సారుకు కారు లేదు!

10 Nov, 2023 05:40 IST|Sakshi
గురువారం గజ్వేల్‌లో నామినేషన్‌ దాఖలు చేస్తున్న సీఎం కేసీఆర్‌

కేసీఆర్‌తోపాటు సతీమణి శోభమ్మకు కలిపి రూ. 58.93 కోట్ల ఆస్తులు 

నామినేషన్లతో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లలో వివరాలు వెల్లడి­

సాక్షి, సిద్దిపేట/ సాక్షి, కామారెడ్డి: బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన పేరిట విడిగా సొంత కారు, ద్విచక్ర వాహనం, వ్యవసాయ భూమి వంటివేవీ లేవని ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. గురువారం గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కేసీఆర్‌ నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా తనతోపాటు సతీమణి ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడించారు. 

  • కేసీఆర్, సతీమణి శోభమ్మకు కలిపి మొత్తం ఆస్తులు రూ.58,93,31,800 కాగా.. ఇందులో చరాస్తులు రూ.35,43,31,800, స్థిరాస్తులు రూ.23.50 కోట్లు ఉన్నాయి. మొత్తం అప్పులు రూ.24,51,13,631 ఉన్నాయి. ఇందులో ఇద్దరి పేరిట విడివిడిగా ఉన్న ఆస్తులు కొన్ని, ఉమ్మడిగా మరికొన్ని ఉన్నాయి. 
  • విడిగా పరిశీలిస్తే.. కేసీఆర్‌ చరాస్తులు రూ.17,83,87,492. ఇందులో 95 గ్రాముల బంగారం (రూ. 17.40 లక్షలు విలువ), చేతిలో నగదు రూ 2,96,605 ఉన్నాయి. ఆయన పేరిట ఉన్న స్థిరాస్తుల విలువ రూ.8.5 కోట్లు. రూ.17,27,61,818 అప్పులు ఉన్నాయి. 
  • కేసీఆర్‌ సతీమణి శోభమ్మ పేరిట ఉన్న చరాస్తుల విలువ రూ.7,78,24,488 ఉండగా అందులో 2.841 కిలోల బంగారు అభరణాలు, 45 కేజీల వెండి వస్తువులు (రూ.1,49,16,084 విలువ), అప్పులు ఏమీ లేవు. 
  • కేసీఆర్, శోభమ్మ ఉమ్మడి ఆస్తులు రూ.24,81,19,820 ఉన్నాయి. ఇందులో ఉమ్మడి చరాస్తుల విలువ రూ.9,81,19,820. (దీనిలో రూ.1,16,72,256 విలువైన 14 వాహనాలు ఉన్నాయి), ఉమ్మడి స్థిరాస్తుల విలువ రూ.15 కోట్లు. ఉమ్మడి అప్పులు రూ.7,23,51,813. 
  • కేసీఆర్‌ దంపతులు సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలో 2010 సంవత్సరం నుంచీ ఉమ్మడి ఆస్తులుగా వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు రూ.1,35,00,116 విలువైన 53.30 ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నట్టు అఫిడవిట్‌లో తెలిపారు. అలాగే 9.365 ఎకరాల వ్యవసాయేతర భూమి ఉందని, దానికి నాలా పన్నును సైతం చెల్లించామని వివరించారు. 
  • కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా వచ్చే వేతనం/అలవెన్సులతోపాటు వ్యవసాయ ఆదాయం.. సతీమణి శోభమ్మకు బ్యాంకులోని డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీని ఆదాయంగా చూపించారు. కేసీఆర్‌పై తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన 9 కేసులు ఉన్నట్టు తెలిపారు.
మరిన్ని వార్తలు