ఫలించిన పాజిటివ్‌ మంత్రం

11 Mar, 2022 03:06 IST|Sakshi

యూపీలో బీజేపీ వ్యూహాలన్నీ సక్సెస్‌

కలిసొచ్చిన బీఎస్పీ పోరాటలేమి

మరోసారి పోరాడి ఓడిన అఖిలేశ్‌

దాదాపుగా కనుమరుగైన కాంగ్రెస్‌

ఉత్తరప్రదేశ్‌ ఓటర్లు చరిత్ర సృష్టించారు. యోగి ఆదిత్యనాథ్‌ పాలనకు జై కొట్టారు. మూడున్నర దశాబ్దాల ఆనవాయితీని తిరగరాస్తూ అధికార పార్టీ బీజేపీకి రెండోసారి అధికారం కట్టబెట్టారు. సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఒంటరి పోరాటం ఫలించలేదు. బీఎస్పీ పూర్తిగా చతికిలపడటం, కాంగ్రెస్‌ కనుమరుగవడం, బీజేపీ హిందూత్వ ప్రచారం, పాజిటివ్‌ మంత్రం తదితరాలు అఖిలేశ్‌ సారథ్యంలోని ఎస్పీ–ఆర్‌ఎల్డీ కూటమిని దెబ్బతీశాయి. శాంతిభద్రతలు, మోదీ ప్రజాదరణ, ఉచిత రేషన్, అభివృద్ధి వంటి సానుకూలాంశాలు యోగిని గట్టెక్కించాయి.

సవ్యమైన శాంతిభద్రతలు
యోగి పాలనలో సైతం గత ఐదేళ్లలో యూపీలో దారుణమైన నేరాలు అనేకం జరిగాయి. కానీ వాటికి పాల్పడ్డ వారిని యోగి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచేసిన తీరు ప్రజలకు నచ్చింది. నేరాలకు పాల్పడిన మాఫియా నేతలను ఎన్‌కౌంటర్లలో మట్టుపెట్టిన యోగి ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారు. ‘యోగి వల్ల మేం రాత్రి 12 గంటలకు కూడా రోడ్డుపై తిరగగలుగుతున్నాం. అంతకంటే మాకేం కావాలి?’ అని లక్నోకు చెందిన సురేఖ రాణి ప్రశ్నించారు.

నేరస్తుల పట్ల యోగి అత్యంత కఠినంగా వ్యవహరించారని ప్రజలు విశ్వసించారు. గతంతో పోలిస్తే యూపీలో హత్యలు, అత్యాచారాలు తగ్గాయని రాయ్‌బరేలీకి చెందిన కిషన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. ‘నేను యూపీలో విస్తృతంగా పర్యటించాను. యోగి ప్రభుత్వం పట్ల మహిళల్లో మంచి ఆదరణ కన్పించింది. దానికి మరో అవకాశం ఇవ్వాలన్న పట్టుదల చాలామందిలో గమనించా’ అని ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ విశ్లేషించారు. బీజేపీ మళ్లీ అధికారంలో రావడానికి మహిళల మద్దతు ప్రధాన కారణమని ఆయనన్నారు.

అవినీతి నియంత్రణ
యోగి తన ఐదేళ్ల పాలనలో అవినీతిని కొంతమేరకు నియంత్రించగలిగారు. ఇది కూడా ఆయనను మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి దోహదపడిందని రాజకీయ విళ్లేషకులు అంటున్నారు. ‘మరీ ముఖ్యంగా పై స్థాయిలో అవినీతిని యోగి బాగా నియంత్రించారని ప్రజలు నమ్మారు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని అదుపు చేయడంలో యోగి సఫలమయ్యారు. ఏ నియోజకవర్గంలో నేరాలు జరిగినా సంబంధిత ఎమ్మెల్యేదే బాధ్యత అన్న యోగి హెచ్చరికలు కూడా ప్రజలకు నచ్చాయి’ అని సెంటర్‌ ఫర్‌ పొలిటికల్‌ రీసెర్చ్‌ వ్యవస్థాపకుడు ప్రవీణ్‌ వర్మ అన్నారు. ‘కిందిస్థాయిలో అవినీతి ఉన్నా ప్రజలను ఇబ్బంది పెట్టేంతగా లేదని ప్రజలు విశ్వసించారు. మరోసారి యోగి గెలిస్తే అవినీతి మరింత తగ్గుతుందని కూడా నమ్మారు’ అని ప్రముఖ సెఫాలజిస్ట్‌ ప్రదీప్‌ గుప్తా విశ్లేషించారు.

పన్నులు పెంచినా వృద్ధీ ఉంది
యోగి హయాంలో పన్నులు బాగా పెంచారన్న అసంతృప్తి ప్రజల్లో లేకపోలేదు. కానీ అభివృద్ధి జరగాలంటే నిధులు కావాలి కదా అని సర్దుకుపోయే ధోరణిలో మాట్లాడుతున్న వాళ్లే ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల పనితీరు కూడా ఐదేళ్లలో బాగానే మెరుగుపడిందని ప్రజలు బహిరంగంగా చెపుతున్నారు. యోగికి మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వడానికి ఇవీ కారణాలేనన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.

సమాజ్‌వాదీ ఓటమికి కారణాలెన్నో..
అఖిలేశ్‌ను ఎలాగైనా మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలంటూ ముస్లింలలో వచ్చిన పెద్ద మార్పు యూపీలో హిందువుల పోలరైజేషన్‌కు ఉపయోగపడింది. బహుశా ఇదే బీజేపీని గెలిపించినట్టు కన్పిస్తోందని ప్రముఖ సెఫాలజిస్ట్‌ యోగేంద్ర యాదవ్‌ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యాదవులకు వ్యతిరేకంగా ఓబీసీలు బీజేపీ వైపు ర్యాలీ అయ్యారని ఆయన విశ్లేషించారు. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజకీయంగా దాదాపుగా కనుమరుగు కావడం కూడా అఖిలేశ్‌కు అతి పెద్ద మైనస్‌గా మారిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో ఆమె పెద్దగా ప్రచారం కూడా చేయలేదు.

మాయావతి అనాసక్తిని కనిపెట్టిన కొందరు దళితులు బీజేపీ పంచన చేరారు. మరికొందరు ఎస్పీకి వ్యతిరేకంగా పని చేశారు. నిజానికి ఈసారి ముస్లింలు, యాదవులు అఖిలేశ్‌కు ఏకమొత్తంగా మద్దతు పలికారు. అలా చూస్తే ఆయన పోరాటం నేరుగా 24 శాతం ఓట్లతో మొదలైంది! 2013 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇది ఏకంగా 4 శాతం అధికం. మరో 16 శాతానికి అటూఇటుగా ఓట్లు తెచ్చుకోగలిగి ఉంటే అధికారం ఆయన సొంతమయ్యేదే. కానీ అది చెప్పినంత తేలిక కాదు. యూపీ రాజకీయాల్లో  బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువే. వారు ఏ పార్టీకి మద్దతిస్తే వారి తరపున జోరుగా ప్రచారం చేస్తారు. పైగా మరో విశేషమేమంటే ఆ వర్గానికి చెందిన వారు కనీసం 90 శాతం దాకా కచ్చితంగా ఓటు వేస్తారు.

ఇది ఈసారి అఖిలేశ్‌కు బాగా మైనస్‌గా మారింది. గత ఐదేళ్లలో అఖిలేశ్‌ పార్టీని పటిష్టపరచుకోగలిగారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పెద్దగా పోరాటాలు చేయలేదన్న అపవాదుంది. ప్రజలను చైతన్యవంతులను చేసే ప్రయత్నంలో కూడా విఫలమయ్యారన్న విమర్శలు ఎక్కువయ్యాయి. అలాగే యాదవులు, ముస్లింలు మినహా మిగతా వర్గాలను అఖిలేశ్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఆయనకు ప్రజల్లో మంచి ఆదరణే ఉంది. కానీ, దాన్ని ఓట్లుగా మలుచుకోలేకపోయారు. అందుకు కావాల్సిన యంత్రాంగం, దాన్ని ముందుండి నడిపే వనరుల లేమి కూడా మైనస్‌ అయింది. బీజేపీ ఈ ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి.

మోదీ మంత్ర
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల యూపీ ప్రజలకున్న విశ్వాసం ఏమాత్రం సడలకపోవడం కూడా యోగికి ఈసారి పెద్ద వరమైంది. ‘యోగి కంటే మోదీకే యూపీలో ఎక్కువ పాపులారిటీ ఉంది. ఆయనపై ప్రజలకున్న తిరుగులేని విశ్వాసం కూడా అఖిలేశ్‌కు బాగా మైనస్‌ అయింది’ అని సెఫాలజిస్ట్‌ యశ్వంత్‌ దేశ్‌ముఖ్‌ అన్నారు. వీటికి తోడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ దాదాపుగా తుడిచిపెట్టుకుపోవడం కూడా అఖిలేశ్‌కు మరో పెద్ద మైనస్‌గా మారింది. ఎక్కడా కాంగ్రెస్‌ కనీసం ఐదు శాతం ఓట్లు కూడా చీల్చే పరిస్థితి కన్పించలేదు. దాంతో అధికార బీజేపీ ఓట్లు చీలలేదు.

– (సాక్షి ప్రత్యేక ప్రతినిధి కంచర్ల యాదగిరిరెడ్డి)

మరిన్ని వార్తలు