బెంగాల్‌ దంగల్‌: బీజేపీ చీఫ్‌ సంచలన నిర్ణయం

18 Mar, 2021 11:44 IST|Sakshi
పశ్చిమ బెంగాల్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)

అసెంబ్లీ ఎన్నికల వేళ దిలీప్‌ ఘోష్ సంచలన నిర్ణయం

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు‌

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ సంచలన ప్రకటన చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తెలిపారు. తాజాగా ప్రకటించిన బీజేపీ అభ్యర్థుల జాబితాలో కూడా ఆయన పేరు లేదు. దీనిపై భిన్న ఊహాగానాలు వెలువడుతుండటంతో దిలీప్‌ ఘోష్‌ ఈ అంశంపై స్పందించారు. బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం మొత్తం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి అధ్వర్యంలో జరగాలని హై కమాండ్‌ నిర్ణయింది. అందువల్లే తాను పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు.

ఈ సందర్భంగా దిలీప్‌ ఘోష్‌ న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల జాబితాలో నా పేరు లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం వల్ల నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో నా అధ్వర్యంలో పార్టీ తరఫున ప్రచారం జరగాలని హై కమాండ్‌ నిర్ణయించింది’’ అన్నారు. 

బెంగాల్‌లో మూడో, నాల్గవ దశల ఎన్నికలకు సంబంధించి బీజేపీ 63 మంది అభ్యర్థుల పేర్లను  ఆదివారం ప్రకటించింది. వీరిలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో, టీఎంసీ మాజీ నాయకుడు రాజిబ్ బెనర్జీ ఉన్నారు. బెంగాల్‌లో మొదటి రెండు దశల ఎన్నికలకు 58 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ గతంలోనే విడుదల చేసింది.  

294 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం ఎనిమిది దశల్లో జరగనున్నాయి. వీటిలో షెడ్యూల్డ్ కులాలకు మొత్తం 68 సీట్లు, షెడ్యూల్డ్ తెగలకు 16 సీట్లు కేటాయించారు. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ పదవీకాలం మే 30 తో ముగియనుంది. 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మొదటి దశ ఓటింగ్‌ మార్చి 27 న ప్రారంభం కాగా.. ఎనిమిదవ దశ ఓటింగ్‌ ఏప్రిల్ 27న జరుగుతుంది.

చదవండి:

దేశాన్ని రక్షించేందుకు బీజేపీని గెలిపించాలి

సీఎం అభ్యర్థిపై ప్రకటన.. బీజేపీలో కలకలం

మరిన్ని వార్తలు