అందరి తెలంగాణగా మార్చడమే లక్ష్యం 

25 Nov, 2023 02:23 IST|Sakshi

పేదల రాజ్యాధికారంతోనే బాంచన్‌ సంస్కృతి పోతుంది 

అసెంబ్లీ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధిస్తాం 

సాక్షి టీవీ ఇంటర్వ్యూలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కొందరి తెలంగాణను అందరి తెలంగాణ చేయడమే బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ చెప్పారు. సాక్షి టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రాష్ట్రాన్ని దొరల తెలంగాణ కాకుండా పేదల తెలంగాణగా మార్చాలనేది బీఎస్పీ ఆలోచన అని తెలిపారు. తెలంగాణలో దొరలు వదిలిపెట్టిన గడీలు గత తొమ్మిదేళ్లలో మళ్లీ పునర్నిర్మాణమయ్యాయని ఆయన విమర్శించారు. బాంచన్‌ కాల్మొక్త అనే సంస్కృతి తెలంగాణలో పోలేదని చెప్పారు.  

అన్ని వర్గాలను కలుపుకుంటాం... 
పేదల రాజ్యాధికారంతోనే బాంచన్‌ సంస్కృతి పూర్తిగా పోతుందని ప్రవీ ణ్‌కుమార్‌ స్పష్టం చేశా రు. స్పష్టమైన ప్రణాళిక తో అన్ని వర్గాలను కలుపుకొని కృషి చేస్తే రాజ్యాధికారం తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్‌ డిజిట్‌ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వీలైతే రాజ్యాధికారం చేపడతామని ఆశిస్తున్నట్లు చెప్పారు. జార్ఖండ్‌లో గతంలో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన మధు కోడా ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ప్రవీణ్‌కుమార్‌ గుర్తుచేశారు. 

మాయావతి వల్లే యూపీలో బహుజనులకు రాజ్యాధికారం... 
దళితులు కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులైతే సరిపోదని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొనే స్థితిలో ఉంటేనే రాజ్యాధికారం వచ్చినట్లవుతుందని ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి సీఎం అయిన తర్వాతే బహుజనులకు రాజ్యాధికారం వచ్చిందన్నారు. మాయావతి హయాంలో దళితులకు భూముల పంపిణీ జరిగిందని, ఆమె ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించిందని చెప్పారు. మాయావతి పాలన వల్ల రెండు, మూడు తరాల బహుజనులు బాగుపడ్డారని ఆయన తెలిపారు.  

ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 10 లక్షల ఉద్యోగాలిస్తాం.. 
ముఖ్యమంత్రిని కలిసి తమ ఆలోచనలు పంచుకొనే అవకాశం రాష్ట్రంలో ఏ అధికారికీ లేదని ప్రవీణ్‌కుమార్‌ చెప్పా రు. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ స్థాయి అధికారులు సైతం కానిస్టే బుల్‌ ఆపితే ప్రగతి భవన్‌ గేటు వద్ద నుంచే వెనక్కి వెళ్లిన సందర్భాలున్నాని పేర్కొన్నారు.

గురుకులాల సెక్రటరీగా వెళ్లిన వెంటనే తాను దళిత, నిమ్న, వెనుకబడిన, అణగారిన అనే పదాలను నిషేధించి స్వేరో అనే పదాన్ని తీసుకొచ్చానని తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న 10 లక్షల ఉద్యోగా ల హామీ మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కాదని, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలన్నీ కలిపి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా మని ఆయన వివరణ ఇచ్చారు. ఇవేగాక మరిన్ని విషయా లను ప్రవీణ్‌కుమార్‌ సాక్షి టీవీతో పంచుకున్నారు.  

మరిన్ని వార్తలు