విదేశాల్లో చంద్రబాబు నల్లధనం  రూ.5 లక్షల కోట్లు 

12 Apr, 2023 04:46 IST|Sakshi

ప్రధాని మోదీ స్పందించి ఈడీ, సీబీఐతో విచారణ చేయించాలి

విషయ పరిజ్ఞానం లేని దద్దమ్మ లోకేశ్‌  

పవన్‌కళ్యాణ్‌కు ప్రజాసంక్షేమం కనిపించడంలేదు  

తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి  

తిరుపతి రూరల్‌: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమార్జన చేసి దుబాయ్, స్విట్జర్లాండ్‌లో దాచిన రూ.5 లక్షల కోట్ల నల్లధనాన్ని స్వదేశానికి రప్పించాలని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్‌ చేశారు. తిరుపతిలోని అకాడమీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విదేశాల్లో లక్షల కోట్ల రూపాయలు దాచిన చంద్రబాబుపై ఈడీ, సీబీఐ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిపై స్పందించాలని కోరారు.

ఈ మేరకు ఆయనకు లేఖ రాయనున్నట్లు చెప్పారు. చంద్రబాబు అక్రమార్జనలపై పోరాటం చేస్తూనే ఉంటానన్నారు. విషయ పరిజ్ఞానం లేని దద్దమ్మ, ఒక్కచోట కూడా గెలవలేని లోకేశ్‌.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం కామెడీగా ఉందన్నారు. ప్రజాపాలన సాగుతున్న రాష్ట్రంలో విమర్శించేందుకు ఎలాంటి అవకాశం లేకపోవడంతో ప్రతిపక్ష పార్టీ వారు ఫ్ర్రస్టేషన్‌లో బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

టీడీపీ సోషల్‌ మీడియాలో పనికిమాలిన వెధవల్ని, పెంపుడు కుక్కల్ని పోషిస్తూ మహిళలను సైతం కించపరచడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇ చ్చిన హామీల్లో ఇప్పటికే 98 శాతం హామీలను అమలు చేసినందువల్లే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి ఆదరించాలని కోరుతున్నారని చెప్పారు.  

బాలకృష్ణ మాట్లాడితే ఆరు నెలలకు కూడా అర్థం కాదు 
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏం మాట్లాడతారో,  ఎందుకు మాట్లాడుతారో ఆరునెలలకు కూడా ఎవ్వరికీ అర్థం కాదని ఎద్దేవా చేశారు. పుస్తకాలు చదువుతున్న పవన్‌కళ్యాణ్‌కు ప్రజాసంక్షేమం ఎందుకు కనపించడంలేదని ప్రశ్నించారు. కనిపించే అభివృద్ధి, సంక్షేమాన్ని సైతం విమర్శిస్తూ ఉంటే రానున్న ఎన్నికల్లో సైతం ఆయన్ని రెండు కాదు.. మూడుచోట్ల పోటీచేసినా ప్రజలు ఓడిస్తారని హెచ్చరించారు. రాష్ట్రానికి పట్టిన సైకో చంద్రబాబు అని, ఎల్లో మీడియా అండతో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయతి్నస్తూనే ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు పాపాలు పండిపోయాయని, ఆయనకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు.
 
తెలుగు అకాడమీకి పూర్వవైభవం 
రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నిర్విర్యం చేసిన తెలుగు అకాడమీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్వవైభవం తీసుకొస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఇంటర్మిడియట్‌ పుస్తకాలను ముద్రిస్తున్నామని, త్వరలో డిగ్రీ పుస్తకాలను, పోటీ పరీక్షలకు అవసరమయ్యే 17 రకాల పుస్తకాలను ముద్రించనున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల మాండలిక పుస్తకాలు ముద్రిస్తామన్నారు. జాతీయ సంస్కృత యూనివర్సిటీతో కలిసి పనిచేస్తామని తెలిపారు.

తెలుగు అకాడమీ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ తయారు చేసి, ఉద్యోగాలు ఇస్తామంటూ మోసాలు చేస్తుండటంపై విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి రూ.90 కోట్లు రావాల్సి ఉందని, విలువైన ఆస్తులు కూడా అక్కడ ఉన్నాయని తెలిపారు. వాటికోసం ప్రయతి్నస్తుంటే తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని, దీనిపై హైకోర్టులో పోరాడుతున్నామని ఆమె చెప్పారు.  

మరిన్ని వార్తలు