వడ్ల గింజలపై ‘పిట్ట’ పోరు

30 Mar, 2022 02:51 IST|Sakshi

ధాన్యం కొనుగోళ్లపై ట్విట్టర్‌ వేదికగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నేతల వాగ్యుద్ధం

రాహుల్‌ ట్వీట్‌తో రాజుకున్న వేడి

రైతుల శ్రమతో రాజకీయం వద్దంటూ తెలుగులో రాహుల్‌ ట్వీట్‌ 

స్పందించిన కవిత, హరీశ్, కేటీఆర్‌ 

ఘాటుగా బదులిచ్చిన రేవంత్‌ 

ఉదయం 9:32
బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులను క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి.
– కాంగ్రెస్‌ నేత రాహుల్‌

ఉదయం 10:32 
రాజకీయ లబ్ధి కోసం ట్విట్టర్లో సంఘీభావం తెలపడం కాదు. నిజాయతీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా నిరసన తెలపండి. ఒక దేశం ఒకే ధాన్యం సేకరణ విధానం కోసం డిమాండ్‌ చేయండి. 
– టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత 

ఉదయం 11:42
టీఆర్‌ఎస్‌ ఎంపీలు లోక్‌సభలో పోరాటం చేయడం లేదు. సెంట్రల్‌ హాల్లో కాలక్షేపం చేస్తున్నారు. ఎఫ్‌సీఐకి ఇకపై బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమంటూ 2021 ఆగస్టులో ఒప్పం దంపై సంతకం చేసి తెలంగాణ రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే.
– టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ 

మధ్యాహ్నం 12:10
తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీరు ఆపండి. రైతుల ఉసురు పోసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టే పనిచేయండి. ఒకే దేశం, ఒకే ధాన్యం 
సేకరణ విధానంలో మీ పార్టీ వైఖరి ఏంటో ముందు చెప్పండి.
– మంత్రి హరీశ్‌రావు

రాత్రి 10:40
రాహుల్‌ జీ.. మీ పార్టీకి ఈ దేశాన్ని 50ఏళ్లకు పైగా పాలించే అవకాశం లభించింది. కానీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం 6 గంటలు కూడా కరెంటివ్వకుండా రైతుల కష్టాలకు, ఆత్మహత్యలకు కారణం అయ్యింది. ప్రస్తుతం తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా, మిషన్‌ కాకతీయ వంటి వినూత్న పథకాలు ఉన్నాయి.
– మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను రోజురోజుకూ వేడెక్కిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల మధ్య వరిపై మాటల వార్‌ నడుస్తోంది. నేతల పదునైన వ్యాఖ్యలు, ఘాటైన విమర్శలతో కూడిన ఈ యుద్ధానికి మంగళవారం ట్విట్టర్‌ వేదికగా మారింది. తెలంగాణ రైతాంగానికి మద్దతుగా రాహుల్‌గాంధీ తెలుగులో చేసిన ట్వీట్‌తో మొదలైన వాగ్యుద్ధం.. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు, ఆయా పార్టీల కేడర్‌ స్పందనలు, ప్రతి స్పందనలతో దాదాపు 7 గంటలకు పైగా కొనసాగింది.

ఈ రెండు పార్టీల మాటల తూటాలను నెటిజన్లు కూడా ఆసక్తికరంగా ఫాలో అయ్యారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ శ్రేణులు కూడా ట్విట్టర్‌ వేదికగా విమర్శల దాడి చేసుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తూ, రాహుల్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటనలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులే కాకుండా ఒడిశా, పంజాబ్, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన పీసీసీ నేతలు సైతం రాహుల్‌ ట్వీట్‌ను ఫాలో అయ్యి కామెంట్లు చేయడం గమనార్హం. 

ట్విట్టర్‌ వార్‌ సాగిందిలా...!
ధాన్యం కొనుగోలు అంశంలో టీఆర్‌ఎస్, బీజేపీల వైఖరిని ఎండగడుతూ మంగళవారం ఉదయం 9:32 నిమిషాలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలుగులో ట్వీట్‌ చేశారు. రాహుల్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 9:43 నిమిషాలకు ట్వీట్‌ చేశారు. అయితే రాహుల్‌ చేసిన ట్వీట్‌పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత 10:12 నిమిషాలకు స్పందించడంతో మాటల యుద్ధం ప్రారంభమైంది. కవిత ట్వీట్‌కు కౌంటర్‌ ఇస్తూ రేవంత్‌ 11:42 నిమిషాలకు మరో ట్వీట్‌ చేశారు. మధ్యాహ్నం 1:47 గంటల సమయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ కూడా కవితకు కౌంటర్‌ ఇచ్చారు.

ఆ తర్వాత 3:29 నిమిషాలకు కవిత, తర్వాత 4:49కు మాణిక్యం ఠాగూర్‌ మధ్య మరోమారు మాటల యుద్ధం సాగింది. రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు 12:10 నిమిషా లకు రాహుల్‌ ట్వీట్‌నుద్దేశించి రీట్వీట్‌ చేయగా హరీశ్‌ రీట్వీట్‌కు రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 2:40 గంటలప్పుడు కౌంటర్‌ ఇచ్చారు. రాత్రి పొద్దుపో యాక రాహుల్‌ ట్వీట్‌కు ప్రతిగా మంత్రి కేటీఆర్‌ కూడా ట్వీట్‌ చేశారు.

ఎవరెవరు ఏమన్నారంటే..
బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల తీరును విమర్శించిన రాహుల్‌ గాంధీ.. ‘తెలంగాణలో రైతుల చివరి గింజ కొనేవరకు కాంగ్రెస్‌ పోరాటం చేస్తుంది..’అన్నారు. కాగా ‘తెలంగాణ రైతుల ఆవేదనను అర్థం చేసుకుని ఉద్యమ కార్యాచరణకు మద్దతుగా నిలిచిన రాహుల్‌ గాంధీకి ధన్యవాదాలు..’అని రేవంత్‌ ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో‘రాహుల్‌గాంధీజీ మీరు ఎంపీగా ఉన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో పంజాబ్, హర్యానాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని టీఆర్‌ఎస్‌ ఎంపీలు ప్రతిరోజూ పార్లమెంట్‌ వెల్‌లోకి వెళ్లి తమ నిరసన తెలియజేస్తున్నారు. మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్‌లోకి వచ్చి నిరసన తెలియజేయండి..’అంటూ ఎమ్మెల్సీ కవిత కౌంటర్‌ ఇచ్చారు. స్పందించిన రేవంత్‌.. టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు.

ఇక మంత్రి హరీశ్‌రావు రంగంలోకి దిగి.. ‘తెలంగాణ ప్రజల మేలు కోరేవాళ్లు అయితే పార్లమెంటులో మా ఎంపీలతో కలిసి మీరూ ఆందోళన చేయండి. రైతుల విషయంలో కూడా రాజకీయాలు చేసి తెలంగాణ సమాజంలో మీ పరువును తీసుకోకండి.’అంటూ ధ్వజమెత్తారు. హరీశ్‌ను ఎద్దేవా చేస్తూ రేవంత్‌ ట్వీట్‌ చేశారు. ‘మామ చల్లని చూపు కోసం అల్లుడి ఆరాటం చూస్తుంటే జాలేస్తోంది. భవిష్యత్తులో బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని మీ మామ ఆదేశంతో రాసిచ్చిన లేఖ ఇదిగో చూడండి.. మా పార్టీ సెంట్రల్‌ హాల్లో ఫోటో షూట్‌ చేయదు. రైతుల కోసం ఫైట్‌ చేస్తుంది.’అని కౌంటర్‌ ఇచ్చారు. 

కాంగ్రెస్‌ నేతల స్పందన
రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నేతలు కూడా ఈ విషయంలో స్పందించారు. ‘ఒక్కరోజైనా టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో వడ్ల సమస్యపై మాట్లాడలేదు. దీనిపై సీఎం కేసీఆర్‌ కూడా మాట్లాడలేదు. రైతుల కోసం రాజీనామాలు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం..’అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ‘రాహుల్‌గాంధీ గురించి మాట్లాడే స్థాయి హరీశ్, కవితలకు లేదు. కేంద్రంతో ములాఖత్‌ అయి ఎఫ్‌సీఐకి ధాన్యం ఇవ్వబోమని రాసిచ్చారు. ముందు రాష్ట్రంలోని రైతుల ధాన్యం కొని ఆ తర్వాత కేంద్రంతో యుద్ధం చేయండి’అని సీఎల్పీ నేత భట్టి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు