మే 15 నుంచి బీజేపీ ప్రచార భేరి  

22 Apr, 2023 04:43 IST|Sakshi

రాజమహేంద్రవరంలో నిర్వహించిన పార్టీ కోర్‌ సమావేశంలో నిర్ణయం 

రాజమహేంద్రవరం సిటీ:  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిపాలన, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న తోడ్పాటును వివరిస్తూ మే నెల 15వ తేదీ నుంచి జూన్‌ 15 వరకు ప్రచార భేరి కార్యక్రమం చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌ తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మే 5 నుంచి 15 వరకు పది రోజులపాటు పోరాటం చేయడంతో పాటు చార్జిషీట్‌ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర మంత్రి, పార్టీ ఏపీ ఇన్‌చార్జి మురళీధరన్‌ నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపారు. అనంతరం కోర్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ వివరాలను మాధవ్‌ మీడియాకు వివరించారు. వైఎస్సార్‌సీపీతో బీజేపీ కలిసి వెళ్తుందనే అసత్య ప్రచారం జరుగుతుందని.. దానిని తిప్పికొడతామని చెప్పారు. గతంలో తెలుగుదేశం కూడా రాష్ట్రంలో అరాచకాలు చేసిందన్నారు.

అచ్చెన్నాయుడు, పితాని ఏదో ఊహించి మాట్లాడుతున్నారని చెప్పారు. పవన్‌ తమతోనే ఉన్నారని, వచ్చే ఎన్నికలకు జనసేనతోనే కలిసి వెళ్తామని పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వంపై పోరాటం విషయంలో జనసేనతో కలిసి కార్యక్రమాల రూపకల్పనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. కోర్‌ కమిటీ సమావేశంలో పురందేశ్వరి, టీజీ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

బీజేపీలో చేరిన వ్యాపారవేత్త రామచంద్రప్రభు  
గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, తులసి సీడ్స్‌ అధినేత రామచంద్ర ప్రభు శుక్రవారం రాజమహేంద్రవరంలో కేంద్ర మంత్రి మురళీధరన్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. పధాని మోదీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి తన కుమారుడు తులసీ సీడ్స్‌ ఎండీ యోగేష్‌ చంద్రతో కలిసి బీజేపీలో చేరానని రామచంద్ర ప్రభు తెలిపారు. ఏపీలో బీజేపీ పటిష్టత కోసం    కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. 

>
మరిన్ని వార్తలు