చంద్రబాబుకు పోయేకాలం వచ్చింది..

24 Sep, 2020 18:53 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: పోలీసు భద్రత నడుమ ఆలయాలను ధ్వంసం చేయించిన చంద్రబాబు నాయుడుకు హిందుత్వం గురించి మాట్లాడే అర్హత లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. సంకీర్ణ ప్రభుత్వ హయాంలో విజయవాడలో గుళ్లను నాశనం చేసి, దేవుడి విగ్రహాలను మున్సిపాలిటీ చెత్తబండిలో వేసిన చరిత్ర ఆయనదని మండిపడ్డారు. మానవ సేవే మాధవ సేవగా భావించి ముందుకు సాగుతున్న వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అంతర్వేదిలో రథం దగ్దమవడం, మరోచోట దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం కావడం దురదృష్టకరమన్న అంబటి, ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. కానీ మతం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు తమ ప్రభుత్వంపై బురదజల్లి లబ్ది పొందాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.(చదవండి: అధికారంలో లేమనే బాధతోనే ఇదంతా..)

సజ్జల క్లారిటీ ఇచ్చారు..
గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడిన అంబటి రాంబాబు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చట్ట ప్రకారం, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించటం పూర్వజన్మ సుకృతమని, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయమన్నారు. కానీ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోందని, అసమర్థ ప్రతిపక్షం సీఎం జగన్‌పై అసత్యాలు ప్రచారం చేస్తూ హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. 

ఇక గతంలో ఇద్దరు క్రిస్టియన్ ముఖ్యమంత్రులు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించినపుడు లేని డిక్లరేషన్‌ను, ఇప్పుడు ఎందుకు తెరపైకి తీసుకు వచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుకు పోయేకాలం వచ్చిందని, ప్రతిపక్షం మాటలు ఎవరూ నమ్మవద్దని అంబటి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ప్రధాని గురించి ఎవరు ఇలా మాట్లాడినా తప్పేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారని తెలిపారు. అదే విధంగా సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా తీరుపై కూడా అంబటి మండిపడ్డారు. చంద్రబాబు తాబేదార్ల పత్రికలు పిచ్చి రాతలు రాస్తూ, ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.


 

>
మరిన్ని వార్తలు