ముక్కు నేలకు రాస్తా! 

19 Nov, 2023 04:35 IST|Sakshi

మీ రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ. 2 వేలు పింఛన్‌ ఇస్తున్నట్లు నిరూపించండి  

కాంగ్రెస్‌ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవాల్‌ 

ఇక్కడకొచ్చి రూ.4 వేల పింఛన్‌ ఇస్తామని చెబుతున్నారు 

మోదీ సొంత రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు  

నన్ను చూసి కాంగ్రెస్, బీజేపీలు భయపడుతున్నాయి 

రెండూ ఒక్కటై బొండిగే పిసకాలని చూస్తున్నాయి 

చంద్రబాబుకు చెంచాగిరి చేసిన వాళ్లు తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్‌ను తిడుతున్నారంటూ ఫైర్‌  

ఎన్నికల్లో అభ్యర్థి గుణగణంతో పాటు పార్టీ చరిత్ర చూసి ఓటేయాలని పిలుపు 

చేర్యాల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం 

సాక్షి, సిద్దిపేట:  కాంగ్రెస్‌ నేతలు తెలంగాణకు వచ్చి రూ.4 వేలు పింఛన్‌ ఇస్తామని చెబుతున్నారని, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ. 2 వేలు పింఛన్‌ ఇస్తున్నట్లు నిరూ పిస్తే ముక్కు నేలకు రాస్తా అని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవాల్‌ చేశారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల విద్యుత్‌ ఇవ్వడం లేదని చెప్పారు.

తనను చూసి కాంగ్రెస్, బీజేపీలు భయపడుతున్నాయని, అందుకే రెండూ ఒక్కటై ఇక్కడికే పరిమి తం చేసి బొండిగే పిసకాలని చూస్తున్నాయన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ గెలిస్తే మహారాష్ట్ర వెళ్తానని భయపడుతున్నా యని పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా చేర్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగించారు.  

బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ కోసం 
‘బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ కోసం. ఉన్న తెలంగాణను ముంచిన చరిత్ర కాంగ్రెస్‌ది. 2005, 2006లో తెలంగాణ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వకుండా దోఖా చేసింది. మనం మొండిగా కొట్లాడి సాధించుకున్నాం. పదేళ్లకు ముందు తెలంగాణ.. పదేళ్ల తర్వాత తెలంగాణ ఎట్ల ఉన్నదో ఆలోచన చేయాలి. నేడు పంజాబ్‌ను తలదన్నే విధంగా 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నాం.

బీఆర్‌ఎస్‌ గెలిస్తే రైతుబంధు ఎకరానికి రూ.16 వేలు అవుతుంది. కాంగ్రెస్‌ గెలిస్తే ఉన్నది పోతుంది. కాంగ్రెస్‌ వస్తే కరెంట్‌ కోసం పాత రోజులు వస్తాయి. ధరణితో భూ యజమానికి హక్కు కల్పించాం. కానీ కాంగ్రెసోళ్లు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారు. అలాంటి వారికి బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్‌ గెలిస్తే మళ్లీ దళారీ రాజ్యం. బ్రోకర్‌ వ్యవస్థ ఏర్పడుతుంది..’అని కేసీఆర్‌ హెచ్చరించారు.  

తెలంగాణను నంబర్‌ 1 చేసిందెవరు? 
‘తెలంగాణ ఉద్యమంలో ఎవ్వడూ లేడు. ఇవాళ వచ్చి మాట్లాడుతుండ్రు కాంగ్రెసోళ్లు. ఎన్కటికి ఎవడో అన్నడట.. ‘వంటలన్నీ మీరు వండి తయారు పెట్టండి..యాలకు నేను వచ్చి వడ్డిస్తా అని’. తెలంగాణ కోసం కొట్లాడింది, ప్రాణాలకు తెగించి, పేగులు తెగేదాకా జై తెలంగాణ అని నినదించి తెలంగాణ సాధించినోడు ఎవడు.? సాధించిన తెలంగాణను దేశంలో నంబర్‌ వన్‌ చేసింది, 24 గంటల కరెంట్, తాగు, సాగునీరు తెచ్చిందెవరు? సమయానికి వచ్చి వడ్డన చేస్తాం అంటారా? కాకరకాయ, తోకరకాయ, పిచ్చి పోసిగాళ్లం ఉన్నామా?..’అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నాడు బచ్చన్నపేటలో ఏడ్చిన 
‘నాడు బచ్చన్నపేట గుండా వెళ్తుంటే అందరూ ముసలివాళ్లే ఉండటంతో అపి మాట్లాడా. యువత బతుకు దెరువు కోసం వెళ్లారన్నారు. 9 సంవత్సరాల నుంచి కరువు ఉండటంతో చెరువు ఎండి పోయి చుక్క నీరు లేదని, బతకలేని పరిస్థితి ఉందని చెప్పారు. కృష్ణా, గోదావరి జీవనదుల మధ్య ఉన్న ప్రాంతం ఇంత అన్యాయానికి గురవుతుండటంతో బచ్చన్నపేట చౌరస్తాలో ఏడ్చిన. ఇప్పుడు బచ్చన్నపేట చెరువు ఎప్పుడూ నిండే ఉంటోంది..’అని కేసీఆర్‌ తెలిపారు.  

ఎవరికి పిండం పెట్టాలో మీరు నిర్ణయించాలి 
‘రైతులకు 3 గంటల విద్యుత్‌ చాలని కాంగ్రెస్‌ వాళ్లు అంటున్నారు. కర్ణాటకలో కాట కలిపిన కాంగ్రెస్‌.. మనల్ని కూడా కాట కలిపే ప్రయత్నం చేస్తోంది. జాగ్రత్తగా ఉండాలి. జనగామలో మొరిగిపోయిన కుక్క ఏం చేసిందో మీకు తెలియాలి. రైఫిల్‌ పట్టుకుని ఎవడ్రా తెలంగాణ ఉద్యమం చేసేదని కరీంనగర్‌ మీదకు పోయిండు. ఆ రోజు నుంచి ప్రజలు ఆయనకు (రేవంత్‌రెడ్డి0 రైఫిల్‌ రెడ్డి అని పేరు పెట్టారు.

ఆంధ్రోళ్ల బూట్లు మోసుకుంటూ, ఆ రోజు చంద్రబాబుకు చెంచాగిరి చేసిన వాళ్లు మాట్లాడుతున్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్‌ను తిడుతున్నారు. ఇది మర్యాదనా? వాళ్లకు సిగ్గుండాలి. ఇదే కాదు కేసీఆర్‌కు పిండం పెడతా అంటడు. మనకు తిట్టరాదా? దేశంలో తిట్లు కరువు ఉన్నాయా..? ఇయ్యాల మొదలు పెడితే రేపటి దాకా తిట్టొచ్చు. మనం ఆ పని చేయడం లేదు. మన విషయం చెప్పుకుంటున్నాం. ఎవరికి పిండం పెట్టాలో మీరు నిర్ణయించాలి. మీరందరూ ఆలోచించి ఓటేయాలి..’అని ముఖ్యమంత్రి కోరారు. 

ప్రతి గ్రామంలో చర్చ జరగాలి 
‘75 ఏళ్ల స్వతంత్ర భారత ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణితి రాలేదు. ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలు, వెనుక ఉన్న పార్టీల చరిత్ర చూడాలి. వాళ్లకు రాష్ట్రాన్ని అప్పగిస్తే ఎటు తీసుకవెళ్తారనే విషయంపై ప్రతి గ్రామంలో చర్చ జరగాలి. అప్పుడే తెలివిగల ప్రభుత్వం వస్తుంది. నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది..’అని కేసీఆర్‌ అన్నారు. పల్లా అడిగిన హామీలన్నీ గెలిచిన నెలలోపు నెరవేరుస్తానని, కారు గుర్తుకు ఓటు వేసి ఆయన్ను గెలిపించాలని కోరారు.    

మరిన్ని వార్తలు