-

మనమేమన్నా గొర్రెలమా..కాదని 30న చెప్పాలె

28 Nov, 2023 16:11 IST|Sakshi

సాక్షి, గజ్వేల్‌ : ‘నరేంద్రమోదీ దేశం మొత్తం  157 మెడికల్‌ కాలేజీలు పెట్టాడు. నేను 100సార్లు అడిగితే కూడా తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వలేదు. జిల్లాకో నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టంలో  ఉన్నా ఒక్కటి కూడా ఇయ్యలే. ఇలాంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకెయ్యాలి. మనమేమన్న పిచ్చిపోషి గాళ్లమా..మనం గొర్రెలం కాదని 30వ తేదీ నిరూపించాలి. మన మీద కుట్రలు చేసే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలో ఆలోచించాలి. ఏమియ్యకున్నా ఓటేస్తే మనల్ని గొర్రెలే అనుకుంటారు’ అని బీఆర్‌ఎస్‌ చీఫ్‌, సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్‌లో జరిగిన చివరి ప్రచార సభలో ఆయన మాట్లాడారు.

‘కాంగ్రెస్‌ గెలిచేది లేదు సచ్చేది లేదు. ఒకవేళ గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నరు. ఆకలి చావుల ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి. నెహ్రూ, ఇందిర పాలనలో మంచి పనులు చేస్తే దళితులు ఇంకా ఇలా ఎందుకు ఉన్నారు కాంగ్రెస్‌ వస్తే ఆకలిచావులే. రైతుబంధు దుబారా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నడు. రైతులకు 3 గంటల కరెంట్‌ చాలని  పీసీసీ అధ్యక్షుడంటున్నడు. 3 గంటల కరెంట్‌ కావాల్నా..24 గంటల కరెంట్‌ కావాల్నా’ అని కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు. 

‘ఫిబ్రవరి నెల వస్తే నాకు 70 ఏళ్లు వస్తాయి. తెలంగాణ తెచ్చిన కీర్తి నాకు చాలు. పదవులు వద్దు. ఇప్పటికే పదేళ్లు ముఖ్యమంత్రిగా చేశాను. తెలంగాణ నెంబర్‌ వన్‌ కావాలన్నదే నా లక్ష్యం. ఈసారి బీఆర్‌ఎస్‌ గెలిస్తే గజ్వేల్‌ నియోజకవర్గంలో అందరికీ దళితబంధు ఇస్తాం. గజ్వేల్‌లో రెండుసార్లు గెలిపించారు. ఈసారి మళ్లీ ఆశీర్వదించండి. గజ్వేల్‌కు ఐటీ టవర్లు తెచ్చిపెట్టే బాధ్యత నాది. మల్లన్నసాగర్‌ ముంపు బాధితులకు కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పిస్తా. వారికి త్యాగం వెలకట్టలేనిది. వారికి నా కృతజ్ఞతలు. ట్రిపుల్‌ ఆర్‌ పూర్తయితే గజ్వేల్‌ దశ మారిపోతుంది’అని కేసీఆర్‌ తెలిపారు.

ఇదీచదవండి..తెలంగాణ ఓటర్లకు సోనియాగాంధీ భావోద్వేగ సందేశం

మరిన్ని వార్తలు