టీడీపీ అవినీతి వల్లే రహదారులు అధ్వానం

20 Jan, 2022 04:19 IST|Sakshi

మంత్రి బొత్స సత్యనారాయణ

కాకినాడ: తెలుగుదేశం పాలనలో జరిగిన అవినీతి, దోపిడీ వల్లే రాష్ట్రంలోని అనేకచోట్ల రహదారులు ధ్వంసమయ్యాయని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో రూ.217 కోట్లతో ప్రతిపాదించిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో బుధవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఒకసారి నిర్మించిన రహదారులు కనీసం ఐదు నుంచి ఏడేళ్ల వరకు నాణ్యతకలిగి ఉండాలన్నారు.

తమ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు మాత్రమే దాటిందని దీన్నిబట్టి గత టీడీపీ హయాంలో రహదారుల నిర్మాణంలో ఎలాంటి దోపిడీ జరిగిందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. అయినప్పటికీ ప్రయాణికులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇటీవలే రహదారుల పునర్‌నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుందని తెలిపారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగ సంఘాలతో చర్చించిన తరువాతే ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందని, దీనిపై కొన్ని సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తగిన ఆలోచన చేస్తోందని చెప్పారు.

రాష్ట్రంలో 18 నగరపాలక సంస్థలు ఉండగా, నాలుగింటికి మాత్రమే స్మార్ట్‌ సిటీ హోదా దక్కిందని, మిగిలిన కార్పొరేషన్లను, మునిసిపాలిటీలను అభివృద్ధి చేసే విషయమై తమశాఖ ప్రత్యేక దృష్టిసారిస్తోందని తెలిపారు. మంచినీటి ఎద్దడి లేకుండా పూర్తిస్థాయి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడంతోపాటు పట్టణాలను క్లీన్‌సిటీలుగా చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు