బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్యనే పోటీ

10 Nov, 2023 02:43 IST|Sakshi

చాలా చోట్ల కాంగ్రెస్‌కు డిపాజిట్‌ వచ్చే పరిస్థితి లేదు 

కేవలం కొన్ని చోట్లనే ముక్కోణపు పోటీ 

మజ్లిస్‌ నేతలు ఉండాల్సింది జైలులో.. 

కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి 

‘‘అధికార బీఆర్‌ఎస్‌పై ప్రజల ఆగ్రహ జ్వాలల అగ్నిపర్వతం నవంబర్‌ 30న బద్దలవుతుంది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు వారిని అసహ్యించుకుంటున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీకి చాలాచోట్ల  డిపాజిట్‌ వచ్చే పరిస్థితి లేదు. అసలు కొన్ని నియోజకవర్గాల్లో అయితే కాంగ్రెస్‌ అసలు పోటీలోనే లేదు. తెలంగాణలోని యువత మొత్తం భారతీయ జనతాపార్టీ వైపే ఉంది.’’ అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రస్తుత ఎన్నికల రాజకీయ పరిణామాలపై అంచనా వేశారు.

కేసీఆర్‌ పాలనలో తెలంగాణ పూర్తిగా విధ్వంసానికి గురికాగా.. ఒకవేళ కాంగ్రెస్‌ వస్తే రాజకీయ అస్థిరత ఏర్పడి ఉద్యోగులకు జీతాలివ్వలేక తిరుగుబాటు చేసే పరిస్థితులు వస్తాయి. అందుకే బీసీ సీఎం నినాదంతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరుతున్నాం.’ అని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో కిషన్‌రెడ్డి ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు..  


అధికార బీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీలు మేమంటే మేము అధికారంలోకి వస్తామంటున్నాయి కదా ? 
ఎన్నికల్లో మాకు,  బీఆర్‌ఎస్‌కే ప్రధాన పోటీ. కొన్నిచోట్ల మాత్రమే బీజేపీ, బీఆర్‌­ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ముక్కోణపు పోటీ ఉంది. అనేక నియోజకవర్గాల్లో అసలు కాంగ్రెస్‌ పోటీలోనే లేదు. గ్యారంటీల పేరుతో హైప్‌ సృష్టించే ప్రయత్నంతోపాటు బీజేపీపై బురదచల్లి తప్పుడు ప్రచారంతో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. ఇక అధికార బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది.

ఎప్పుడు అగ్నిపర్వతం బద్ధలవుతుందో తెలియదన్నట్టుగా పరిస్థితి ఉంది. వారు ఎంత ప్రచారం చేస్తే ఏమి లాభం, ఆ పార్టీ అభ్యర్థులు ఎక్కడికి వెళ్లినా ప్రజలు  అసహ్యించుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉంది కాబట్టి, నేతల బలాన్ని చూసి ఇప్పుడు బయటకు చెప్పకపోవచ్చు. కానీ బీఆర్‌ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా సరే హ్యాట్రిక్‌ కొడతామంటూ బీఆర్‌ఎస్‌ బింకాలు పోతోంది.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్‌ ఫ్రంట్‌ ఏర్పడితే అక్కడకు వెళ్లాలని కేసీఆర్‌ కలలు కంటున్నారు. ఆయన కుమారుడు కేటీఆర్‌ అప్పుడే సీఎం అయిపోయినట్టుగా ఊహాలోకాల్లో విహరిస్తున్నాడు. మంత్రులను నియమించుకుంటున్నట్టు కేటీఆర్‌ వ్యవహరిస్తున్నాడు. కేవలం భ్రమల్లో బీఆర్‌ఎస్‌ నేతలు బతుకుతున్నారు. ఇక మా పార్టీకి ఊహించని విధంగా ప్రజల్లో మద్దతు పెరుగుతోంది. ఇది మామూలు పరిస్థితుల్లో రాదు. మాది యూత్‌ఫుల్‌ పార్టీ. ఎక్కడి చూసిన యువతే పార్టీని నడిపిస్తోంది. 

ప్రచారాన్ని ఎప్పుడు ముమ్మరం చేస్తారు ? 
నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక నాలుగైదు రోజుల్లో అన్ని పార్టీల అభ్యర్థులపై స్పష్టత వచ్చాక.. మొత్తంగా దీపావళి తర్వాత ప్రచారాన్ని ఉధృతం చేయబోతున్నాం. బీజేపీకి పోలింగ్‌బూత్‌ స్థాయి కమిటీలు, కార్యకర్తలు ఉన్నారు. సంస్థాగత నిర్మాణం ఉంది. ఎవరు అభ్యర్థులు ఐనా ఒరిజినల్‌గా ఉన్న ఆర్గనైజేషన్‌ నెట్‌వర్క్‌ అనేది పనిచేస్తుంది. 

అభ్యర్థుల ఖరారులో ఆలస్యం వల్ల ప్రచారానికి ఇబ్బంది కాదా ? 
బీజేపీలో టికెట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. దీంతో అభ్యర్థుల ఖరారులో కొంత ఒత్తిడి ఏర్పడింది. అయితే ఆయా స్థానా­లకు ఖరారు చేసిన వారు ఇప్పటికే మూడు, నాలుగేళ్లుగా పనిచేస్తున్న వాళ్లే.  ప్రజలకు బాగా తెలిసినవారే. అందువల్ల పెద్ద ఇబ్బందేమి ఉండదు. రాబోయే ఇరవై రోజుల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తాం. ప్రధాని మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ.. ఇలా హేమాహేమీల ప్రచారంతో హోరెత్తిస్తాం. పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తాం. 

పాత వారికి కాకుండా కొత్త వారికి ఎక్కువ సీట్లు ఇచ్చినట్టున్నారు ? 
మాది పెరుగుతున్న పార్టీ. బలపడుతున్న పార్టీ. అందువల్ల మిక్స్‌డ్‌గా ఆలోచించాలి. పాత–కొత్త కలయికగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ కాంబినేషన్‌తో ప్రజల మద్దతు పొందాల్సి ఉంటుంది. పాత వారికే ఇస్తామని మడికట్టుకు ఉండలేం. పూర్తిగా కొత్తవారికీ ఇవ్వలేం. ఆ దిశలో అసెంబ్లీ  ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేశాం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే ప్రయోగం చేసి మంచి ఫలితాలు సాధించాం. అదే ఎక్స్‌పర్‌మెంట్‌తో ఇప్పుడూ మంచి ఫలితాలు సాధిస్తాం. 

బీఆర్‌ఎస్‌ స్థానంలో కాంగ్రెస్‌ వస్తే పెనం నుంచి పొయ్యిలో పడుతుందని మీరు పదే పదే అంటున్నారు ? ఎందువల్ల ? 
కాంగ్రెస్‌ చరిత్ర ఏమిటి? పుట్టుక ఏమిటి? అవినీతి చరిత్ర ఏమిటి? ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఎవరి చేతుల్లో ఉంది ? అని వివరించాల్సిన బాధ్యత మాపై ఉంది. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రూ.12 లక్షల కోట్లు దోపిడీ చేశారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చాక అక్కడి దుస్థితి ఏమిటి? తెలంగాణ ఎన్నికల కోసం కర్ణాటకలో ఎలక్షన్‌ ట్యాక్స్‌ వేస్తున్నారు.

ఇక బీఆర్‌ఎస్‌ అవినీతి పాలన గురించి ప్రజలకు వివరిస్తూనే...కాంగ్రెస్‌ తనకు తాను అధికారంలోకి వస్తామన్నట్టుగా అబద్ధపు ప్రచారంతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. దీంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడకూడదనే హెచ్చరికతో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. ఆ పార్టీల చరిత్రను వివరించి, అవి ఏరకంగానూ తెలంగాణను ఆదుకోలేవనే విషయాన్ని ఉదా«హరణలతో చెప్పి ప్రజలను చైతన్యపరుస్తున్నాం. వాటిని నమ్మి మరోసారి మోసపోవద్దని చెబుతున్నాం.  

ఇక్కడా యూపీ తరహా పాలన అంటున్నారు ? 
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఎంఐఎం వంతపాడుతూ వస్తోంది. పాతబస్తీలో మజ్లీస్‌ దౌర్జన్యమే నడుస్తోంది. కరెంట్‌ బిల్లు, ఇంటి పన్నులు వసూలు చేయలేకపోతున్నారు. 90 శాతం ఇళ్లు మున్సిపల్‌ అనుమతులు లేకుండానే కడతారు. అందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అండగా నిలవడమే కారణం. యూపీలో యోగి ఆదిత్యనాధ్‌ పాలనలో బుల్డోజర్‌ ప్రభుత్వంతో ఆ రాష్ల్ర ముఖచిత్రమే మారిపోయింది. తెలంగాణలోనూ అలాంటి బుల్డోజర్‌ ప్రభుత్వం తెస్తాం.

మాఫియాపై, అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతాం. మజ్లిస్‌ పార్టీ కాదు వారి జేజమ్మలు వచ్చినా ఏమీ చేయలేరు. అక్రమాలు, దాడులకు, నేరాలకు పాల్పడే మజ్లిస్‌ నేతలు ఉండాల్సింది పాతబస్తీలో కాదు చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లల్లో.. .. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ పక్కన కూర్చుని చర్చలు జరుపుతున్నారు. 

మరిన్ని వార్తలు