బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ ఖాయం

19 Nov, 2023 04:38 IST|Sakshi

బీజేపీకి ఓటేస్తే మురిగిపోయినట్లే 

కాంగ్రెస్‌కు ఓటేస్తే చెత్త బుట్టలో వేసినట్లే 

కామారెడ్డిలో రేవంత్‌రెడ్డికి డిపాజిట్‌ రాదు 

నిజామాబాద్‌ జిల్లా ప్రచార సభల్లో మంత్రి హరీశ్‌రావు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: కేసీఆర్‌తోనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని.. బీజేపీకి ఓటేస్తే మురిగిపోయినట్లేనని, కాంగ్రెస్‌కు ఓటేస్తే చెత్త బుట్టలో వేసినట్లేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీశ్‌రావు శనివారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నియోజకవర్గంలోని సాటాపూర్, నిజామాబాద్‌ అర్బన్, ఆర్మూర్‌ నియోజకవర్గంలోని మాణిక్‌భండార్, నందిపేటల్లో నిర్వహించిన సభల్లో మాట్లాడారు. ఎవరెన్ని కుట్రలు చేసినప్పటికీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమన్నారు. ఏ సర్వే చూసినా మూడోసారి కేసీఆర్‌ సీఎం అవుతారని తెలుస్తోందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే ఆగమైనట్లేనన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను నమ్మవద్దన్నారు. కర్ణాటకలో వ్యవసాయ విద్యుత్‌ రోజుకు 20–30 సార్లు ట్రిప్‌ అవుతోందన్నారు. ఆ రాష్ట్రంలో హామీలకు గ్యారంటీ ఇచ్చిన రాహుల్, ప్రియాంక పత్తా లేకుండా పోయారన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం అరడజను మంది పోటీ పడుతున్నారన్నారు. ఆ పార్టీది సుతి లేని సంసారమన్నారు. రేవంత్‌ రెడ్డికి రైతులు బిచ్చగాళ్లలాగా కనిపిస్తున్నారన్నారు. కామారెడ్డిలో రేవంత్‌రెడ్డికి డిపాజిట్‌ రాదని జోస్యం చెప్పారు.

బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్‌ను తిట్టడం తప్ప అభివృద్ధి గురించి మాట్లాడరన్నారు. రూ.400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.1,200 పెంచింది బీజేపీయేనన్నారు. ఆ పార్టీ డకౌట్‌ అవుతుందని, లేకుంటే ఒకటి రెండు సీట్లు మాత్రమే వస్తాయని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇకపై రూ.400కే వంట గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వబోతోందన్నారు. మరోసారి బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే అసైన్డ్‌ భూములకు పట్టాలిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్‌ ప్రభుత్వం బీడీ కార్మికులకు పింఛన్‌ ఇస్తోందన్నారు. రైతులకు 11 విడతల్లో రూ.72 వేల కోట్లు రైతుబంధు కింద ఇచ్చామన్నారు.

మరిన్ని వార్తలు