‘విక్రమార్కుడి’ విజయ పరంపర 

4 Dec, 2023 01:33 IST|Sakshi

అధిష్టానం నాకు ఏ పదవి ఇచ్చినా దాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తా.  –భట్టి విక్రమార్క

భట్టి ఘనవిజయం... వరుసగా నాలుగోసారి గెలుపు 

ప్రతీ ఎన్నికలో పెరిగిన మెజారిటీ  

 

సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్క విజయపరంపర మరోసారి కొనసాగింది. భారీ మెజార్టీతో ఆయన మధిర ఎమ్మెల్యేగా నాలుగోసారి గెలిచారు. 2009, 2014, 2018లో వరుసగా విజయం సాధించిన భట్టి ఈ ఎన్నికల్లోనూ అదే ఒరవడి కొనసాగించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భట్టి భారీ మెజార్టీ కైవసం చేసుకున్నారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌పై 35,452 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో భట్టికి 1,08,970 ఓట్లు రాగా.. కమల్‌రాజ్‌కు 73,518 ఓట్లు వచ్చాయి. ఈ నాలుగు ఎన్నికల్లోనూ లింగాల కమల్‌రాజ్‌పైనే ఆయన విజయం సాధించడం మరో విశేషం. 2009లో ఆయన 1,417 ఓట్లతో, 2014లో 12,329 మెజార్టీతో, 2018లో 3,567 ఓట్లతో విజయం సాధించగా.. ప్రస్తుతం 35,452 ఓట్ల భారీ మెజార్టీతో పొందారు. ప్రస్తుతం సీఎల్పీ నేతగా ఉన్న భట్టికి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉన్నత పదవి దక్కుతుందని మధిర నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. 

ఏ పదవినిచ్చినా బాధ్యతగా నిర్వర్తిస్తా.. 
‘సీఎంగా ఎవరనేది సీఎల్పీ అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం తీసుకుంటుంది. ఆ తర్వాత సీఎం ఎవరనేది పార్టీ అధిస్టానం ప్రకటిస్తుంది. నాకు ఏ పద వి ఇచ్చినా బాధ్యతగా నిర్వర్తిస్తాను’అని భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. పదేళ్లుగా ప్రజలకు దూరంగా ఉన్న ప్రగతిభవన్‌ను ప్రజాపాలన భవన్‌గా మారుస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను పాలనలో భాగస్వాములను చేస్తుందని తెలిపారు.

ఖమ్మంలో ఆదివారం ఆయన కౌంటింగ్‌ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణను సాధించుకున్నామని, ఇప్పుడు ఆ లక్ష్యాలను నిజం చేయడం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని భట్టి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ అధికారి, ఉద్యోగి సమాజం కోసం, ప్రజల కోసం పనిచేయాలని భట్టి కోరారు. గెలుపొందిన అభ్యర్థులకు అభినందనలు తెలిపిన ఆయన,  యావత్‌ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.  

>
మరిన్ని వార్తలు