ఓటేద్దాం రండి!

30 Nov, 2023 03:19 IST|Sakshi

ఓటు ఎంతో విలువైనది.. వెలకట్టలేనిది. రాష్ట్ర భవిష్యత్,  ప్రజల తలరాతను  నిర్దేశించే శక్తివంతమైన  ఆయుధం ఓటే. ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటేయండి. వచ్చే ఐదేళ్లలో మీ ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చగలిగే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. ఐదేళ్లకోసారి మాత్రమే ప్రజాక్షేత్రంలోకి వచ్చే నేతలకు  మీ శక్తియుక్తులను తెలియజేయండి.  

ఓటరుకు 21 సెకన్లు 
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఒక్కో ఓ­ట­రు ఓటేసేందుకు సగ­టు­న 21 సెకన్ల సమయం కేటాయించనున్నారు. గురువారం ఉద­యం 7 గంటల నుంచి సా­యంత్రం 5 గంటల వరకు.. మొత్తం 10 గంటల పాటు పోలింగ్‌ జరుగుతుంది.  జీహెచ్‌ఎంసీ పరిధిలో­ని ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో గరిష్టంగా 1,550 మంది, మిగిలిన చోట్లలో గరిష్టంగా 1,500 మంది ఓటర్లు ఓటేసేందుకు ఏర్పాట్లు చేశారు.  

36,000 సెకన్ల పాటు పోలింగ్‌ 
పోలింగ్‌ కేంద్రంలో మొత్తం 36 వేల సెకన్ల పాటు పోలింగ్‌ జరగనుండగా, ఒక్కో ఓటరు ఓటేసేందుకు సగటున 21 సెకన్ల చొప్పున మొత్తం 31,500– 32,550 సెకన్ల సమయం పట్టనుంది. ఓటరు పోలింగ్‌ కేంద్రంలో ప్రవేశించిన వెంటనే తొలుత అతడి పేరు ఓటరు జాబితాలో ఉందా లేదా అని ఓ పోలింగ్‌ అధికారి పరిశీలించి నిర్థారిస్తారు. ఆ తర్వాత మరో అధికారి ఓటరు ఎడమచేతి చూపుడు వేలుకు సిరా చుక్క పెడతారు. అనంతరం మరో అధికారి ఈవీఎం కంట్రోల్‌ యూనిట్‌ను సిద్ధం చేసి ఓటరు ఓటేసేందుకు బ్యాలెట్‌ యూనిట్‌ ఉండే కంపార్ట్‌మెంట్‌లోకి పంపిస్తారు. ఈ మూడు ప్రక్రియలు 14 సెకన్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. 

జాబితాలో పేరు ఉందా? లేదా? ఎలా తెలుసుకోవాలి ? 
కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వెబ్‌సైట్‌  https://electoralsearch.eci.gov.in/  ద్వారా ఓటరు వివరాలు/ ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్‌)/ మొబైల్‌ నంబర్‌ ఆధారంగా జాబితాలో పేరును సెర్చ్‌ చేయడానికి ఈ పోర్టల్‌ అవకాశం కల్పిస్తోంది. మొబైల్‌ ఫోన్‌ నంబర్, ఎపిక్‌ కార్డు నంబర్‌ ఆధారంగా జాబితాలో పేరు సెర్చ్‌ చేయడం చాలా సులువు. గతంలో ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకున్న వారు మాత్రమే మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ ఆధారంగా పేరును సెర్చ్‌ చేయడానికి వీలుంటుంది. ఓటరు పేరు, తండ్రి పేరు/ వయసు ఇతర వివరాలను కీ వర్డ్స్‌గా వినియోగించి సెర్చ్‌ చేసినప్పుడు అక్షరాల్లో స్వల్ప తేడాలున్నా జాబితాలో పేరు కనిపించదు. 

ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌తో సకల సదుపాయాలు  
ఓటర్స్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా ఓటర్లకు సకల సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఓటర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవడం, ఓటర్ల జాబితాలో పేరు వెతకడం, పోలింగ్‌ కేంద్రం వివరాలు తెలుసుకోవడం, బీఎల్‌ఓ/ఈఆర్వోతో అనుసంధానం కావడం, ఈ– ఎపిక్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవడం వంటి సేవలను 
పొందవచ్చు.    

పోలింగ్‌ కేంద్రంలో సెల్‌ఫోన్లపై నిషేధం !
పోలింగ్‌ కేంద్రంలో మొబైల్‌ ఫోన్లు, కార్డ్‌ లెస్‌ ఫోన్లు, వైర్‌ లెస్‌ సెట్లతో ప్రవేశంపై నిషేధం ఉంది.  పోలింగ్‌ కేంద్రానికి చుట్టూ 100 మీటర్ల పరిసరాల పరిధిలోకి ఇలాంటి పరికరాలు తీసుకెళ్లకూడదు. పోలింగ్‌ బూత్‌లో ఓటు వేస్తూ సెల్ఫీలు తీసుకోవడానికి సైతం వీలు లేదని గతంలో ఎన్నికల  సంఘం స్పష్టం చేసింది. కేవలం ఎన్నికల పరిశీలకులు, సూక్ష్మ పరిశీలకులు, ప్రిసైడింగ్‌ అధికారులు, భద్రత అధికారులు మాత్రమే ఎన్నికల కేంద్రంలో మొబైల్‌ ఫోన్స్‌ తీసుకెళ్లవచ్చు.

అయితే వాటిని సైలెంట్‌ మోడ్‌లో ఉంచాల్సిందే. ఓటర్లు పోలింగ్‌ బూత్‌లో ప్రవేశించి ఓటు ఎవరికి వేశారో మొబైల్‌ ఫోన్‌ కెమెరాల్లో చిత్రీకరించే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. వీవీ ప్యాట్‌ యంత్రాల డిస్‌ప్లే స్క్రీన్‌పై ఓటు ఎవరికి వేశారో ఏడు క్షణాల పాటు కనిపించనుంది. దీనిని ఫోన్‌తో ఫొటో తీసే అవకాశం ఉండటంతో మొబైల్‌ ఫోన్లపై నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.  

నిర్ణీత సమయం దాటిన తర్వాత లైనులో ఉంటే ఓటుహక్కు కల్పిస్తారా? 
రాష్ట్రంలోని 13 వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. పోలింగ్‌ సమయం ముగిసిన తర్వాత కూడా పోలింగ్‌ కేంద్రం ముందు లైనులో నిలబడిన వారికి ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు.  పోలింగ్‌ సమయం ముగిసిన వెంటనే లైనులో ఉన్న వారికి పోలింగ్‌ అధికారులు టోకెన్లు ఇస్తారు.  

ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయవచ్చు ! 
పోలింగ్‌ కేంద్రాల వారీగా ప్రత్యేకంగా అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్‌(ఏఎస్‌డీ) ఓటర్ల జాబితా రూపొందించి సంబంధిత పోలింగ్‌ కేంద్రం ప్రిసైడింగ్‌ అధికారికి అందజేస్తారు. ఓటేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వచ్చే వ్యక్తి పేరు ఓటరు జాబితాలో లేకపోతే, ఆ వ్యక్తి పేరును ఏఎస్డీ ఓటర్ల జాబితాలో వెతకాలి. ఏఎస్డీ ఓటర్ల జాబితాలో ఆ వ్యక్తి పేరుంటే ఓటరు గుర్తింపు కార్డు/ లేదా ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ వ్యక్తి గుర్తింపును ప్రిసైడింగ్‌ అధికారి ముందుగా నిర్ధారించుకుంటారు.

అనంతరం ఆ వ్యక్తి పేరును ఫారం 17ఏలో నమోదు చేసి సంతకంతో పాటు వేలిముద్ర  తీసుకుంటారు. ఈ క్రమంలో తొలి పోలింగ్‌ అధికారి సదరు ఏఎస్డీ ఓటరు పేరును పోలింగ్‌ ఏజెంట్లకు గట్టిగా వినిపిస్తారు. సదరు ఓటరు నుంచి నిర్దిష్ట ఫార్మాట్‌లో డిక్లరేషన్‌ తీసుకోవడంతో పాటు ఫొటో, వీడియో   తీసుకుంటారు. అనంతరం అతడికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.  

వికలాంగులు, వృద్ధులు ఓటేసేందుకు  వాహన సదుపాయం కోసం  ఎవరిని సంప్రదించాలి.   స్థానిక బూత్‌ లెవెల్‌ అధికారి (బీఎల్‌ఓ)ని సంప్రదిస్తే ఆటో ద్వారా ఓటర్లను ఇంటి నుంచి పోలింగ్‌ కేంద్రానికి తరలించనున్నారు.  

పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉందో.. ఎలా తెలుసుకోవాలి ? 
రాష్ట్రంలోని ఓటర్లందరికీ ఎన్నికల సంఘం ఫొటో ఓటర్‌ ఇన్ఫర్మేషన్‌ స్లిప్పులు జారీ చేసింది. ఈ ఓటర్‌ స్లిప్పుల వెనకభాగంలో పోలింగ్‌ కేంద్రం రూటు మ్యాప్‌ను పొందుపరిచింది. ఈ రూట్‌ మ్యాప్‌తో సులువుగా పోలింగ్‌ కేంద్రానికి చేరుకోవచ్చు. 

కొత్త ఎపిక్‌ కార్డు నంబర్‌ ఎలా తెలుసుకోవాలి? 
గతంలో కేంద్ర ఎన్నికల సంఘం 13/14 అంకెల సంఖ్యతో ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేయగా, గత కొంత కాలంగా 10 అంకెల సంఖ్యతో కొత్త ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేస్తోంది. పాత ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌ ఆధారంగా మీ కొత్త ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌ తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయం రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్‌ https:// ceotserms2. telangana. gov. in/ ts& search/ Non& Standard& Epic. aspx  ను సందర్శించి మీ పాత ఎపిక్‌ కార్డు నంబర్‌ ఆధారంగా కొత్త ఎపిక్‌ కార్డు నంబర్‌ను తెలుసుకోవచ్చు.  

మీ ఓటును వేరేవాళ్లు వేసేశారా?  అయితే.. టెండర్‌ ఓటేయవచ్చు!
ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే సరికి మీ ఓటు వేరేవారు వేసేశారా? అయితే దిగులుపడాల్సిన అవసరం లేదు.  మీకు టెండర్‌ ఓటు వేసే హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌(ఈవీఎం) ద్వారా కాకుండా పేపర్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తారు. టెండర్‌ బ్యాలెట్‌ ఓటర్ల వివరాలను ప్రిసైడింగ్‌ అధికారులు ఫారం–17బీలో రికార్డు చేస్తారు.

ఈ ఫారంలోని 5వ కాలమ్‌లో  ఓటరు సంతకం/వేలి ముద్రను తీసుకున్న తర్వాత వారికి బ్యాలెట్‌ పత్రం అందజేస్తారు. ప్రత్యేక ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌లోకి ఓటరు బ్యాలెట్‌ పత్రాన్ని తీసుకెళ్లి తాము ఓటెయదలచిన అభ్యర్థికి చెందిన ఎన్నికల గుర్తుపై స్వస్తిక్‌ ముద్రను వేయాల్సి ఉంటుంది. ఓటేవరికి వేశారో బయటకు కనబడని విధంగా బ్యాలెట్‌ పత్రాన్ని మడిచి కంపార్ట్‌మెంట్‌ బయటకి వచ్చి ప్రిసైడింగ్‌ అధికారికి అందజేయాలి. ఆ బ్యాలెట్‌ పత్రాన్ని టెండర్‌ ఓటుగా ప్రిసైడింగ్‌ అధికారి మార్క్‌ చేసి ప్రత్యేక ఎన్వలప్‌లో వేరుగా ఉంచుతారు. 

చాలెంజ్‌ ఓటు అంటే ..?  
ఓటేసేందుకు వచ్చిన వ్యక్తి గుర్తింపును  అభ్యర్థుల పోలింగ్‌ ఏజెంట్లు రూ.2 చెల్లించి సవాలు చేయవచ్చు. ఓటరు గుర్తింపును  నిర్ధారించడానికి ప్రిసైడింగ్‌ అధికారి విచారణ జరుపుతారు. ఓటరు గుర్తింపు నిర్ధారణ జరిగితే ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు. దొంగ  ఓటరు అని నిర్ధారణ అయితే సదరు  వ్యక్తిని ప్రిసైడింగ్‌ అధికారి  పోలీసులకు అప్పగించి  రాతపూర్వకంగా  ఫిర్యాదు చేయాల్సి  ఉంటుంది.  

అక్కడ భారీగా బందోబస్తు 
119 స్థానాల్లోని 27 శాసనసభ నియోజకవర్గాల్లో 614 పోలింగ్‌ కేంద్రాలపై వామపక్ష ప్రభావం ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటికే మూడు దఫాలుగా పోలింగ్‌ ముందు, పోలింగ్‌ రోజు, పోలింగ్‌ తర్వాత చేపట్టాల్సిన బందోబస్తుపై ప్రత్యేక ప్రణాళిక చేపట్టారు. ఓటింగ్‌ రోజు పక్కాగా 144 సెక్షన్‌ అమలు, పోలింగ్‌ తర్వాత చీకటి పడకముందే ఈవీఎంలను భద్రంగా స్ట్రాంగ్‌రూంకు తరలించడం, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా రక్షణ కల్పించనున్నారు. మావోయిస్టుల తీవ్ర ప్రభావమున్న 13 నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్‌ ముగించనున్నారు.   

అనుచితంగా ప్రవర్తిస్తే పోలింగ్‌ బూత్‌ నుంచి గెంటివేతే  స్పష్టం చేస్తున్న నిబంధనలు  
పోలింగ్‌ సమయంలో పోలింగ్‌ కేంద్రంలో అనుచితంగా ప్రవర్తించిన లేదా చట్టపర ఆజ్ఞలను పాటించడంలో విఫలమైన వ్యక్తులను  ప్రిసైడింగ్‌ అధికారి  బయటకు పంపించవచ్చు అని కేంద్ర ఎన్నికల సంఘం గతంలో స్పష్టం చేసింది.

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 132 కింద ఈ మేరకు అధికారాలు ప్రిసైడింగ్‌ అధికారికి ఉన్నాయని పేర్కొంది. మద్యం సేవించినా లేదా మాదక ద్రవ్యాలను వినియోగించిన వ్యక్తులను పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించకుండా నిలువరించేందుకు అనుమతి కోరుతూ గత శాసనసభ సాధారణ ఎన్నికల సందర్భంగా నాటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్‌ రాసిన లేఖకు స్పందిస్తూ అప్పట్లో ఈ మేరకు స్పష్టతనిచ్చింది.

మద్యం సేవించి పోలింగ్‌ కేంద్రానికి వచ్చే వ్యక్తుల ఓటు హక్కును నిరాకరించడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. మద్యం లేదా మాదక ద్రవ్యాల మత్తులో విచక్షణ కోల్పోయి పోలింగ్‌ కేంద్రంలో ఓటింగ్‌ ప్రక్రియకు ఆటంకం కలిగించే వ్యక్తులను మాత్రం పోలీసుల సహాయంతో బయటకు పంపించేందుకు నిబంధనలు అనుమతిస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి. 

వెబ్‌కాస్టింగ్‌తో ప్రత్యక్ష ప్రసారం
ఓటు హక్కు వినియోగించుకునే దృశ్యం ప్రత్యక్ష ప్రసారం కానుంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా 3.26 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే దృశ్యాలు పోలింగ్‌ కేంద్రాల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఓటర్లే కాదు.. ఎన్నికల విధుల్లో పాల్గొననున్న పోలింగ్‌ అధికారులు,  ప్రిసైడింగ్‌ అధికారులు, భద్రత సిబ్బంది, పోలింగ్‌ ఏజెంట్ల ప్రతి కదలికను ఎన్నికల సంఘం లైవ్‌గా వీక్షించనుంది.

 పోలింగ్‌ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 27,094 పోలింగ్‌ కేంద్రాల్లో నిర్వహించనున్న పోలింగ్‌ ప్రక్రియను ఆద్యంతం ‘లైవ్‌ వెబ్‌కాస్ట్‌’ చేయనున్నారు. ఎక్కడ ఎలాంటి అపశ్రుతి చేసుకున్నా, ఎవరైనా ఆటంకం సృష్టించినా, ఏమైనా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నా క్షణాల్లో ఎన్నికల సంఘం సంబంధిత పోలింగ్‌ కేంద్రంలోని పరిస్థితులను లైవ్‌ వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా వీక్షిస్తుంది.

వెంటనే  స్థానిక పోలింగ్‌ అధికారులకు సూచనలు జారీ చేస్తుంది. ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు, హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ), జిల్లా కేంద్రాల నుంచి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, నియోజకవర్గ కేంద్రాల నుంచి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు పోలింగ్‌ ప్రక్రియను వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా టీవీ తెరలపై ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. సాంకేతికంగా ప్రత్యక్ష ప్రసారం సాధ్యం కాని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మాత్రం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు కానుంది.   

ప్రతి కదలిక ప్రత్యక్ష వీక్షణ 
♦ లైవ్‌ వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ ప్రక్రియను ఎప్పటికప్పుడు చూసేందుకు ఏర్పాట్లు 
♦ పోలింగ్‌ కేంద్రంలో ప్రవేశించిన ఓటరును పోలింగ్‌ అధికారి గుర్తించే ప్రక్రియ.
♦ ఓటరు వేలి మీద సిరా చుక్క రాయడం  
♦ ఓటరును గుర్తించిన అనంతరం ఈవీఎంకు  సంబంధించిన కంట్రోల్‌ యూనిట్‌ను ప్రిసైడింగ్‌ అధికారి స్టార్ట్‌ చేయడం
​​​​​​​​​​​​​​♦ ఓటు వేసేందుకు పోలింగ్‌ కంపార్ట్‌మెంట్‌లో ఓటరు ప్రవేశించే దృశ్యం. అయితే, ఓటు ఎవరికి వేశారన్న రహస్యాన్ని కాపాడేందుకు ఈవీఎం బ్యాలెట్‌ యూనిట్‌ కనిపించని విధంగా కెమెరా ఏర్పాట్లు చేస్తారు.  
​​​​​​​♦ పోలింగ్‌ స్టేషన్‌లో పోలింగ్‌ ఏజెంట్ల కదలికలు  
​​​​​​​♦ పోలింగ్‌ ముగింపు సమయంలో ఇంకా ఓటేసేందుకు వరుసలో నిలబడిన ఓటర్లకు టోకెన్లు/స్లిప్పులు అందించే ప్రక్రియ.  
​​​​​​​♦ పోలింగ్‌ ముగిసిన తర్వాత ఈవీఎంలు(బ్యాలెట్‌ యూనిట్‌/కంట్రోల్‌ యూనిట్‌), వీవీ ప్యాట్‌లను సీల్‌ వేసే దృశ్యంతో పాటు  పోలింగ్‌ ఏజెంట్లకు 17సీ కాపీలు అందజేసే దృశ్యం.  
​​​​​​​♦ కనీసం 7–8 అడుగులకు మించిన ఎత్తులో కెమెరాలను ఏర్పాటు  చేయనున్నారు.
​​​​​​​♦  కెమెరాను గోడకు స్టాండ్‌ ఆధారంగా, లేదా  స్థిరంగా ఉండే విధంగా ఓ చోట బిగిస్తారు.  
​​​​​​​♦ వెబ్‌ కెమెరా/సీసీటీవీ నిఘా పరిధిలో మీరు ఉన్నారని పోలింగ్‌ కేంద్రం వద్ద హెచ్చరిక నోటీసులు అతికిస్తారు.  

పోలింగ్‌ ప్రక్రియ ఎలా జరుగుతుంది ?
పోలింగ్‌ కేంద్రంలో ప్రవేశించిన వ్యక్తికి ఆ పోలింగ్‌ కేంద్రం ఓటర్ల జాబితాలో పేరు ఉందా? లేదా ? అన్న విషయాన్ని ఏదైనా  గుర్తింపుకార్డు ఆధారంగా తొలి పోలింగ్‌ అధికారి పరిశీలిస్తారు. రెండో పోలింగ్‌ అధికారి ఆ ఓటరు ఎడుమ చేతి చూపుడు వేలుకు సిరా చుక్క అంటించి, ఓ స్లిప్పు అందజేస్తారు. ఫారం–17ఏలో వివరాలు నమోదు చేసి ఓటరు సంతకం తీసుకుంటారు. మూడో పోలింగ్‌ అధికారి వద్ద ఆ స్లిప్పును డిపాజిట్‌ చేసి, సిరా చుక్క అంటించిన వేలును చూపిస్తే ఓటేసేందుకు పోలింగ్‌ బూత్‌లోకి పంపిస్తారు. అక్కడ మూడో పోలింగ్‌ అధికారి ఓటు వేసేందుకు సాంకేతికంగా ఈవీఎంను సిద్ధం చేసి పెడతారు.  

ఈవీఎంలో ఓటు ఎలా వేయాలి ? 
ఈవీఎంలో కంట్రోల్‌ యూనిట్, బ్యాలెట్‌ యూనిట్, వీవీప్యాట్‌ పరికరాలుంటాయి. ప్రిసైడింగ్‌ అధికారి నియంత్రణలో కంట్రోల్‌ యూనిట్‌ ఉంటుంది. బ్యాలెట్‌ యూనిట్, వీవీ ప్యాట్‌ మాత్రం ఓటరు ఓటువేసే కంపార్ట్‌మెంట్‌లో ఉంటాయి. బ్యాలెట్‌ యూనిట్‌పై ఓటరు తనకు నచ్చిన అభ్యర్థి పేరు పక్కన ఉన్న నీలిరంగు మీటను నొక్కగానే..ఆ అభ్యర్థి పేరు, మీట మధ్యలో ఉండే రెడ్‌లైట్‌ వెలుగుతుంది.

ఆ వెంటనే ఓటు ఎవరికి పడిందో తెలిపేందుకు అభ్యర్థి పేరు, క్రమసంఖ్య, ఎన్నికల గుర్తుతో ఓ స్లిప్పు వీవీప్యాట్‌పై ప్రింట్‌ అవుతుంది. 7 సెకండ్ల పాటు వీవీప్యాట్‌ డిస్‌ప్లే విండోపై ఈ స్లిప్‌ ఓటరుకు ప్రదర్శితమవుతుంది. ఆ తర్వాత వీవీప్యాట్‌లోని డ్రాప్‌ బాక్స్‌లోకి స్లిప్‌ పడిపోతుంది. ఆ వెంటనే ఓటు విజయవంతంగా పడినట్టు బీప్‌ శబ్దం వినిపిస్తుంది.    

ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
​​​​​​​♦ ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డులుంటే ఓకే 
​​​​​​​♦ ఎపిక్‌ కార్డులో స్వల్ప తేడాలున్నా ఓటేయవచ్చు 
​​​​​​​♦ ఎపిక్‌తో గుర్తింపు ధ్రువీకరణ కాకుంటే ప్రత్యామ్నాయ గుర్తింపు తప్పనిసరి 
​​​​​​​♦ ఓటరు  ఇన్‌ఫర్మేషన్‌  స్లిప్పును గుర్తింపుగా  పరిగణించరాదు 
​​​​​​​♦ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈసీ కొత్త మార్గదర్శకాలు 

ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్‌)లోని వివరాల్లో స్వల్ప తేడాలున్నా, ఓటరు గుర్తింపు నిర్ధారణ అయితే ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వేరే నియోజకవర్గానికి సంబంధించిన ఓటరు గుర్తింపు కార్డును చూపించి, మరో నియోజకవర్గం పరిధిలోని పోలింగ్‌ కేంద్రంలో ఉన్న ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చే వారికి సైతం ఓటు హక్కు కల్పించాలని సూచించింది. అయితే, ఆ పోలింగ్‌ కేంద్రం ఓటర్ల జాబితాలో పేరు ఉంటేనే ఈ సదుపాయం కల్పించాలని కోరింది.  ఓటరు గుర్తింపు నిర్ధారణ విషయంలో ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. 

ఎపిక్‌లో  లోపాలుంటే వేరే గుర్తింపు తప్పనిసరి.. 
ఓటరు గుర్తింపు కార్డులో ఫొటోలు తారుమారుకావడం, ఇతర లోపాలతో ఓటరు గుర్తింపు ధ్రువీకరణ సాధ్యంకానప్పుడు,  కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు పత్రాల్లో(కింద జాబితాలో చూడవచ్చు) ఏదైనా ఒకదానిని ఆధారంగా చూపాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. ప్రవాస భారత ఓటర్లు తమ పాస్‌పోర్టును తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని తెలిపింది.

పోలింగ్‌కు కనీసం 5 రోజుల ముందు పోలింగ్‌ కేంద్రం పేరు, తేదీ, సమయం, ఇతర వివరాలతో ఓటర్లకు పోలింగ్‌ ఇన్ఫర్మేషన్‌ స్లిప్పులను జారీ చేయాలని ఆదేశించింది. అయితే, వీటిని ఓటరు గుర్తింపుగా పరిగణించరాదని స్పష్టం చేసింది. ఓటరు గుర్తింపు కార్డు లేనిపక్షంలో, ఉన్న గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానిపక్షంలో పోలింగ్‌ రోజు ఈ కింది జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో ధ్రువీకరణ పత్రాలను తీసుకువస్తే ఓటు హక్కు కల్పించాలని ఆదేశించింది.  

​​​​​​​♦ ఆధార్‌కార్డు 
​​​​​​​♦ ఉపాధి హామీ 
​​​​​​​♦ జాబ్‌కార్డు 
​​​​​​​♦ బ్యాంకు/తపాలా కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్‌ 
​​​​​​​♦ కేంద్ర కార్మికశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌ కార్డు 
​​​​​​​♦ డ్రైవింగ్‌ లైసెన్స్‌
​​​​​​​♦ పాన్‌కార్డు 
​​​​​​​♦ రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సెస్‌ కమిషనర్, ఇండియా(ఆర్జీఐ).. నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్ట్రార్‌(ఎన్పిఆర్‌) కింద జారీ చేసిన స్మార్ట్‌ కార్డు  
​​​​​​​♦ భారతీయ పాస్‌పోర్టు ​​​​​​
​​​​​​​♦  ఫొటో గల పెన్షన్‌ పత్రాలు  
​​​​​​​♦ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్‌యూలు/ పబ్లిక్‌ లిమిటెడ్‌  కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డులు 
♦ ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు 
​​​​​​​♦కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్‌ డిజెబిలిటీ గుర్తింపు కార్డు(యూడీఐడీ) 

 - ముహమ్మద్‌ ఫసియొద్దీన్‌

మరిన్ని వార్తలు