Telangana: అక్కడ పట్టుబిగిస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌!

7 Aug, 2022 17:17 IST|Sakshi

మంచిర్యాల నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యారు దివాకరరావు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక గులాబీ పార్టీ నుంచే రెండుసార్లు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లోనే స్వల్ప మెజారిటీతో బయటపడ్డారాయన. ఐదో సారి కూడా గెలిచేది నేనే అంటున్నారు దివాకరావు. నియోజకవర్గంలో  గెలుపు ఓటములను ప్రభావితం చేసేది సింగరేణి కార్మికులే. కాని సింగరేణి కార్మికులు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే దివాకర్ రావు తీరు పై  అసంతృప్తిగా ఉన్నారట. భూగర్బ బొగ్గు గనులను ప్రారంభిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు ప్రారంభం కాలేదు. అదేవిధంగా అంతర్గామ్ బ్రిడ్జీ, అవుటర్ రింగ్ రోడ్డు..పట్టణంలో వంద అడుగుల రోడ్లు‌ హమీలు కూడా మాటలకే పరిమితం‌ అయ్యాయని  ప్రజలు  బావిస్తున్నారు. 

గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమిపాలైన కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్‌సాగర్‌రావు...టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై పోరాటం సాగిస్తున్నారు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్‌ నేత ప్రజల్లో తిరుగుతున్నారు. బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన రఘునాథరావు డిపాజిట్‌ కోల్పోయారు. గత ఎన్నికల్లో ఉనికి చాటలేకపోయినా...ఈసారి సత్తా చాటాలని భావిస్తోందట‌ కమలం పార్టీ. ఎస్‌సీ నియోజకవర్గం చెన్నూరు నుంచి ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చెన్నూర్ నియోజకవర్గాన్ని  ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తామని ఎన్నికల ప్రచారంలో సుమన్‌ హామీ ఇచ్చారు. సిరిసిల్ల, సిద్దిపేట తరహలో‌ అభివృద్ది చేస్తానని వాగ్దానం చేశారు. విజయం సాధించిన తర్వాత చెన్నూర్ పట్టణాన్ని  ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలోని రూరల్ ప్రాంతాలు మాత్రం అభివృద్ధి చెందలేదు. రెవిన్యూ డివిజన్ ఏర్పాటు, బస్ డిపో ఏర్పాటు, సుద్దాల బ్రిడ్జీ నిర్మాణం, జోడువాగుల మీద బ్రిడ్జీల  పనులు ప్రారంభం  కాలేదు. ఇక్కడ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అంబేద్కర్ స్టడీ సర్కిల్ నిర్మాణం    ఊసులేదు. మినీ ట్యాంక్ బ్యాండ్ పనులు పూర్తి కాలేదు..

ఇదిలా ఉంటే..మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, జిల్లా పరిషత్ చైర్మన్  నల్లాల భాగ్యలక్ణ్మి కారు దిగి కాంగ్రెస్‌లో చేరారు. ఇది గులాబీ పార్టీకి షాక్‌ ఇచ్చిందని ప్రచారం సాగుతోంది. గతంలో చెన్నూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లాల ఓదేలు ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమైందటంటున్నారు. ఇప్పటికే ఓదేలు గ్రామాల్లో ప్రజలను కలుస్తున్నారు. ప్రజల మధ్దతు కోరుతున్నారు. అదేవిధంగా  బిజెపి అదిష్టానం అదేశిస్తే వివేక్ వెంకటస్వామి రంగంలోకి దిగుతారని జోరుగా ప్రచారం సాగుతుంది. 

షెడ్యూల్డ్‌ కులాల నియోజకవర్గం బెల్లంపల్లి నుండి దుర్గం చిన్నయ్య రెండుసార్లు విజయం‌ సాధించారు. ‌మూడోసారి పోటీకి రెడీ అవుతున్నారు చిన్నయ్య. జిల్లాకు వ చ్చే మెడికల్‌ కాలేజ్‌ను బెల్లంపల్లి తెస్తానని చిన్నయ్య హామీ ఇచ్చారు. అయితే ఆ కాలేజ్‌ మంచిర్యాల తరలిపోయింది. చిన్నయ్య అసమర్థత వల్లనే కళశాల తరలిపోయిందని రగలిపోతున్నారు నియోజకవర్గ ప్రజలు. పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కాలేజ్‌గా అప్ గ్రేడ్ చేస్తామన్నారు.. కాని అదీ నేరవేరలేదు. బెల్లంపల్లి అసుపత్రిని వందపడకల అసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తామన్నారు గాని చేయలేదు. సెగ్మెంట్‌లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఎమ్మెల్యే చిన్నయ్య అనుచరులు పట్టణంలో కనిపించిన ప్రభుత్వ భూములన్నీ కబ్జా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇవన్నీ దుర్గం చిన్నయ్యకు ఇబ్బందికరంగా మారుతున్నాయంటున్నారు.

మరోవైపు పార్టీలో టిక్కెట్ పోరు కూడా చిన్నయ్యకు తలనొప్పిగా మారిందట. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ రేణుకుంట్ల ప్రవీణ్, ఎంపి  వెంకటేష్ ఇక్కడి నుండి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. దుర్గం చిన్నయ్యను ప్రక్కన పెడితే అదే సామాజిక వర్గానికి చెందిన‌‌ నేతకాని  వెంకటేష్‌కు టిక్కెట్‌పై పార్టీలో చర్చ సాగుతుందట. ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తూ ఈసారి కూడా తనకే టిక్కెట్ దక్కుతుందని చెబుతున్నారు దుర్గం చిన్నయ్య. మరోవైపు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకుంటోంది. మాజీ మంత్రి వినోద్ ఈసారి కాంగ్రెస్ నుండి పోటీ చేయడానికి   సిద్దమవుతున్నారు. ఆరునూరైనా విజయం సాధించి గులాబీ పార్టీకి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారట. కాంగ్రెస్‌తో పాటు బిజెపి కూడా నియోజకవర్గంలో పట్టుబిగిస్తోంది. గత ఎన్నికలలో ప్రభావం చూపని బిజెపి ఈసారి సత్తా చాటాలని భావిస్తోందట. 

మరిన్ని వార్తలు