చంద్రబాబు పిలుపు: మందు తాగండి.. ఓటు వేయండి

14 Apr, 2021 03:36 IST|Sakshi
ఉగాది వేడుకల్లో మాట్లాడుతున్న చంద్రబాబు

ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు

గూడూరు/తిరుపతి అర్బన్‌: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఓటర్లు వైఎస్సార్‌సీపీ నేతలు ఇచ్చే మందు తాగి వారికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరారు. అమ్మఒడి పథకం.. నాన్న బుడ్డికే సరిపోతోందని ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో రోడ్‌ షో నిర్వహించారు. అలాగే తిరుపతి టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఉగాది సంబరాలు జరుపుకున్నారు. పంచాంగ శ్రవణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు మార్కెట్‌ సమీపంలో మాట్లాడుతూ.. మద్యం వల్ల ప్రతి పేదవాడు అప్పుల పాలవుతున్నాడన్నారు. తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో తాను 54 పరిశ్రమలు తీసుకువచ్చానని, నేడు ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని ప్రశ్నించారు.

25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారని.. నేడు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. ఉన్న ఎంపీలతో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అని నిలదీశారు. దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావును ఎమ్మెల్యేను చేసి మంత్రిని కూడా చేశానని, ఇప్పుడు ఆయన ఎంపీగా మృతిచెందితే వారి కుటుంబంలో వారికి స్థానం కల్పించకుండా మరొకరికి టికెట్‌ ఇవ్వడంతోనే తాము పోటీ చేస్తున్నామన్నారు. సీఎం జగన్‌ బాబాయ్‌ వివేకానందరెడ్డి హత్య జరిగితే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే పనిలో ఉన్నారని ఆరోపించారు. ఏర్పేడులో ఐఐటీ పెట్టానని, ఒకప్పుడు తాను పెట్టిన బయోటెక్‌ వల్లే కరోనా టీకా వచ్చిందన్నారు. గతంలో అలిపిరిలో జరిగిన బాంబు దాడులకే భయపడలేదని.. రాళ్ల దాడులను లెక్కచేయనని పేర్కొన్నారు. ఆయన వెంట రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, పనబాక కృష్ణయ్య తదితరులు ఉన్నారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు