Junior Mehmood: నెల రోజుల్లోనే క్యాన్సర్‌ నాలుగో స్టేజ్‌.. 40 రోజుల డెడ్‌లైన్‌..

2 Dec, 2023 19:04 IST|Sakshi

సీనియర్‌ నటుడు, దర్శకుడు జూనియర్‌ మహ్మద్‌ అలియాస్‌ నయూమ్‌ సయ్యద్‌ తీవ్ర అనారోగ్యానికి లోనయ్యాడు. గత నవంబర్‌లో ఇతడికి క్యాన్సర్‌ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. అప్పటినుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ దిగజారుతూ వచ్చింది. ప్రస్తుతం అతడికి క్యాన్సర్‌ నాలుగోదశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఊపిరితిత్తులు సహా ఇతర శరీర అవయవాలు పాడయ్యాయి. ప్రస్తుతం అతడు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాడు.

జూనియర్‌ మహ్మద్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అతడి ఆప్తమిత్రుడు సలాం కాజీ మాట్లాడుతూ.. 'నెల రోజుల కిందటే అతడి​కి క్యాన్సర్‌ సోకినట్లు తెలిసింది. మొదట కడుపులో కణతి కనిపించింది. పరీక్షించగా క్యాన్సర్‌ అని తేలింది. శరీరంలో వచ్చిన మార్పుల కారణంగా అప్పుడే 20 కిలోలు తగ్గిపోయాడు. అతడు కోలుకోవడం కష్టమని వైద్యులు చేతులెత్తేశారు. నెల రోజుల్లోనే నాలుగో స్టేజీకి రావడంతో 40 రోజుల కంటే ఎక్కువ బతకలేడని వైద్యులు చెప్పారు' అని తెలిపాడు.

దీంతో ఆయనకు సాయం చేయడానికి కమెడియన్‌ జానీ లివర్‌.. ముంబైలోని మహ్మద్‌ ఇంటికి వెళ్లాడు. నటుడితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ అతడికి శరీరం సహకరించడం లేదని తెలుస్తోంది. చికిత్సకుగానూ కొంత డబ్బు ఇచ్చేందుకు ప్రయత్నించగా కానీ వారి కుటుంబసభ్యులు అందుకు నిరాకరించడంతో బలవంతంగా కొంత డబ్బును అక్కడ పెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. 

కాగా జూనియర్‌ మహ్మద్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలుపెట్టాడు. మరాఠీ భాషలో అనేక సినిమాలను తెరకెక్కించాడు, నటించాడు. దాదాపు 265 చిత్రాల్లో నటించాడు. కైటీ పతంగ్‌, ఆన్‌ మిలో సజ్నా, కారవాన్‌ వంటి పలు సినిమాలతో ఆయన పాపులర్‌ అయ్యాడు.

చదవండి: స్టార్‌ హీరోయిన్‌ మాజీ భర్తతో నాలుగేళ్లుగా డేటింగ్‌.. బ్రేకప్‌కు అదే కారణమంటూ..

మరిన్ని వార్తలు