అన్నదమ్ముల సవాల్‌.. బెజవాడ టీడీపీలో ఏం జరుగుతోంది?

18 Dec, 2022 16:23 IST|Sakshi

తెలుగుదేశం ఎప్పుడో ప్రజలకు దూరమైపోయింది. రాష్ట్రంలో ఏ నియోజకవర్గం చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీని ప్రజలకు దగ్గర చేయడానికి ప్రయత్నించని తెలుగు తమ్ముళ్ళు తమలో తాము కుమ్ములాడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో అన్నదమ్ములే సవాళ్ళు విసురుకుంటున్నారు. ఇద్దరూ కలిసి చెరో రెండు కుంపట్లు రగిల్చారు. ఇంతకీ సవాళ్ళు విసురుకుంటున్న ఆ అన్నదమ్ములెవరో చూద్దాం.

నాని వర్సెస్ చిన్ని
గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీ గెలిచిన మూడు ఎంపీ సీట్లలో విజయవాడ ఒకటి. అయితే స్థానిక ఎన్నికల్లో మాత్రం పచ్చ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇదే సమయంలో బెజవాడ ఎంపీ కేశినేని నాని క్రమంగా పార్టీ అధినేత చంద్రబాబుకు దూరంగా జరిగారు. దీంతో పార్టీలో నాని సోదరుడు చిన్నిగా పిలిచే శివనాథ్‌ను చంద్రబాబు ఎంకరేజ్ చేయడం ప్రారంభించారు. పార్టీలో తనను కాదని.. తమ్ముడిని పైకి తీసుకువస్తున్న చంద్రబాబు తీరుతో కేశినేని నాని ఇప్పటికే అసమ్మతి కుంపట్లు రగిలిస్తున్నారు. ఇప్పుడు విజయవాడ వెస్ట్‌లో అన్నదమ్ముల సవాళ్ళతో తెలుగు తమ్ముళ్లు బిత్తరపోతున్నారట.

పొమ్మనలేక పొగబెట్టారు
కొంతకాలం క్రితం విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఇన్చార్జ్గా ఎంపీ కేశినేని నానిని చంద్రబాబు నియమించారు. అక్కడ పార్టీని బాగుచేయాలని ఆదేశించారు. అయితే అప్పటికే చంద్రబాబు తీరుతో గుర్రుగా ఉన్న నాని తన బాధ్యతలను పట్టించుకోలేదు. పైగా నానితో పొసగని బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా వంటి నేతలకు చంద్రబాబు నిర్ణయం మింగుడు పడలేదు. బెజవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడింది. దీంతో కేశినేని నానితో బుద్ధా వెంకన్న , నాగుల్ మీరాల వైరం మరింతగా పెరిగింది. ఇక కేశినేని నాని పెళ్లిళ్లకు , ఫంక్షన్లకు మినహా పశ్చిమ నియోజకవర్గంలో అడుగు పెట్టడం కూడా మానేశారట. గత మూడేళ్ల కాలంలో ఒక్క రోజు కూడా పార్టీ కార్యక్రమాల్లో నాని పాల్గొనలేదట. ఈ పరిణామాలతో లోకల్ కేడర్తో కూడా నానికి బాగా దూరం పెరిగింది.   

చిన్ని వెనక బాబు
కేశినేని నాని అటు పార్టీ అధినేతకు..ఇటు పార్టీ కేడర్కు దూరం కావడంతో..ఆయన తమ్ముడు చిన్నిని చంద్రబాబు తెరపైకి తెచ్చారు. చిన్ని ఎంట్రీతో పశ్చిమ నియోజక వర్గంలో మార్పులు మొదలయ్యాయట. కేశినేని నాని అంటే గిట్టని బుద్ధా వెంకన్న , నాగుల్ మీరాలు ఇప్పుడు చిన్ని నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారట. మైనార్టీ ఓట్లనే లక్ష్యంగా చేసుకున్న చిన్ని ఒకప్పుడు తన అన్నకు ముఖ్య అనుచరుల్లో ఒకరైన ఫతావుల్లాను తనవైపు తిప్పుకున్నారట. పరిణామాలన్నీ గమనిస్తున్న కేశినేని నాని..తమ్ముడు తననే దెబ్బతీసేవిధంగా వ్యవహరిస్తుండటంతో ఇటీవల తిరిగి పశ్చిమ నియోజకవర్గంపై దృష్టి పెట్టారట. ప్రస్తుతం పశ్చిమలో తనకు ముఖ్య అనుచరుడిగా ఉన్న ఎంకే బేగ్ ను తెరపైకి తెచ్చారట. నాని ఆదేశాలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంకే బేగ్ బిజీ అయ్యారు. ఇంతవరకు వెస్ట్లో లేని టీడీపీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారట. ఐతే ఇన్నేళ్ల పశ్చిమ టీడీపీ చరిత్రలో పార్టీకి కార్యాలయం అంటూ ఎరుగని కార్యకర్తలు ప్రస్తుతం నాని వర్సెస్ చిన్నిల మధ్య పోరులో భాగంగా వస్తున్న మార్పులను చూసి ఆశ్చర్య పోతున్నారట . 

వెన్నుపోటు రాజకీయాలు
ఇదిలా ఉంటే కేశినేని నాని మీద ఉన్న కోపంతో చిన్నికి జై కొడుతున్న బుద్ధా వెంకన్న , నాగుల్ మీరాల్లో తాజాగా కొత్త గుబులు మొదలైందట. 2024లో వెస్ట్ టిక్కెట్ తనకే ఇవ్వాలని నాగుల్ మీరా గట్టిగా పట్టుపడుతున్నారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానో... లేక వేరే పార్టీలోకి మారైనా పోటీ చేస్తానని ఇప్పటికే చాలామార్లు నాగుల్ మీరా స్పష్టం చేశాడట. ఇటువంటి సమయంలో.. నాని తరపున ఎంకే బేగ్, చిన్ని తరపున ఫతావుల్లా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటంతో పశ్చిమ క్యాడర్ లో కన్ఫ్యూజన్ మొదలైందట. కేశినేని సోదరుల రాజకీయం పుణ్యమా అని విజయవాడ వెస్ట్ టీడీపీలో నాలుగు గ్రూపులు తయారయ్యాయి. దీంతో మొదట్నుంచి పార్టీలో కొనసాగుతున్న టీడీపీ కార్యకర్తలు కలవరపడుతున్నారట. 
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు