అద్భుతం.. 3డీ ప్రింటెడ్‌ ఆలయం 

22 Nov, 2023 04:36 IST|Sakshi

శ్రీపాద కార్య సిద్ధేశ్వర స్వామి దేవస్థానంగా నామకరణం 

సిద్దిపేటలో నిర్మాణం.. 24 నుంచి భక్తులకు దర్శనం  

సిద్దిపేట అర్బన్‌: వాస్తుశిల్ప సౌందర్యం, సాంకేతిక పరి/జ్ఞనం మేళవింపుతో అసాధారణమైన రీతిలో నిర్మించిన ఆధ్యాత్మిక అద్భుతం.. ప్రపంచంలోనే మొట్టమొదటి 3డీ ప్రింటెడ్‌ హిందూ దేవాలయం సిద్ధపేటలో ఆవిష్కృతమైంది. సింప్లిఫోర్జ్‌ క్రియేషన్‌తో కలిసి అప్సుజా ఇన్‌ఫ్రాటెక్‌ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అర్బన్‌ మండలం బూరుగుపల్లి శివారులోని చర్విత మెడోస్‌లో నిర్మించిన 3డీ ప్రింటెడ్‌ దేవాలయానికి శ్రీపాద కార్య సిద్ధేశ్వర స్వామి దేవస్థానంగా నామకరణం చేశారు.

వేద పండితుల ఆధ్వర్యంలో మంగళవారం మొదలైన ప్రతిష్టాపన మహోత్సవ పూజలు మరో రెండు రోజులు జరగనుండగా.. 24 నుంచి ఆలయాన్ని భక్తులు దర్శించుకునేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఐకానిక్‌ టెంపుల్‌ సాంస్కృతిక వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని అప్సుజా ఇన్‌ఫ్రాటెక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హరికృష్ణ జీడిపల్లి వ్యాఖ్యానించారు. 

4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 
35.5 అడుగుల పొడవు, 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని హరికృష్ణ తెలిపారు. చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అమిత్‌ ఘూలే మాట్లాడుతూ.. ఆలయం భూకంపాలకు దెబ్బతినకుండా నిర్మించినట్టు తెలిపారు. చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ వసీం చౌదరి మాట్లాడుతూ గర్భగుడిలో వేదమంత్రాల ప్రతిధ్వనులతో భక్తులను మంత్రముగ్ధులను చేసేలా నిర్మాణం జరిగిందన్నారు. పూరీ జగన్నాథ ఆలయం శైలిలో గోపురం డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ఆలయ నిర్మాణ పనులు 70 రోజుల్లో పూర్తయ్యాయి. 

మరిన్ని వార్తలు