నేడు వేతనంతో కూడిన సెలవు  | Sakshi
Sakshi News home page

నేడు వేతనంతో కూడిన సెలవు 

Published Thu, Nov 30 2023 1:53 AM

Today is a paid holiday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్‌ 30న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు వేతనంతో కూడిన సెలవును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నెగోషియబుల్‌ ఇన్‌స్రూ్టమెంట్‌ యాక్ట్‌ 1881 కింద ఈ మేరకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గత అక్టోబర్‌ 16న ఉత్తర్వులు జారీచేశారు.

తెలంగాణ ఫ్యాక్టరీస్‌ అండ్‌ ఎస్టాబ్లిష్మెంట్‌ యాక్ట్‌–1974 కింద అన్ని పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, ఇతర ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగులు, కార్మికులు, కూలీలు, ఇండ్రస్టియల్‌ అండర్‌టేకింగ్స్, ఎస్టాబ్లిష్మెంట్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు పోలింగ్‌ రోజు వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ ఈనెల 15న రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణీకుముదిని ఉత్తర్వులు జారీచేశారు. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వని పక్షంలో కార్మిక, ఎన్నికల చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌ ఆదేశించారు.
 
పోలింగ్, కౌంటింగ్‌ కేంద్రాలుఏర్పాటు చేస్తే సెలవులు 
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఏవైనా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల భవనాల్లో పోలింగ్‌ కేంద్రాలు, కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఆయా కార్యాలయాలు, సంస్థల ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులను ప్రకటించే అధికారాన్ని స్థానిక జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.

నవంబర్‌ 29న పోలింగ్‌కు ముందు రోజు, 30న పోలింగ్‌ రోజు, డిసెంబర్‌ 3న కౌంటింగ్‌ రోజు అక్కడి ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించాలని సూచించింది. అన్ని పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు ఇతర ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగులు, కార్మికులు, కూలీలకు గురువారం వేతనంతో కూడిన సెలవును రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈమేరకు సంబంధిత సంస్థల యాజమాన్యాలకు సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Advertisement
Advertisement