మేడ్చల్‌.. ఇక్కడ గెలిస్తే మంత్రి అయ్యినట్టే!

20 Nov, 2023 12:54 IST|Sakshi

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో మేడ్చల్‌ నియోజకవర్గం ఎంతో మంది ఉద్దండులను రాష్ట్రానికి అందించింది. మర్రి చెన్నారెడ్డి, దేవేందర్‌గౌడ్‌ వంటి రాజకీయ ప్రముఖులకు రాజకీయంలో నిలదొక్కుకునేలా మేడ్చల్‌ నిలిచింది. పునరి్వభజనకు ముందు మేడ్చల్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ రాష్ట్రంలో మంత్రి పదవులు పొందినవారే. పునరి్వభజనకు ముందు జీహెచ్‌ఎంసీతో కలిసి ఉండే నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రంలో ఖైరతాబాద్‌ తర్వాత అతి పెద్దదిగా మేడ్చల్‌ ఉండేది. మేడ్చల్, కూకట్‌పల్లి(కొంతభాగం) కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్‌బీనగర్‌(కొంతభాగం) నియోజకవర్గాలు కలిపి మేడ్చల్‌ నియోజకవర్గంగా ఉండేది. పునరి్వభజన తర్వాత మూడు ముక్కలైంది.  

1962లో ఏర్పడ్డ మేడ్చల్‌ నియోజకవర్గం మొదటి ఎన్నికల్లో స్వాతంత్య్ర సమరయోధుడు వందేమాతరం రాంచందర్‌రావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నాటి కాంగ్రెస్‌ యోధుడు కేవీ రంగారెడ్డిపై విజయం సాధించారు.  

1967 నుంచి 72 వరకు ఎస్సీ రిజర్వ్‌డ్‌ కావడంతో కాంగ్రెస్‌ అగ్రనేత సుమిత్రాదేవి రెండుసార్లు కాంగ్రెస్‌ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.  

1978లో మర్రి చెన్నారెడ్డి మేడ్చల్‌ నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. 1983లో దివంగత తెలంగాణ పోరాట యోధుడు గౌడవెల్లికి చెందిన సింగిరెడ్డి వెంకట్రాంరెడ్డి సతీమణి ఉమాదేవి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఎనీ్టఆర్‌ హవాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  

1983లో జరిగిన ఉప ఎన్నికల్లో ఘట్‌కేసర్‌ మండలం కొర్రెములకు చెందిన కొమ్మురెడ్డి సురేందర్‌రెడ్డి టీడీపీ నుంచి బరిలో నిలబడి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఎనీ్టఆర్‌ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 
 
1989లో జరిగిన ఎన్నికల్లో తిరిగి ఉమాదేవి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో నాటి రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఉన్న తూళ్ల దేవేందర్‌గౌడ్‌కు ఎన్నికల ఆరు నెలల ముందే ఎనీ్టఆర్‌ మేడ్చల్‌ టికెట్‌ ప్రకటించడంతో 1994, 1999, 2004లలో కాంగ్రెస్‌కు చెందిన సింగిరెడ్డి ఉమాదేవిపై, సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డిపై, టీఆర్‌ఎస్‌కు చెందిన సురేందర్‌రెడ్డిపై దేవేందర్‌గౌడ్‌ వరుసగా గెలిచారు. ఎనీ్టఆర్, చంద్రబాబు కేబినెట్‌లలో రెవెన్యూ, బీసీ సంక్షేమం, హోంమంత్రిగా పనిచేసి, రాజశేఖర్‌రెడ్డి హయాంలో టీడీఎల్‌పీ ఉపనేతగా పని చేశారు.  

2004లో పునరి్వభజన తర్వాత కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి టీడీపీకి చెందిన నక్క ప్రభాకర్‌గౌడ్‌పై గెలుపొందారు. 2014లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన మలిపెద్ది సు«దీర్‌రెడ్డి టీడీపీకి చెందిన తోటకూర జంగయ్యపై ఎమ్మెల్యేగా గెలిచారు. 

అందరికీ ఆశ్రయం ఇచ్చిన మేడ్చల్‌.. 
మేడ్చల్‌ ఓటర్లు ఏనాడూ స్థానిక స్థానికేతర భేదం లేకుండా అందరినీ రాజకీయంగా ఆదరించారు. మేడ్చల్‌ నుంచి 12 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఉమాదేవి, సురేందర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డిలు మాత్రమే నియోజకవర్గానికి చెందిన వారు కాగా మిగతా వారు నియోజకవర్గంలో ఓటు హక్కు లేని నేతలే. ఇలా మేడ్చల్‌ రాష్ట్రానికి ఉద్దండ నాయకులను అందించడంతో పాటు చాలామంది నాయకులకు రాజకీయ భవిష్యత్‌ను అందించింది. ఆరుసార్లు ఓడిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని మొదటిసారి చట్టసభలకు పంపిన ఘనత మేడ్చల్‌ ఓటర్లదే.. పోటీలో తొలిసారి నిలిచిన దేవేందర్‌గౌడ్, సురేందర్‌రెడ్డి, సు«దీర్‌రెడ్డి, ఉమాదేవి, మల్లారెడ్డి వంటి నాయకులకు రాజకీయ భవిష్యత్‌ను కల్పించిన ఘనత మేడ్చల్‌ ఓటర్లదే..  

మరిన్ని వార్తలు