సిద్ధిపేట సభలో సీఎం కేసీఆర్‌ భావోద్వేగం

17 Oct, 2023 20:10 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట: జన్మభూమిని మించిన స్వర్గం లేదని.. సిద్ధిపేట గడ్డ తనను నాయకుడ్ని చేసిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. మంగళవారం ఆయన సిద్ధిపేటలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ, సిద్ధిపేట తనను తెలంగాణకు ముఖ్యమంత్రికి చేసిందని, సిద్ధిపేట రుణం జన్మలో ఏమిచ్చినా తీర్చుకోలేనన్నారు. ‘‘సిద్ధిపేటతో ఎంతో అనుబంధం నాకు ఉంది. సిద్ధిపేటలో నేను తిరగని పల్లె, ప్రాంతం లేదు. ‘‘చింతమడకలో నేను చిన్నవాణ్ణిగా ఉన్నప్పుడు మా అమ్మకు ఆరోగ్యం దెబ్బతింటే ఓ ముదిరాజ్ తల్లి నాకు పాలు పట్టింది’’ అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సీఎం కేసీఆర్‌ భావోద్వేగానికి లోనయ్యారు.

‘‘సిద్ధిపేట మంచినీళ్ల పథకం రాష్ట్రానికే ఆదర్శం. సిద్ధిపేటను హరీష్‌రావు ఎన్నో రెట్లు అభివృద్ధి చేశారు. సిద్ధిపేట అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. తెలంగాణలోనే సిద్ధిపేట వజ్రం తునుకలా తయారవుతోంది. ఆరు అడుగుల బుల్లెట్‌ హరీష్‌రావు సిద్ధిపేటకు అప్పగించా’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.
చదవండి: కేటీఆర్‌కు కాంగ్రాట్స్‌.. తనయుడిని పొగిడిన కేసీఆర్‌ 

మంత్రి హరీష్‌రావు భావోద్వేగం..
ఈ రోజు సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మీ దివెనలతో సిద్దిపేటకి సేవ చేసే అవకాశం దక్కిందని మంత్రి హరీష్‌రావు అన్నారు. మరొక్కసారి సీఎం కేసీఆర్ ఆశీర్వదించి నాకు అవకాశం ఇచ్చారు. నాకు శ్వాస ఉన్నంత కాలం, జన్మ ఉన్నంత వరకు సీఎం కేసీఆర్‌కి, సిద్దిపేట జనాలకే నా జీవితం అంకితం చేస్తాను. మీరు చూపించిన ప్రేమాభిమానాలకు నా చర్మం ఒలిచి మీకు చెప్పులు కట్టించిన తక్కువే. నా చివరి శ్వాస ఉన్నంతవరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో మీకు సేవ చేస్తాను’’ అంటూ హరీష్‌రావు భావోద్వేగానికి లోనయ్యారు.

ఆ ఘనత కేసీఆర్‌దే..
ఇది ఎన్నికల ప్రచార సభలా లేదని, మన కలను నిజం చేసిన సీఎం కేసీఆర్‌కి కృతజ్ఞత సభలా అనిపిస్తుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట దశాబ్దాల కలను నిజం చేసిన నాయకుడు కేసీఆర్. ఆనాటి సీఎం ఎన్టీఆర్‌కు సిద్దిపేట జిల్లా కావాలని కేసీఆర్ వినతి పత్రం ఇచ్చారు. ఇప్పుడు ఆయనే సిద్దిపేటను జిల్లా చేశారు. సిద్దిపేటకి రైలు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. సిద్ధిపేటకి కాళేశ్వరం నీళ్లు వస్తాయంటే ప్రతి పక్షాలు ఎగతాళి చేశాయి. మూడేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి సిద్దిపేటకి నీళ్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే. తెలంగాణకి సీఎంగా ఉన్న ఆయన వ్యవసాయం చేస్తున్నారు. ఆయన ఓ రైతు బిడ్డ కాబట్టే.. రైతుల బాధలు ఆయనకు తెలుసు’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.

రోడ్డు పక్కన హోటల్‌లో చాయ్‌ తాగిన సీఎం కేసీఆర్‌
సిద్దిపేట సభ ముగించుకుని తిరుగు ప్రయాణంలో సీఎం కేసీఆర్‌ కాసేపు సేద తీరారు. మార్గంమధ్యలో సోనీ ఫ్యామిలీ దాబా వద్ద కాసేపు ఆగి చాయ్‌ తాగారు. ఆయనతో పాటు, మంత్రి హరీష్‌రావు, మాజీ స్పీకర్‌ మధుసూదనచారి ఉన్నారు.

మరిన్ని వార్తలు