భువనగిరి, నేరేడుచర్లలో నెగ్గిన అవిశ్వాసం

24 Jan, 2024 04:53 IST|Sakshi

రెండు మున్సిపాలిటీల్లో చైర్మన్‌ పదవులు కోల్పోయిన బీఆర్‌ఎస్‌

భువనగిరిటౌన్‌/నేరేడుచర్ల: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం రెండు మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు నెగ్గాయి. భువనగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీల చైర్మన్‌ పదవులను బీఆర్‌ఎస్‌ కోల్పోయింది. భువనగిరి మున్సిపాలిటీలో 16 మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యులతో కలిసి సొంత పార్టీ చైర్మన్, వైస్‌ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టారు.

ఎక్స్‌ అఫీషియో సభ్యులతో కలిపి 36 మంది సభ్యులుండగా మంగళవారం నిర్వహించిన అవిశ్వాస ప్రత్యేక సమావేశానికి 31 మంది హాజరయ్యారు. 16 మంది బీఆర్‌ఎస్, 9 మంది కాంగ్రెస్, ఆరుగురు బీజేపీ కౌన్సిలర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరంతా చైర్మన్, వైస్‌ చైర్మన్‌పై అవిశ్వాసానికి మద్దతుగా చేతులెత్తారు. దీంతో అవిశ్వాసం నెగ్గింది. నేరేడుచర్ల మున్సిపల్‌ చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాసం కూడా నెగ్గింది.

ఈ మున్సిపాలిటీలో 15 మంది కౌన్సిలర్లు ఉండగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వైస్‌ చైర్‌పర్సన్‌ తన పదవికి రాజీనామా చేశారు. మొదట బీఆర్‌ఎస్‌కు ఏడుగురు కౌన్సిలర్లు ఉండగా.. వైస్‌ చైర్‌పర్సన్‌ రాజీనామా చేయడంతోపాటు ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు చైర్మన్‌తో కలిసి ముగ్గురు, సీపీఎంకు ఒకరు, కాంగ్రెస్‌కు పది మంది సభ్యులున్నారు. మంగళవారం జరిగిన అవిశ్వాస సమావేశానికి చైర్మన్‌ మినహా అందరూ హాజరయ్యారు. చైర్మన్‌పై అవిశ్వాసానికి మద్దతుగా 13 మంది కౌన్సిలర్లు చేతులెత్తారు. దీంతో అవిశ్వాసం నెగ్గింది.

>
మరిన్ని వార్తలు