దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైంది? 

29 Oct, 2023 04:47 IST|Sakshi

బీసీల విషయంలో మాకు కేటీఆర్‌ సలహాలు అక్కర్లేదు: బీజేపీ ఎంపీ బీసీల విషయంలో మాకు కేటీఆర్‌ సలహాలు అక్కర్లేదు: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: బీసీలను రాజకీయంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నది బీజేపీకి తెలుసునని.. ఈ విషయంలో మంత్రి కేటీఆర్‌ తమకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు కలిపి 50 శాతానికిపైగా మంత్రులు ఉన్నారని తెలిపారు.

శనివారం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామన్న హామీ ఏమైందో తన తండ్రి కేసీఆర్‌ను అడగాలని కేటీఆర్‌ను డిమాండ్‌ చేశారు. వచ్చే రోజుల్లో అయినా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా? లేక కేసీఆర్‌.. తర్వాత కేటీఆర్, ఆ తర్వాత ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేయడమే తమ రాజకీయమా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు.

ఇలాంటి వ్యక్తులు బీజేపీ గురించి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుందని అర్వింద్‌ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవితను ఒక రాజకీయ నాయకురాలిగా తాను ఏమాత్రం భావించటంలేదని అన్నారు. కవిత ఒక కాలం చెల్లిన, ప్రజలు తిరస్కరించిన నాయకురాలని విమర్శించారు. కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా పార్టీ సీనియర్లను హైకమాండ్‌ కోరినప్పటికీ కొందరు వివిధ కారణాలతో పోటీ వద్దనుకున్నారని చెప్పారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ఒక అర్హత అన్నది తన అభిప్రాయమన్నారు.

మరిన్ని వార్తలు