బిహార్‌ ఫలితాలు; ఎన్డీఏ విజయం వెనుక..

12 Nov, 2020 17:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఎన్నికలను ప్రభావితం చేస్తాయనుకున్న అంశాలు అనూహ్యంగా మరుగున పడి పోయి కొత్త అంశాలు ముందుకు వచ్చి ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి. ఈసారి బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ అదే జరిగింది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని 40 లోక్‌సభ సీట్లకుగాను 39 సీట్లను బీజేపీ కూటమి గెలుచుకోవడంతో వాటి ఫలితాల ప్రభావం ఈ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఉండవచ్చని తొలుత రాజకీయ విశ్లేషకులు భావించారు. జాతీయ అంశాలైన పుల్వామా–బాలాకోట్‌ అంశాల కారణంగా నాడు అన్ని లోక్‌సభ సీట్లను బీజేపీ గెలుచుకోగలిగింది. (చదవండి.. బిహార్‌ ఎన్నికల ఎఫెక్ట్‌; కాంగ్రెస్‌ సీట్లకు కోత!)


దేశంలోనే అత్యంత పేద రాష్ట్రమైన బిహార్‌ను 2020లో కరోనా వైరస్‌ మహమ్మారి అతలాకుతలం చేసింది. దాంతో దేశవ్యాప్తంగా వలసలు పోయిన బిహారీలో ఆకలిదప్పులతో అలమటిస్తూ, అష్టకష్టాలు పడుతూ సొంతూళ్లకు చేరుకున్నారు. ఆ నేపథ్యంలో బిహార్‌లో పాలకపక్ష మనుగడ ఈసారి ఎన్నికల్లో ప్రశ్నార్థకం అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఈ ఎన్నిలకపై ప్రధానంగా అభివృద్ధి అంశం ప్రభావితం చేస్తుందని 42 శాతం మంది అభిప్రాయపడగా, నిరుద్యోగం ప్రభావితం చేస్తుందని 30 శాతం మంది, ద్రవ్యోల్బణం ప్రభావం చూపిస్తుందని 11 శాతం మంది ఓ సర్వేలో అభిప్రాయపడ్డారు. వారి అభిప్రాయాలేవి నిజం కాలేదు.

కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న కష్టకాలంలో ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద లక్షలాది బిహారి పేద కుటుంబాలకు ఉచితంగా రేషన్‌ అందజేయడం ఎన్నికల ఫలితాలను ఎంతో ప్రభావితం చేసింది. తమను వాస్తవంగా గెలిపించిందీ సైలెంట్‌ ఓటర్లయిన మహిళలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడంలో పూర్తి వాస్తవం ఉంది. మగవారికన్నా ఐదుశాతం ఎక్కువ మంది మహిళలు ఈసారి ఓటింగ్‌లో పాల్గొన్నారు. మహిళల కోసం మోదీ చేపట్టిన ఉజ్వల ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌ పథకం ఎంతోకొంత మహిళలను ప్రభావితం చేయగా, స్థానిక సంఘాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను నితీష్‌ ప్రభుత్వం కల్పించడం, పాఠశాలలకు వెళ్లే బాలికలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయడం పాలకపక్షానికి కలసి వచ్చింది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ హయాం నుంచి పురుషాధిపత్య రాజకీయాలను చూస్తూ వస్తోన్న బిహార్‌ మహిళకు నితీష్‌ పట్ల గౌరవం పెరుగుతూ వచ్చింది. ‘రోజ్‌గార్‌’ నినాదానికి ఎక్కువగా ఆకర్షితులైన యువత మాత్రం తేజస్వీ యాదవ్‌ వైపు వెళ్లింది.

ఇవే తనకు ఆఖరి ఎన్నికలంటూ నితీష్‌ కుమార్‌ చెప్పడం కూడా బిహార్‌ ఆఖరి విడత ఎన్నికలపై ఎంతో ప్రభావం చూపింది. మహిళలు, ఇతర వెనకబడిన వర్గాల వారు ఆ మాటలకు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. నితీష్‌–మోదీ అనే డబుల్‌ ఇంజన్‌ ప్రచారం కూడా కలిసొచ్చింది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైల్లో ఉండడం, యాదవ్‌ సోదరులకు ఒకరంటే ఒకరికి పడక పోవడం, తేజస్వీ యాదవ్‌ రాష్ట్రంలో కాకుండా ఎక్కువ కాలం ఢిల్లీలో గడపడం కూడా బిహార్‌ పాలకపక్షానికి కలిసొచ్చింది.

జాతీయ స్థాయిలో వివాదాస్పదమైన కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన 370 రాజ్యాంగ అధికరణను రద్దు చేయడం, అయోధ్యలో రామాలయ నిర్మాణం, వివాదాస్పదమైన పౌరసత్వ బిల్లు లాంటి అంశాలపై తేజస్వీ యాదవ్‌ పూర్తిగా మౌనం వహించడం 28 శాతం –30 శాతం కలిగిన ముస్లింలు–యాదవ్‌ల బంధాన్ని బలహీనపర్చింది. 2015 ఎన్నికల సందర్భంగా ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాల్లోకి అడుగుపెట్టిన అసుదుద్దీన్‌ ఓవైసీ తన పార్టీ ఏఐఎంఐఎంను విస్తరించడంలో విజయం సాధించడం కూడా పాలకపక్ష కూటమికి కలిసొచ్చిన మరో అంశం. రాష్ట్రంలో సరైన నాయకత్వం లేకపోవడం వల్ల కాంగ్రెస్‌తో పొత్తు మహా కూటమికి కలసిరాని మరో అంశం. (చదవండి: ఎన్నికల ఫలితాలపై తేజస్వీ సంచలన ఆరోపణలు)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు