మీరు తాగొచ్చారు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం

14 Dec, 2022 15:58 IST|Sakshi

పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ అసెంబ్లీలో ఆగ్రహంతో ఊగిపోయారు. సభలో ఆందోళనలు చేపట్టిన ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరంతా తాగొచ్చారని గట్టిగా అరిచారు. దీంతో అసెంబ్లీలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బిహార్‌లో 2016లోనే మద్యాన్ని నిషేధించారు. అయితే కల్తీ మద్యం మాత్రం విచ్చలవిడిగా దొరుకుతోంది. ఇది తాగి ఛప్రా సరన్ జిల్లాలో 17 మంది చనిపోయారు. ఇందులో ఆరుగురు మంగళవారమే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంపైనే ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు సీఎంపై విమర్శలు గుప్పించారు. కల్తీ మద్యాన్ని అరికట్టలేకోయిన సీఎం అసెంబ్లీ ద్వారం వద్ద నిల్చొని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో నితీశ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ప్రతిపక్ష నేతల తీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరిగింది? కాస్త శాంతియుతంగా ఉండండి. మీరంతా తాగి వచ్చినట్లు ఉన్నారు. అని ఫైర్ అయ్యారు. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు మళ్లీ నిరసనకు దిగారు.

ఛప్రా సరన్ జిల్లాలో మంగళవారం చనిపోయిన ఆరుగురి మరణానికి ఇంకా కారణం తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. వీరంతా కల్తీ మద్యం తాగే చనిపోయారనే విషయాన్ని మాత్రం ధ్రువీకరించలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామన్నారు. కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: కేబినెట్‌ మంత్రిగా ఉదయనిధి స్టాలిన్‌ ప్రమాణం

మరిన్ని వార్తలు