సీఎం రేవంత్‌కు బండి సంజయ్‌ లేఖ.. కేసీఆర్‌పై చర్యలు తీసుకోండి

18 Dec, 2023 18:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కరీంనగర్‌ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎంగా రేవంత్‌ బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు బండి సంజయ్‌. 

కాగా, సీఎం రేవంత్‌కు రాసిన లేఖలో బండి సంజయ్..‘ఉమ్మడి రాష్ట్రంలో 17 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం మిడ్ మానేరు ప్రాజెక్టును ప్రారంభించింది. లక్షలాది ఎకరాలకు సాగు నీటితోపాటు తాగునీటి అవసరాలను తీరుస్తుందనే భావనతో ప్రాజెక్టు ముంపు పరిధిలోని 12 గ్రామాల ప్రజలు ఇండ్లు, భూములు త్యాగం చేశారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 12 వేల 500 మంది బాధితులున్నారు. వీరికి సహాయ పునరావాస ప్యాకేజీ కింద 2005-06లో నాటి ప్రభుత్వం చేపట్టిన జీవో నెం.69 ప్రకారం ఐఏవై కింద ఇండ్లు మంజూరు చేసింది. ముంపు పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. 

అయితే వీటి అమలులో మాత్రం తీవ్రమైన జాప్యం జరిగింది. 2018 జూన్ 15న నాటి సీఎం కేసీఆర్(మాజీ ముఖ్యమంత్రి) ఈ ప్రాంతానికి వచ్చి మిడ్ మానేరు బాధితులకు ఐఏవై ఇండ్లకు బదులుగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామని, అందులో భాగంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల 4 వేలు చెల్లిస్తానని హమీ ఇచ్చారు. 12 గ్రామాల రైతులంతా సాగు భూమిని కోల్పోయిన నేపథ్యంలో వారికి నైపుణ్యత పెంచి స్వయం ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. అలాగే 2009 కొత్త గెజిట్ ప్రకారం 2015 జనవరి నాటికి 18 ఏండ్లు నిండిన యువతీ యువకులకు ముంపు పరిహారం, పట్టా ఇస్తామని చెప్పారు. కానీ నేటికి ఒక్క అడుగు ముందుకు పడలేదు.

రెండేళ్ల క్రితం మిడ్ మానేరు ముంపు బాధితుల కోసం కొదురుపాకలో నిర్వహించిన అఖిలపక్ష ‘మహాధర్నా’లో మీరు (రేవంత్ రెడ్డి), నేను (బండి సంజయ్) హాజరై ముంపు బాధితులకు సంఘీభావం తెలిపాం. నాటి ధర్నాలో మిడ్ మానేరు బాధితుల సమస్యలను పరిష్కరించేదాకా వారి పక్షాన పోరాటం చేస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని మీరు హామీ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి మీరు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కాబట్టి మీరు తక్షణమే పెంచిన ఇండ్ల నిర్మాణ పరిహారాన్ని చెల్లించాలని కోరుతున్నాం. అదే విధంగా 2015 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు సైతం ప్యాకేజీని వర్తింపజేయాలి. 

అదే సమయంలో ముంపు పరిహారం చెల్లింపు విషయంలో అర్హత లేకపోయినా రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మాజీ సీఎం కేసీఆర్ బంధువులకు సైతం ప్యాకేజీ కింద పరిహారం చెల్లించారని, అధికారంలోకి వచ్చాక వీరిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు