ కార్యక్రమాలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీలోకి తరలి వస్తుండటంతో ఈ మార్పులకు బెంబేలెత్తిన చంద్రబాబు మతం అజెండా ఎత్తుకున్నారని వ్యాఖ్యానించారు. రూ.90 వేల కోట్లు వెచ్చించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్న ఘనత తమదేనన్నారు. బూట్లు ధరించి గుడికెళ్లే బాబు హిందుత్వం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 

పేదలను ఆదుకుంటే మంటెందుకు?
రాజ్యాంగ వ్యతిరేకంగా పాస్టర్లకు రూ.5 వేలు ఇస్తున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలను అంబటి తీవ్రంగా తప్పుబట్టారు. ముస్లిం మత పెద్దలు ఇమామ్‌లు, పూజారులకు కూడా ఇస్తున్నామని, అన్ని మతాల్లో పేదలను ఆదుకుంటుంటే తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. క్రైస్తవులను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలో టీడీపీ ఇచ్చిన హామీలను అంబటి ప్రస్తావించారు.  మోసం చేసి రాజకీయాల్లో పైకి రావడమే బాబుకు తెలిసిన విద్య అన్నారు. 

సంకుచిత రాజకీయాలకు తావులేదు..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ వ్యాఖ్యలపై అంబటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బైబిల్, ఖురాన్, భగవద్గీత పవిత్రమైనవని, వాటికి పార్టీ రంగు పులమడమేంటన్నారు. అన్ని మతాలు కలిసిందే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అని స్పష్టం చేశారు. రెండు కొండలని చంద్రబాబు జీవో ఇస్తే ఏడు కొండలని జీవో ఇచ్చిన ఘనత వైఎస్‌ రాజశేఖరరెడ్డిదని గుర్తు చేశారు. కులమత సంకుచిత రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్‌లో తావులేదన్నారు. ఇది జగన్‌మోహన్‌రెడ్డి పాలిస్తున్న రాష్ట్రమని చెప్పారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం వెనుక పాత్ర ఎవరిదో అన్నీ విచారణలో తేలుతాయన్నారు. ఒక్క చోట కూడా గెలవలేని నారా
లోకేష్‌కు ముఖ్యమంత్రిని విమర్శించే  నైతిక హక్కు ఉందా?  అని అంబటి ప్రశ్నించారు. దాచేపల్లిలో టీడీపీ నేత అంకులు హత్యపై సమగ్ర విచారణ జరుగుతున్నదని దోషులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందన్నారు. శవ రాజకీయాలు, మత రాజకీయాలు  మానుకోవాలని విపక్షాలకు హితవు పలికారు. 

40 దేవాలయాలు కూల్చిందెవరు?
సీఎం జగన్, పాలన యంత్రాంగంపై క్రైస్తవులనే విమర్శలు చేస్తున్న చంద్రబాబు ఆయన హయాంలో డీజీపీ, హోంమంత్రి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లుగా హిందువులనే నియమించుకుని విజయవాడలో నడిరోడ్డుపై 40 దేవాలయాలను కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. దేవుడి విగ్రహాలను క్రేన్లతో తొలగించి చెత్తబుట్టలో పడవేయడం లాంటి దుర్మార్గపు చర్యలకు చంద్రబాబు  సమాధానం చెప్పాలన్నారు. మోసం, దగా చేసే చంద్రబాబుకు హిందుత్వం గురించి మాట్లాడే హక్కే లేదన్నారు. 

మరిన్ని వార్తలు