బీజేపీ ప్రభుత్వ అవినీతిని బయటపెట్టండి : స్టాలిన్ 

18 Sep, 2023 13:44 IST|Sakshi

చెన్నై: ప్రత్యేక పార్లమెంట్ సెషన్ల సందర్బంగా బీజేపీ ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చెయ్యాలని డీఎంకే పార్టీ శ్రేణులను కోరారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. కాగ్ నివేదిక ఆధారంగా కేంద్ర బీజీపీ ప్రభుత్వం సుమారు రూ.7.50 లక్షల కోట్లు అవినీతికి పాల్పడిందని అవినీతితో పాటు మణిపూర్‌లో జరిగిన మారణకాండ గురించి కూడా ప్రస్తావించాలని డీఎంకే నేతలను కోరారు. 

తొమ్మిదేళ్లలో చాలా పెంచేశారు.. 
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మరోసారి కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి గెలుపు కోసం పార్టీ శ్రేణులు మరింత కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి 2023 వ్యవధిలో పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై భారాన్ని పెంచేసిందన్నారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు భారతదేశ రుణభారం రూ.55 లక్షల కోట్లు ఉండగా బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ రుణభారం రూ.155 లక్షల కోట్లకు చేరిందన్నారు.   

ముసుగు తొలగించండి.. 
కాగ్ నివేదిక ఆధారంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆయా ప్రభుత్వ పధకాల అమల్లో రూ.7.5 కోట్ల అవినీతికి పాల్పడిందని, ఆధారాలతో సహా వారి అవినీతిని బయట పెట్టాలని పార్టీ సభ్యులను కోరారు స్టాలిన్. బీజేపీ అవినీతికి ముసుగు వేసిందని ఆ ముసుగును ఎలాగైనా తొలగించాలని అన్నారు. బీజేపీ అమలు చేస్తోన్న ఒకే జీఎస్టీ విధానం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని అన్నారు. జాతీయ విద్యా విధానం తమిళనాడులో విద్యా వ్యవస్థ పురోగతిపై ప్రభావం చూపిందన్నారు.

అవినీతి అంతా ఇక్కడే.. 
స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు రాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నారాయణ తిరుపతి మాట్లాడుతూ బీజేపీ హయాంలో ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారుల సంఖ్య 14 కోట్లు నుంచి 34 కోట్లకి పెరిగిందని అందుకు తగ్గట్టుగానే ధర కూడా పెరుగుతూ వచ్చిందని ఇక కాగ్ నివేదికలో ఏదైనా అవినీతి ఉందంటే అది రాష్ట్ర ప్రభుత్వ హయాంలో జరిగినదేనని అన్నారు.  

ఇది కూడా చదవండి: ఇండియా కూటమిపై సీఎం ఏక్‌నాథ్ షిండే సెటైర్లు

మరిన్ని వార్తలు