చంద్రబాబు మళ్లీ జైలుకే.. ఇన్ని రోగాలున్న వ్యక్తి ఏపీకి అవసరమా?

31 Oct, 2023 14:14 IST|Sakshi

సాక్షి, కృష్ణా: రోగాలు ఉన్నందుకే చంద్రబాబుకు స్కిల్‌ స్కాం కేసులో కోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిందని, ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉంటూనే టీడీపీ అధికార ప్రతినిధిగా దగ్గుబాటి పురందేశ్వరి పని చేస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు బెయిల్‌ పరిణామంపై విజయవాడలో మంగళవారం వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు.

‘‘కోర్టు చంద్రబాబుకు మద్యంతర బెయిల్ ఇచ్చింది రోగాలు ఉన్నాయనే. చంద్రబాబు నేరం చేయలేదని వాళ్ల న్యాయవాదులు ఎక్కడా చెప్పలేదు. అనారోగ్యాలతో బెయిల్‌ తెచ్చుకున్నారు. ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ చంద్రబాబుకి ఉన్నట్లు చూపించి బెయిల్‌ తెచ్చుకున్నారు.  చంద్రబాబుకి ఇచ్చింది షరతులతో కూడిన బెయిల్‌ మాత్రమే. కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే’’ అని వెల్లంపల్లి అన్నారు.  

చంద్రబాబు కనీసం 50 రోజులు కూడా సక్రమంగా లేరని.. ఇన్ని రోగాలు ఉన్న వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? అని వెల్లంపల్లి ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు రాజకీయాలకు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడు. తెలంగాణ ఎన్ని కల్లో పోటీ చేయిస్తామని చెప్పి కాసాని జ్ఞానేశ్వర్‌ను మోసం చేసారు. కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందంతో పోటీ చేయడం లేదని జెండా పీకేశారు. బీసీలను చంద్రబాబు మరోసారి మోసం చేశారు’’ అని వెల్లంపల్లి విమర్శించారు. 

ఇప్పుడు తెలంగాణాలో పోటీచేసే అవకాశం లేకుండా పార్టీ జెండా పీకేసిన చంద్రబాబు.. 2024లో ఏపీలోనూ అదే పని చేస్తారన్నారు. పవన్ టీడీపీతో కలిసినా ఏపీలో ప్రయోజనం లేదన్నారు. ‘‘తండ్రి జైలులో ఉంటే నారా లోకేష్ ఎక్కడ ఉన్నట్లు?. విజయనగరం భువనేశ్వరి కాకుండా లోకేష్ వెళ్లచ్చు కదా?. ఎందుకు వెళ్ళలేదు?’ అని వెల్లంపల్లి ప్రశ్నించారు.  లోకేష్ అసమర్ధుడని టీడీపీ క్యాడర్ భావిస్తుందన్నారాయన. 

ఎన్డీఆర్ చావుకు కారణమవ్వడమే కాకుండా నందమూరి కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు అవినీతిలో దగ్గుబాటి పురందేశ్వరికి కూడా వాటా ఉంది. బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూ.. టీడీపీకి అధికార ప్రతినిధిగా పురందేశ్వరి కొనసాగుతున్నారు. అమిత్ షా వద్దకు లోకేష్‌ను  పురందేశ్వరి తీసుకెళ్లలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబును కాపాడడానికే పురందేశ్వరి కంకణం కట్టుకున్నారని.. చంద్రబాబును జైలు నుంచి బయటకు తేవాలి, సీఎంను చేయాలన్నదే పురందేశ్వరి లక్ష్యం అని వెల్లంపల్లి ఆరోపించారు.

మరిన్ని వార్తలు