Rajasthan Election: భార్యను ఓడించిన భర్త.. అన్నను మట్టికరిపించిన చెల్లి!

4 Dec, 2023 08:19 IST|Sakshi

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో భారీ పరాజయాలతో పాటు పలు ఆసక్తికర ఫలితాలు కూడా చోటు చేసుకున్నాయి. రాజస్థాన్‌లో ఓ సీటులో భార్యను భర్త ఓడించగా, మరోచోట అల్లుడు, మామ.. ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇంకో సీటులో అన్నదమ్ములిద్దరూ ఓటమి పాలయ్యారు.

రాజస్థాన్‌లోని సీకార్‌ జిల్లాలో గల దంతారామ్‌గఢ్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి వీరేంద్ర సింగ్‌ విజయం సాధించారు. ఆయనకు ప్రత్యర్థిగా ఆయన భార్య రీటా సింగ్ జేజేపీ నుంచి పోటీ చేశారు. వీరేంద్ర సింగ్ తన భార్యను ఓడించారు. వీరేంద్ర సింగ్ గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఈయన పీసీసీ మాజీ చీఫ్ నారాయణ్ సింగ్ కుమారుడు. మార్వార్ ప్రాంతంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రిచ్‌పాల్ మిర్ధా కుమారుడు విజయపాల్ మిర్ధా.. దేగానా నుంచి, మరో కుమారుడు ఖిన్వ్‌సర్ నుంచి కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేశారు. అయితే వీరిద్దరూ ఓటమి పాలయ్యారు.

ఇంతకంటే విచిత్రమైన ఉదంతం ధోల్‌పూర్‌లో చోటుచేసుకుంది. ధోల్‌పూర్‌లో కాంగ్రెస్‌కు చెందిన శోభారాణి కుష్వాహా.. బీజేపీ అభ్యర్థి, తన సోదరుడు శివచరణ్ కుష్వాహపై విజయం సాధించారు. జైపూర్‌లోని ఫూలేరా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ గుర్తుపై గెలుపొందిన విద్యాధర్ చౌదరి అల్లుడు శైలేష్ సింగ్, దీగ్ కుమ్హెర్ నుంచి బీజేపీ టికెట్‌పై గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.

రాజస్థాన్‌లో 199 స్థానాలకు నవంబర్ 25న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 115, కాంగ్రెస్‌కు 70 సీట్లు వచ్చాయి. 14 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు, ఇతర అభ్యర్థులు విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సీఎం అశోక్ గెహ్లాట్ రాజీనామా చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
ఇది కూడా చదవండి: 17 రాష్ట్రాల్లో కాషాయ దళం.. దూసుకుపోతున్న మోదీ మ్యాజిక్‌!

>
మరిన్ని వార్తలు