బండి సంజయ్ వర్సెస్‌ గంగుల కమలాకర్‌

19 Nov, 2023 15:06 IST|Sakshi

ఎన్నికలు ఏవైనా ఒకరు ఓడితేనే మరొకరు గెలుస్తారు. రాష్ట్రం అంతటా ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరా హోరీ పోరాడుతున్నారు. ఆ నగరంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ అనుకూల ఓట్లన్నీ ఒక్క చోటుకు చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక అభ్యర్థి హిందుత్వమే తన నినాదమని ప్రచారం చేస్తున్నారు. మరొకరు సెక్యులర్ విధానమే మా నినాదం అంటున్నారు. రెండు విభిన్న ధృవాల మధ్య జరుగుతున్న పోరు ఆసక్తికరంగా మారుతోంది. ఇంతకీ ఆ సిటీ ఎక్కడో...ఆ ప్రత్యర్థులు ఎవరో చూద్దాం.

కరీంనగర్ సిటీలో మరోసారి కమలం గుర్తుపై బండి సంజయ్, కారు గుర్తుపై మంత్రి గంగుల కమలాకర్‌ ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. ఇద్దరి మధ్యా కుటుంబాల పరంగా సాన్నిహిత్యం ఉన్నప్పటికీ... ఎన్నికల గోదాలో దిగాక చావో రేవో అన్న విధంగా పోరాటం చేయక తప్పదు. అందుకే కారు, కమలం పార్టీల అభ్యర్థుల మధ్య మాటల తూటాలు భీకరంగా పేలుతున్నాయి. ఓట్ల పోలరైజేషన్ కోసం ఇరు పక్షాలు హోరా హోరీ తలపడుతున్నాయి. హిందూ ఓట్లు తనను దాటి పోకుండా చూసుకునేందుకు బండి సంజయ్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా సంప్రదాయంగా గులాబీ పార్టీకి పడుతున్న ఓట్లతో పాటు...మైనారిటీ ఓట్లన్నీ గంపగుత్తగా తనకే పడేలా మంత్రి గంగుల కమలాకర్‌ తనవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 

కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 55 వేల వరకూ ఉన్న ముస్లిం మైనార్టీల ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. కారు, కమలం పార్టీలనుంచి పోటీ చేస్తున్న గంగుల కమలాకర్, బండి సంజయ్ గెలుపోటములను మైనారిటీల ఓట్లే నిర్ణయిస్తాయి. గత ఎన్నికల్లోనూ మైనారిటీల ఓట్లు గంపగుత్తగా సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ కే పడటంతో..నాడు బండి సంజయ్ పుట్టి మునిగింది. అప్పటివరకూ టగ్ ఆఫ్ వార్ లా నడిచిన పోలింగ్‌లో.. మధ్యాహ్నం తర్వాత ముస్లిం మైనార్టీ ఓటర్లంతా పోలింగ్ బూతులకు పోటెత్తారు. ఆ ఓట్లన్నీ కారు గుర్తుకే గంపగుత్తగా గుద్దేసి కారును పరుగులు తీయించారు. గంగుల 14 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో బండి సంజయ్ పై విజయం సాధించారు. ఈ క్రమంలో హిందూ, ముస్లిం ఓట్ బ్యాంక్ రాజకీయాలకు ఇప్పుడు కరీంనగర్ వేదికైంది. ఈసారి తనకు హిందూ ఓట్లన్నీ గంపగుత్తగా వచ్చేస్తే..కాంగ్రెస్ పార్టీకి కూడా ముస్లిం మైనార్టీలు మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు మైనారిటీ ఓట్లను పంచుకుంటే.. ఇక తన గెలుపు నల్లేరుపైన నడకేనని బండి సంజయ్ ఆశిస్తున్నారు. ఆయన ప్రచారం కూడా దానికి అనుగుణంగానే సాగుతోంది. 

ఇక బండి సంజయ్ వ్యాఖ్యలపై గంగుల కమలాకర్ కూడా అదే రేంజ్‌లో కౌంటర్లు ఇస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారని..ఎలాంటి శాంతిభద్రతల సమస్యల్లేకుండా కరీంనగర్ ప్రశాంతంగా ఉందని అంటూ..విధ్వంసకారులు కావాలా...నిర్మాణాత్మక నాయకత్వం కావాలా అన్నది ప్రజలు ఆలోచించాలంటూ గంగుల ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా తాము చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు...కళ్యాణలక్ష్మీ, రైతుబంధు, దళితబంధు, బీసీబంధు, గురుకులాలు, మైనార్టీ వెల్ఫేర్ స్కూల్స్, మిషన్ భగీరథ, తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్, కరీంనగర్ రోడ్లు, స్మార్ట్ సిటీ డెవలప్ మెంట్ వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ సిటీకి ఎంఐఎం మేయరంటూ బండి సంజయ్ ప్రచారం చేశారని.. పాడిందే పాట అన్నట్టుగా బండి ప్రచారం సాగుతోందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..సెక్యులర్ విధానమే..తమ నినాదమనీ గంగుల కుండబద్ధలు కొడుతున్నారు.

గతంలో సీఎం కేసీఆర్ హిందుగాళ్లు, బొందుగాళ్లంటూ ప్రచారం చేశారంటూ..లోక్‌సభ ఎన్నికల్లో దాన్ని ముమ్మురంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన బండి సంజయ్.. ప్రజల భావోద్వేగాలపై ముద్ర వేసే వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా హిందుత్వ ఓట్ బ్యాంకును పోలరైజ్ చేసి.. గంపగుత్తగా తనవైపు తిప్పుకునే క్రమంలో బండి సంజయ్ మరోసారి ఎత్తుకుంటున్న నినాదాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. సెక్యులర్ నినాదమే తమ విధానమంటూ ముందుకెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల ప్రచారం ఎలాంటి ప్రభావం చూపుతుందా అన్న ఆసక్తి నెలకొంది. రోజులు గడిచేకొద్దీ..పోలింగ్‌ తేదీ దగ్గరపడేకొద్దీ ఈ నేతల ప్రచార యుద్ధం ఇంకెంత హాట్ హాట్‌గా సాగుతుందోనన్న ఆసక్తికర చర్చ కరీంనగర్ సిటీలో జరుగుతోంది.

మరిన్ని వార్తలు