జూన్‌ 30న ఖమ్మంలో అమిత్‌ షా సభ?

18 May, 2022 01:28 IST|Sakshi

వరంగల్‌ నుంచి ఖమ్మం దాకా మూడో విడత ప్రజా సంగ్రామయాత్ర! 

జూన్‌ 10న ప్రారంభం ..  30న ముగింపు...

తెలంగాణకు త్వరలో మళ్లీ వస్తానన్న అమిత్‌ షా 

పాదయాత్ర ముగింపు సభకు హాజరయ్యే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా త్వరలోనే మరోసారి తెలంగాణకు రానున్నట్టు సమాచారం. వచ్చే నెలలో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రజా సంగ్రామయాత్ర–3 ముగింపు సందర్భంగా జూన్‌ 30న ఖమ్మం పట్టణంలో అమిత్‌షా బహిరంగ సభ నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది.  టీఆర్‌ఎస్‌ పార్టీ నేతల ప్రోద్బలంతో పోలీసులు వేధించడం వల్లే ఖమ్మం పట్టణంలో బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడంటూ వెల్లువెత్తిన ఆరోపణలను బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నేతలను సవాల్‌ చేసేలా ఖమ్మంలోనే అమిత్‌ షా సభ నిర్వహించాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు.  

తొలుత భువనగిరి అనుకున్నా.. 
మూడోవిడత ప్రజాసంగ్రామ యాత్రను మేడారం నుంచి యాదాద్రి భువనగిరి దాకా నిర్వహించి అక్కడే ముగింపు సభ జరపాలని తొలుత భావించారు. అయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే బీజేపీ కార్యకర్తలపై దాడులు జరగడం, సాయిగణేష్‌ ఉదంతం నేపథ్యంలో.. కార్యకర్తలకు అండ గా ఉన్నామనే భరోసా కల్పించేందుకు యాత్ర జరిగే ప్రాంతాలను మార్చాలనే ఆలోచనలో పార్టీ నేతలు ఉన్నారు. జూన్‌ 10న వరంగల్‌ భద్రకాళి దేవాలయం వద్ద ప్రారంభించి 30న ఖమ్మంలో ముగిసేలా.. దాదాపు 300 కి.మీ మేర సంజయ్‌ పాదయాత్ర నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. బెంగాల్‌ తరహాలోనే తెలంగాణలోనూ సీఎం కేసీఆర్‌ దాడుల సంస్కృ తికి తెరలేపారని, వెంటనే దీనికి చెక్‌ పెట్టాల్సి ఉందని తుక్కుగూడ సభలో అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఖమ్మంలో సభ నిర్వహణకు మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. 

ఎప్పుడైనా రెడీ అన్న అమిత్‌ షా! 
పార్టీ నేతల అంచనాలకు మించి పాదయాత్ర–2 సభ విజయవంతం కావడంతో మరో 20 రోజుల యాత్ర షెడ్యూల్‌ ఖరారుపై రాష్ట్రపార్టీ ముఖ్యనేతలు కసరత్తు చేస్తున్నారు. అమిత్‌షా సభకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు ముఖ్యం గా యువత హాజరుకావడంతో జాతీయ పార్టీ సహా రాష్ట్ర పార్టీలోనూ ఉత్సాహం పెరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు పరిస్థితి అనుకూలంగా ఉందని భావిస్తున్న అధినాయకత్వం.. రాష్ట్రపార్టీ కార్యకలాపాలు, మరిన్ని విడతల పాదయాత్రల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించింది. తుక్కుగూడ సభ అనంతరం రెండురోజుల వ్యవధిలోనే బండి సంజయ్‌కు అమిత్‌షా ఫోన్‌ చేసి తదుపరి కార్యాచరణపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మరోసారి రాష్ట్రానికి రావాలంటూ సంజయ్‌ కోరగా పార్టీపరంగా ఎప్పుడు ఎలాంటి కార్యక్రమం పెట్టి పిలిచినా, ఎన్నిసార్లైనా వచ్చేందుకు సిద్ధమని ఆయన చెప్పినట్టు పార్టీవర్గాల సమాచారం.    

మరిన్ని వార్తలు