సీఎంతో మెదక్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భేటీ

24 Jan, 2024 04:38 IST|Sakshi
సీఎం రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం ఇస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

ప్రొటోకాల్, వ్యక్తిగత భద్రత అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడి

రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ..మీడియాలోనూ వైరల్‌

రాజకీయ ప్రాధాన్యత లేదంటూ స్పందించిన ఎమ్మెల్యేలు

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్‌), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరు), మాణిక్‌రావు (జహీరాబాద్‌), కొత్త ప్రభాకర్‌రెడ్డి (దుబ్బాక) జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిసారు. నియోజకవర్గంలో తాము ఎదుర్కొంటున్న ప్రొటోకాల్, పోలీసు ఎస్కార్ట్, వ్యక్తిగత భద్రత తదితర అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వారు ‘సాక్షి’కి తెలిపారు.

అయితే ప్రధాన ప్రతిపక్షానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎంను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. మీడియాలోనూ వీరి భేటీ వైరల్‌ అయ్యింది. దీంతో ఎమ్మెల్యేలు స్పందించారు. తమ నియోజకవర్గాలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులు కొనసాగేలా చూడాలని సీఎంను కోరినట్లు కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. గతంలో పూర్తయిన అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపు అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.

రేవంత్‌తో కేవలం మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు మాణిక్‌రావు తెలిపారు. తాము ముఖ్యమంత్రిని కలవడంపై విపరీతార్థాలు తీయొద్దని, ప్రధాన మంత్రి మోదీని రేవంత్‌రెడ్డి ఎలా అభివృద్ధి పనుల కోసం కలిశారో తాము కూడా అదే విధంగా కలిసినట్లు మహిపాల్‌రెడ్డి వివరించారు.

తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. కాగా వీరు బుధవారం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సీఎంతో భేటీపై వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇలావుండగా తమ భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ నలుగురు ఎమ్మెల్యేలు మంగళవారం ఇంటెలిజెన్స్‌ ఏడీజీ శివధర్‌రెడ్డిని కూడా కలిశారు.

>
మరిన్ని వార్తలు