గాంధీల పక్కన వాద్రా ఫోటో.. కాంగ్రెస్‌ 'భారత్‌ జోడో' యాత్రపై బీజేపీ సెటైర్లు

7 Sep, 2022 15:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భారత్ జోడో యాత్ర బుధవారం ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. దీనికి సబంధించి సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్‌ చేశారు. ఇందులో గాంధీ కుటుంబంతో పాటు వాద్రా కూడా ఉన్నారు.

ఈ ఫోటోపై స్పందిస్తూ బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. రాహుల్ గాంధీ చేపట్టింది 'భారత్ జోడో' కాదు 'పరివార్ జోడో'(కుటుంబాన్ని ఏకం చేసే)యాత్ర అని సెటైర్లు వేసింది. బీజేపీ నేత షెహ్‌జాద్ పూనావాలా ఈమేరకు ట్వీట్ చేశారు.

ఈ ఏడాది జూన్‌లో తాను రాజకీయాల్లోకి వస్తానని సూచనప్రాయంగా చెప్పారు రాబర్ట్ వాద్రా. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించిన అనంతరం ఈ విషయాన్ని తెలిపారు. దేశంలో మార్పు అవసరమని, అది తన వల్ల సాధ్యమవుతుందని ప్రజలు అనుకుంటే కచ్చితంగా రాజకీయ ప్రవేశం చేస్తానని వాద్రా వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష‍్యంగా రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్రను చేపడుతున్నారు. బుధవారం సాయంత్రం కన్యాకుమారిలో ఇది ప్రారంభమవుతుంది. మొత్తం 12 రాష్ట్రాలను కవర్ చేస్తూ 3,570 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది.
చదవండి: వాద్రా ఫోటో.. భారత్‌ జోడో యాత్రపై బీజేపీ నేత సెటైర్లు

మరిన్ని వార్తలు