పార్టీల వైఖరిపై ప్రజలు చర్చ జరపాలి: సీఎం కేసీఆర్

31 Oct, 2023 15:38 IST|Sakshi

సాక్షి, సూర్యపేట: తెలంగాణలో ప్రజల హక్కులు కాపాడుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్ నేతలు ఏనాడు పోరాడలేదని విమర్శించారు. కాంగ్రెస్‌లో డజను మంది ముఖ్యమంత్రులు ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇస్తామని నమ్మబలికి కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. హుజూర్‌నగర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో నేడు సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. 

ప్రపంచంలో రైతు బంధు పదాన్ని పుట్టించిందే సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. రైతు బంధు మంచిదని యూఎన్‌వో, ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసిస్తుంటే.. దాన్ని తీసేస్తామని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. రైతుబంధును తీసేయాలని కాంగ్రెస్ యోచిస్తోందని తెలిపారు. నవంబర్ 30న ఓట్లు వేస్తే పోలింగ్ బాక్సులు పగిలిపోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. రైతు బంధు వద్దనే నాయకుడు కావాలా..? రైతు బంధు ఇచ్చే సైదిరెడ్డి కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు.  

కరెంట్ మూడు గంటలు చాలు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. అసలు  వ్యవసాయం చేస్తే కదా ఎన్ని‌ గంటలు కరెంట్ ఉండాలో తెలిసేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ధరణి తీసేస్తా అని రాహుల్, రేవంత్, భట్టి విక్రమార్క అంటున్నారు.. ధరణి తీసేస్తే వీఆర్వో లాంటి వ్యవస్థలు మళ్లీ వస్తాయని అన్నారు. రైతుబంధు పదహారు వేలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. పింఛన్లు ఐదు వేలకు పెంచుతామని స్పష్టం చేశారు. రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం అందిస్తామని వెల్లడించారు. ప్రతీ ఇంటికి బీఆర్ఎస్ మేనిఫేస్టో తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  

ఆనాడు నోరు మెదపలేదు..
'పార్టీల వైఖరిపై ప్రజలు చర్చ జరపాలని సీఎం కేసీఆర్ అన్నారు. దళితులు అనేక‌ సంవత్సరాలుగా అణచివేతకు గురవుతున్నారు. స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే కాంగ్రెస్ దళితుల అభ్యున్నతి గురించి ఆలోచిస్తే ఇవాళ పరిస్థితి వేరే ఉండేది.‌ తండాల్లో మా పాలనే‌ ఉండాలని గిరిజనులు కోరుకున్నారు. ఓటు అనేది భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చరిత్రను కూడా వక్రీకరిస్తారు నాయకులు. నాగార్జున సాగర్ నిర్మించాల్సిన ప్రాంతంలో నిర్మిస్తే నల్లగొండ అన్ని ప్రాంతాలకు నీరు అందేది.‌ 1956 లో తెలంగాణను ఆంధ్రాలో కలపిన సమయంలో అందరూ వ్యతికించారు. ఆనాడు కాల్పులు జరిపినా కాంగ్రెస్ నేతలు నోరుమూసుకున్నారు.‌ తొమ్మిదేళ్లలో నాగార్జున సాగర్ నుంచి పద్దెనిమిది పంటలు పండించుకున్నాం. టెయిల్ ఎండ్ కు నీళ్లు రాకపోతే కాంగ్రెస్ నేతలు నోరు మెదపలేదు.‌ నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎగిరెగిరి పడుతున్నారు.  పదవులు, కాంట్రాక్టులు ముఖ్యమనే రీతిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.' అని సీఎం కేసీఆర్ అన్నారు. 

తెలంగాణకు పైసా కూడా ఇవ్వనని కిరణ్ కుమార్ రెడ్డి అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కనీసం మాట్లాడలేదని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. ఓట్లు కావాలి కానీ తెలంగాణ ప్రజల బాగోగులు వద్దా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తామని నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ కాదా?అని మండిపడ్డారు.  కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని దీక్షకు కూర్చుంటే తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు.  

ఇదీ చదవండి:   కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన నాగం, విష్ణువర్ధన్‌ రెడ్డి

మరిన్ని వార్తలు