మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకు చోటేది?: బీజేపీ నాయకురాలు అసంతృప్తి 

20 Sep, 2023 13:21 IST|Sakshi

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనంలో మొదటి బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టిన బీజేపీ ప్రభుత్వం ఈసారి బిల్లు ఆమోదం పొందుతుందన్న ఆశాభావంతో ఉండగా సీనియర్ బీజేపీ నేత ఉమాభారతి బిల్లుపై అసంతృప్తిని వ్యక్తం చేసారు. బిల్లులో ఓబీసీ మహిళల ప్రస్తావన లేకవడం నిరాశ కలిగించిందన్నారు.

ప్రధానికి లేఖ..  
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహళలకు ముస్లిం మైనారిటీ మహిళలకు చోటు కల్పించకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు సీనియర్ బీజేపీ నేత ఉమాభారతి. ఈ సందర్బంగా ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎట్టకేలకు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉంది. కానీ బిల్లులో ఓబీసీల ప్రస్తావన లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. 

నమ్మకం కోల్పోతాం.. 
మొత్తం 33 శాతం రిజర్వేషన్లలో సగం ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ, వెనుకబడిన ముస్లిం మహిళలకు కేటాయించాలని కోరారు. లేదంటే వెనుకబడిన బీసీ ముస్లిం మహిళలలోనూ ఓబీసీ మహిళలలోనూ పార్టీ నమ్మకాన్ని కోల్పోతుందని అన్నారు. గతంలో హెచ్‌డి దేవెగౌడ ప్రభుత్వం ఇలాంటి బిల్లునే ప్రవేశ పెట్టగా అందులో కూడా తాను కొన్ని మార్పులు సూచించానని అటుపై ఆ బిల్లు స్టాండింగ్ కమిటీకి పంపించారని గుర్తు చేశారు.   

బిల్లు ఆమోదం పొందాలంటే.. 
ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు సాకారం కావాలంటే రాజ్యాంగంలోని 239-ఏఏ, 330, 332, 334 అధికరణల సవరణ అవసరమని బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే జనగణన, డీలిమిటేషన్ తర్వాతే మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చాక పదిహేనేళ్ల పాటు అమలవుతుందని, తర్వాత ప్రత్యేక చట్టం ద్వారా చట్టాన్ని కొనసాగించాల్సి ఉంటుందని ప్రభుత్వం బిల్లులో పేర్కొంది. 

ఇది కూడా చదవండి: రాజ్యాంగంలో ఆ 'రెండు' పదాలు మిస్సింగ్: అధిర్ రంజన్ చౌదరి

మరిన్ని వార్తలు