మూడో జాబితాపై ముమ్మర కసరత్తు 

29 Oct, 2023 04:40 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర చీఫ్‌ కిషన్‌రెడ్డి నివాసంలో ముఖ్యనేతల భేటీ 

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సీట్లపై చర్చ 

నేడు లేదా రేపు ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి జాబితా ఇవ్వాలని నిర్ణయం 

పార్టీ సీఈసీ ఆమోదం తర్వాత 1న లేదా 2న విడుదల చేసే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాపై రాష్ట్ర బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. శనివారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జవదేకర్, సహ ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్, పార్టీ నేతలు కె.లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపాలనే చర్చ జరిగినట్టు తెలిసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని సీట్లపై చర్చలో భాగంగా.. సనత్‌నగర్‌ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి, జూబ్లీహిల్స్‌ విక్రమ్‌గౌడ్, ముషీరాబాద్‌ నుంచి గోపాల్‌రెడ్డి/ బండారు విజయలక్షి, అంబర్‌పేట నుంచి బండారు విజయలక్షి / ఎన్‌.గౌతమ్‌రావు, సికింద్రాబాద్‌ నుంచి బండ కార్తీకరెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి ఆకుల రాజేందర్, రాజేంద్రనగర్‌ నుంచి తోకల శ్రీనివాస్‌రెడ్డి అభ్యర్థిత్వాలను పరిశీలించినట్టు సమాచారం.

ఎల్బీనగర్‌ సీటు కోసం సామ రంగారెడ్డి, వంగ మధుసూదన్‌రెడ్డి, గంగిడి మనోహర్‌రెడ్డి ఆశలు పెట్టుకోగా.. ఉప్పల్‌ నుంచి ఎనీ్వఎస్‌ఎస్‌ ప్రభాకర్‌తో పాటు వీరేందర్‌గౌడ్, మేడ్చల్‌ నుంచి విక్రమ్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ రెండో జాబితా కూడా వెలువడిన నేపథ్యంలో.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పారీ్టల్లోని అసంతృప్తులను చేర్చుకుని, టికెట్‌ ఇచ్చే అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.  

త్వరలోనే జాబితా విడుదల 
ఆదివారంగానీ, సోమవారంగానీ బీజేపీ రాష్ట్ర నేతలు ఢిల్లీ వెళ్లి మూడో జాబితా ముసాయిదాను పార్టీ పెద్దలకు అందజేయనున్నట్టు తెలిసింది. వచ్చే నెల 1న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ జాబితాపై చర్చించి.. సుమారు 40– 45 మంది పేర్లతో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆ రోజున ఆలస్యమైతే రెండో తేదీన విడుదల చేయవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మిగిలిన సీట్లలో పదిచోట్ల అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉందని, వాటి విషయాన్ని చివర్లో తేల్చాలని భావిస్తున్నట్టు సమాచారం. జనసేనకు కేటాయించే సీట్లపైనా చర్చించారని, ఈ విషయంలో పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమైందని తెలిసింది.

మరిన్ని వార్తలు