అబద్ధాలపై పేటెంట్‌ చంద్రబాబుకే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

17 Nov, 2022 15:51 IST|Sakshi

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఒక  రికార్డు ఉంది. దేశంలోనే మరే నేత అంతలా అబద్దాలు ఆడలేరన్నది ఆయన రికార్డుగా చాలామంది చెబుతుంటారు. ఆయన విశిష్టత ఏమిటంటే ఎవరు ఏమి అనుకున్నా పట్టించుకోకుండా తాను చెప్పదలచుకున్న అబద్దాన్ని అలవోకగా చెప్పడం. దానిని ప్రజలు నమ్మాలన్న ఉద్దేశంతో పదే, పదే వల్లె వేస్తుండడం. తనకు తాను గొప్పగా ఊహించుకోవడమే కాకుండా ప్రజలంతా అలాగే ఫీల్ అవుతున్నారని ఆయన భావిస్తుంటారు. అంటే తాను భ్రమపడి, ప్రజలు కూడా అదే విధంగా భ్రమపడుతున్నారని నమ్ముతుంటారు.
చదవండి: ఆ మీటింగ్‌ తర్వాత పవన్‌లో నీరసమెందుకు?

గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఇరవైమూడు స్థానాలకే పరిమితం అయిపోయినా, అది తన తప్పుల వల్ల కాదని, ప్రజలే తప్పు చేశారని ఆయన అనుకుంటారు. తాజాగా కర్నూలు జిల్లాలో చేసిన  పర్యటనలో ఎన్ని అబద్దాలు చెప్పారో పరిశీలిస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తాను ఫిట్ గా ఉన్నానని చెప్పడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వయసు రీత్యా ఆయన ఎలా ఉన్నా అసత్యాలు బొంకడంలో మాత్రం ఫిట్‌గా ఉన్నానని పదే, పదే రుజువు చేసుకుంటున్నారు. చంద్రబాబు చేసిన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు, వాటిలోని  అబద్దాలు ఏమిటో చూద్దాం.

బాబు అబద్దం-1
నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరూ నన్ను అవమానించే సాహసం చేయలేదు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో నన్ను, నా సతీమణిని అవమానించారు

అసలు వాస్తవం
చంద్రబాబును ఆయన సొంత మామ ఎన్టీ రామారావే దారుణంగా అవమానిస్తూ వీడియోనే విడుదల చేశారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి ఆయనను చంద్రబాబు అవమానిస్తే, తన అల్లుడు నీచమైన వ్యక్తి అని, ఔరంగజేబు కంటే ఘోరమైన వ్యక్తి అని పలురకాలుగా ఎన్టీఆర్‌ దూషించారు. ఇక తాజా అంశానికి వస్తే.. ఈ టరమ్‌లో చంద్రబాబును, ఆయన భార్యను ఎవరూ అసెంబ్లీలో అవమానించలేదు

టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఒక ఎమ్మెల్యే కుటుంబాన్ని టీడీపీ నేతలు అవమానిస్తే, దానికి బదులుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానిని అసెంబ్లీలో వైసీపీకి ఆపాదించి చంద్రబాబు బయటకు వెళ్లారు. అసెంబ్లీలో కానీ, ఈ ఆరోపణ చేసిన వెంటనే కాని ఆయన రోదించలేదు. అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిన నాలుగు గంటల తర్వాత కెమెరాల ముందు మీడియా సమక్షంలో రోదించినట్లు వ్యవహరించి అభాసుపాలయ్యారు. తన రాజకీయం కోసం భార్యను కూడా రోడ్డుకు ఎక్కించారన్న విమర్శకు గురి అయ్యారు. దీనివల్ల సానుభూతి రావాలన్నది ఆయన ఆశ.

బాబు అబద్దం-2
రాష్ట్రంలో లక్షల రేషన్ కార్డులు తొలగించారు.. పేదవాళ్ల పొట్టగొట్డడంలో జగన్‌మోహాన్‌రెడ్డి దిట్ట

అసలు వాస్తవం
ఏపీలో లక్షల రేషన్ కార్డులు తొలగించింది లేదు. పేదవాళ్ల పొట్టగొట్టింది లేదు. పేదలకోసం అనేక స్కీమ్‌లను ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తుంటే ఆయన ఎలా పొట్ట గొట్టినట్లు అవుతుందో చంద్రబాబు చెప్పకుండా తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. బురద జల్లడం, ఆ తర్వాత మీరే కడుక్కోమని చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.

బాబు అబద్దం-3
నేను అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఎత్తివేస్తానని ప్రచారం చేస్తున్నారు. నేను ఇంతకన్నా మెరుగైన సంక్షేమ పథకాలను  ఇస్తా

అసలు వాస్తవం
గత మూడున్నర ఏళ్లుగా ఏపీలో జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తీవ్రంగా విమర్శించి, పేదలకు ఆర్థిక సాయం చేయడాన్ని పంచడంగా ప్రచారం చేసి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో  తప్పు పట్టిన చంద్రబాబు, తెలుగుదేశం మీడియా వారు ఇప్పుడు స్వరం మార్చుతున్నారు. తాను ఇంకా మెరుగైన సంక్షేమ స్కీములు ఇస్తానని చెబుతున్నారే తప్ప అవేమిటో చెప్పలేకపోతున్నారు.

బాబు అబద్దం-4
పవన్ కల్యాణ్ సభకు స్థలం ఇచ్చారని ఇప్పటంలో ఇళ్లు పడగొట్టారు

అసలు వాస్తవం
రోడ్డు వెడల్పు చేయడానికి ఆక్రమణలలో ఉన్న ప్రభుత్వ స్థలాలను వెనక్కి తీసుకుంటే అక్రమం అంటున్నారు. అసలు అక్కడ ఇళ్లే పడగొట్టలేదు. ప్రహరి గోడలు తొలగిస్తే ఇళ్లను పడగొట్టినట్లు ప్రచారం చేస్తున్నారు

బాబు అబద్దం-5
పవన్ కల్యాణ్ విశాఖ వెళితే పెద్ద సీన్ చేశారు

అసలు వాస్తవం
జనసేన కార్యకర్తలు కొందరు విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడి చేస్తే, వారిని అదుపులోకి తీసుకున్నారు. పవన్ కల్యాణ్ పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ కూడా నిర్వహించి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. అసలు విషయాలు చెప్పకుండా  జనసేన వారిని అరెస్టు చేశారని, పవన్  కార్యక్రమం తనంతట మానుకుంటే దానిని వైసీపీకి చంద్రబాబు అంటగడుతున్నారు.

బాబు అబద్దం-6
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన డ్వాక్రా సంఘాలు దేశానికి ఆదర్శం అని ప్రధాని మోదీ విశాఖలో అన్నారు

అసలు వాస్తవం
ప్రధాని మోదీ ఎక్కడా చంద్రబాబు పేరే ఎత్తలేదు. పైగా డ్వాక్రా సంఘాలు కేంద్రంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టినవి.

బాబు అబద్దం-7
ఏపీకి నేను అధికారంలో ఉన్నప్పుడు 16లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చా. వాటిలో ఐదు లక్షల కోట్ల పెట్టుబడులతో ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించాం

అసలు వాస్తవం
చంద్రబాబు టైమ్‌లో వచ్చిందే ఏభై వేల కోట్ల లోపు పెట్టుబడులు. నిజంగా ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే అవి ఎక్కడెక్కడ ఇచ్చారో  చెప్పాలిగా. విశాఖ పారిశ్రామిక సదస్సుల పేరుతో బోగస్ ఒప్పందాలు చేసుకుని ప్రజలను మోసం చేసే యత్నం చేశారు.

బాబు అబద్దం-8
రాజకీయాలలో నీతి, నిజాయితీకి మారుపేరు విజయభాస్కరరెడ్డి

అసలు వాస్తవం
విజయభాస్కరరెడ్డికి నిజాయితీ పరుడు అన్న పేరు ఉన్న మాట నిజమే. కానీ చంద్రబాబు మాత్రం కోట్ల ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో దారుణమైన అవినీతి ఆరోపణలు చేసేవారు. ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు చేసిన అవినీతి ఆరోపణలపై కోట్ల భగ్గుమన్నారు. పాణ్యం ఉప ఎన్నిక ప్రచారంలో, కర్నూలు లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలను కోట్ల కుమారుడు సూర్యప్రకాశరెడ్డి, కోడలు సుజాత మర్చి పోయి ఉండవచ్చు కానీ ప్రజలు మర్చిపోతారా!

ఇలా రకరకాల అసత్యాలను వల్లె వేస్తూ చంద్రబాబు ప్రచారం సాగిస్తున్నారు. వీటిని జనం నమ్మకపోవచ్చు. అది వేరే విషయం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం సీనియర్ నాయకుడిగా తన బాధ్యత అని ఆయన అంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఏ రకంగా అపహాస్యం పాలైంది అందరికి తెలుసు. తన పార్టీని గెలిపించకపోతే తాను అసెంబ్లీకి వెళ్లలేనని ఆయన వాపోతున్నారు. ఇది ఆయన అసలు బాధ.

జగన్‌కు పాలన చేతకాదని చెబుతున్న ఆయన ఈ మూడున్నర ఏళ్లలో రాష్ట్రంలో జగన్ తీసుకువచ్చిన కొత్త వ్యవస్థలు, అమలు చేసిన స్కీములను మాత్రం విమర్శించలేకపోతున్నారు. పైగా తాను జగన్‌ను మించి సంక్షేమ స్కీములు అందిస్తానని అన్నారు.

దీనిని బట్టే జగన్ పాలనను ఆయన కూడా తనకు తెలియకుండా అభినందించినట్లయింది. ఈ మూడు సంవత్సరాలలో జరిగిన అన్ని ఎన్నికలలో టీడీపీ దారుణంగా ఓడిపోయిన సంగతిని మర్చిపోయినట్లు నటిస్తూ అధికారం వచ్చేస్తుందని టీడీపీ వారిని మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అబద్దాలపై పేటెంట్ హక్కు ఒక్క చంద్రబాబుకే ఉంటుందేమో!
-పొలిటికల్‌ ఎడిటర్, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

మరిన్ని వార్తలు