చంద్రబాబు ‘ముందస్తు’ డ్రామా.. ఆ వ్యాఖ్యలు దేనికి సంకేతం?

17 Dec, 2022 18:23 IST|Sakshi

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన క్యాడర్‌ను ఎలాగొలా రక్షించుకోవడానికి నిత్యం ఏదో ఒక కొత్త సమాచారం చెబుతుంటారు. ఆయన తాజాగా ముందస్తు ఎన్నికల ఊసు తెచ్చారట. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలలో వ్యతిరేకత ఉందని గుర్తించి, అది ఇంకా బాగా పెరగక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నారన్నది ఆయన వాదన. నిజానికి రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ప్రత్యర్థి రాజకీయ పార్టీల వ్యూహాలను తిప్పి కొట్టడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు. నిజంగానే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లవలసిన అవసరం ఉంటుందా?

ముందస్తు ముచ్చట్లు
తెలంగాణ శాసనసభ ఎన్నికలతో పాటు ఏపీలో కూడా ఎన్నికలు జరగవచ్చన్న ప్రచారాన్ని కొందరు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తున్నారని తెలంగాణలో కూడా ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. గత టరమ్‌లో ఆయన ఆరు నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లిన మాట నిజమే. కానీ అప్పటి పరిస్థితులు వేరు. ప్రస్తుత రాజకీయ వాతావరణం వేరు.

భారత రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్‌ను మార్చుకున్న తర్వాత ముందస్తు ఎన్నికలకు వెంటనే వెళతారా అంటే చెప్పలేం. ఆయనకు అందే వివిధ సర్వేలను బట్టి నిర్ణయం తీసుకుంటారు. అదే సమయంలో బిజెపి నుంచి, కేంద్రం నుంచి ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని కూడా ఆయన ఒక అంచనాకు రావచ్చు. అంతేకాక ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుని అసెంబ్లీని రద్దు చేస్తే, ఆయన అనుకున్న రీతిలో ఎన్నికలు జరుగుతాయా? ఏ కారణం వల్ల అయినా ఆలస్యం అవుతాయా అన్నది కూడా ఆలోచించవలసి ఉంటుంది.

డామిట్‌ కథ అడ్డం తిరిగింది
1999లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిచిన చంద్రబాబు నాయుడుకు 2004 వరకు పదవీ కాలం ఉండింది. అయితే 2003 అక్టోబర్‌ 1న ఆయన  తిరుమలకు వెళ్తుండగా అలిపిరిలో నక్సల్స్ క్లెమోర్‌మైన్స్‌తో దాడి చేశారు. తనను పరామర్శించడానికి వచ్చిన వారిని చూసిన చంద్రబాబుకు వెంటనే ఎన్నికలకు వెళితే సానుభూతి కలిసి వస్తుందన్న ఆలోచన కలిగింది. ఇంకేముంది అసెంబ్లీని రద్దు చేశారు. 2004లో ఏపీలో ఎన్నికలు జరగ్గా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. చంద్రబాబు ప్లాన్‌ అడ్డం తిరిగింది.

అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ కూడా చంద్రబాబు మాటలు విని ముందస్తు ఎన్నికలకు వచ్చి బోల్తా పడింది. అందుకే బావమరిది బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షోలో తాను చేసిన అతి పెద్ద తప్పు ముందస్తే అని ఒప్పుకున్నాడు చంద్రబాబు. నిజానికి చంద్రబాబు ముందస్తుకు వెళ్లినా.., వెళ్లకపోయినా నాడు గెలిచేవాడు కాడని చెబుతారు. అప్పటికే వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి జనంలో బలంగా వెళ్లడంతో కాంగ్రెస్‌కు పూర్తి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఒక ప్లస్‌.. ఒక మైనస్‌
ఇక ముందస్తుకు సంబంధించి చంద్రబాబుకు ముందు అంటే.. 1984 ఆఖరులో ఎన్.టి.రామారావు అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. 1985లో జరిగిన ఎన్నికలలో గెలుపొందారు. కాని 1989లో ముందస్తు ఎన్నికలకు వెళ్లగా టీడీపీ ఓడిపోయింది. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగాలని ఎన్టీఆర్‌ కాని, ఆయన సలహాదారులు గానీ ఆ రోజు వ్యూహాం రచించారు. కాని అదే ఆయనకు తీవ్ర నష్టం చేసిందన్న విశ్లేషణ ఉంది. ఏపీలో అసెంబ్లీకి ఎన్నికలు, పార్లమెంటుకు ఎన్నికలు వేర్వేరుగా జరిగి ఉంటే ఎన్టీఆర్‌కు ఆ ఓటమి ఎదురు అయ్యేది కాదేమోనని అప్పట్లో కొందరు వ్యాఖ్యానించారు. 

గెలిచే సత్తా లేక పచ్చ కబుర్లు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ ముందస్తు ఆలోచన చేయలేదనే చెప్పాలి. లోక్ సభతో పాటు కలిసి వెళితే కొన్ని ప్రయోజనాలు ఉండవచ్చు. అసెంబ్లీకి విడిగా ఎన్నికలు జరిగితే మరో రకమైన ఉపయోగం ఉండవచ్చు. ఇవన్ని పరిస్థితులను బట్టి ఉంటాయి. సర్వేలు, తదితర అంచనాల ఆధారంగా ఇలాంటి వాటిలో నిర్ణయాలు తీసుకుంటారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఆయా సమావేశాలలో చాలా స్పష్టంగా సాధారణ ఎన్నికలకు ఎన్ని నెలల సమయం ఉందో చెబుతున్నారు.

ఆయన ఎవరి  వద్దా ముందస్తు  ఊసు చెప్పడం లేదు. అయినా కొంతమంది పనికట్టుకుని జూలైలో అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లవచ్చని ప్రచారం చేస్తున్నారు. దీనిని ఖండిస్తూ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తమ ప్రభుత్వం ఐదేళ్లు పాలిస్తుందని, అందుకే ప్రజలు తీర్పు ఇచ్చారని స్పష్టం చేశారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ పాదయాత్ర, జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాత్రలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఎన్నికలకు వెళతారని కొంతమంది వ్యక్తం చేస్తున్న అనుమానాలను ఆయన తోసిపుచ్చారు. ఎవరికి భయపడనవసరం లేదని వైసీపీ భావిస్తోంది. 

అడ్డగోలు బాబు రొడ్డ కొట్టుడు దత్తపుత్రుడు
జనంలో జగన్ పాలన పట్ల సానుకూలత ఉన్న మాట వాస్తవమే. దానిని ఎలాగైనా దెబ్బతీయడానికి టీడీపీ, జనసేన వంటి పార్టీలు కృషి చేస్తున్నాయి. వారికి ఈనాడు, జ్యోతి తదితర టీడీపీ మద్దతు మీడియాలు  విశ్వయత్నం చేస్తున్నాయి. ఇంతవరకు టిడిపి గాని, జనసేన గాని వచ్చే ఎన్నికలకు ప్రత్యేక ఎజెండానే తయారు చేసుకోలేకపోతున్నాయి. జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలను తామూ కొనసాగిస్తామని చెప్పవలసి వస్తోంది. దాంతో టీడీపీ క్యాడర్లో కూడా ఒకరకమైన గందరగోళం ఏర్పడింది. ఇంతకీ మనం జనం వద్ద ఏమి చెప్పాలన్నదానిపై క్లారిటీ రావడం లేదని వారి భావన. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు రొడ్డకొట్టుడు ఉపన్యాసాలు చేస్తున్నారు. అందువల్ల వైసీపీకి పెద్ద నష్టం జరగకపోవచ్చు. 

చెప్పాడు, చేశాడు, ధైర్యంగా చెబుతున్నాడు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని ఇప్పటికే పలు విధాలుగా సమాయత్తం చేశారు, చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు, గృహ సారధుల పేరుతో కొత్త కాన్సెప్ట్, గ్రామ,వార్డు సచివాలయాల ప్రాతిపదికన బూత్ కమిటీల ఏర్పాటు మొదలైన చర్యలు చేపట్టాలని పార్టీనేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎక్కడైనా పార్టీలలో గ్రూపు తగాదాలు ఉంటే ఇరువర్గాలను పిలిచి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పరంగా వివిద కార్యక్రమాలు చేపడుతూనే, పార్టీ పరంగా కూడా జగన్ ఈ కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో టీడీపీ, జనసేన వంటి పార్టీలకు ఏం పాలుపోక ముందస్తు ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. తద్వారా తమ పార్టీ క్యాడర్‌ను యాక్టివ్ గా ఉంచుకోవాలన్నది వారి లక్ష్యం అని వేరే చెప్పనవసరం లేదు.

బాబు నిర్వీర్యం వ్యాఖ్యల సంకేతమేంటీ?
ఇటీవల పార్టీ సమావేశంలో చంద్రబాబు నాయుడు టీడీపీ క్యాడర్ నిర్వీర్యం అవుతోందని నేరుగా చెప్పేశారు. క్షేత్ర స్థాయిలో ఏం చేయలేక పార్టీకున్న ఒకరిద్దరు నేతలు తన దగ్గరకు వస్తున్నారంటూ చెప్పేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా సర్కులేట్ అయింది. అది పార్టీకి మరింత డామేజీ చేస్తుంది. దానిని అధిగమించేందుకు చంద్రబాబు ముందస్తు ఎన్నికల అవకాశం అంటూ ఉపన్యాసాలు చేస్తున్నారు. 
చదవండి: నిజమే.. పార్టీ లేదు.. బొక్కా లేదు.. చంద్రబాబే స్వయంగా!

జగన్ ముఖ్యమంత్రి అయిన ఏడాదికే అసెంబ్లీ రద్దు చేయాలని చంద్రబాబు సవాల్ చేస్తుండేవారు. తదుపరి స్థానిక ఎన్నికలలో 90 శాతంపైగా ఫలితాలు వైసీపీకి అనుకూలంగా రావడంతో ఆయనకు దిమ్మదిరిగినట్లయింది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి జగన్ సాధారణంగా ఒక విషయం చెబితే దానికే కట్టుబడి ఉంటారన్నది అందరికి తెలిసిన సత్యమే. పైగా ఇప్పటికిప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లవలసిన అగత్యమూ ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్నట్టు ఏ కోశాన కనిపించడం లేదు.
​‍-హితైషి, పొలిటికల్‌ డెస్క్, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

మరిన్ని వార్తలు