వీడియో: ఆయన మంచి మనిషి.. తల్చుకుని మరీ కంటతడి పెట్టిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

7 Jun, 2023 15:22 IST|Sakshi

ఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కంటతడి పెట్టారు. నగరంలో ఓ స్కూల్‌ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం కేజ్రీవాల్‌, తన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 

మనీశ్‌ సిసోడియా గారు ఇది మొదలుపెట్టారు. ఇవాళ ఆయన్ని ఎంతో మిస్‌ అవుతున్నా. విద్యా శాఖ మంత్రిగా ఆయన ఎనలేని సేవలు అందించారు. ప్రతీ చిన్నారికి మెరుగైన విద్య అందించాలన్నది ఆయన కల. అందు కోసం విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడం, పాఠశాలలు మెరుగైన వసతులతో నిర్మించడం లాంటి ప్రయత్నాలు చేశారు. బహుశా అందుకేనేమో ఆయన్ని ఇవాళ జైలులో పెట్టారు అని మాట్లాడుతూ.. సీఎం కేజ్రీవాల్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు.  

విద్యారంగంలో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను అంతం చేయాలని వాళ్లు కోరుకుంటున్నారు. కానీ, అలా జరగనివ్వము అంటూ బీజేపీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. వాళ్లు తప్పుడు ఆరోపణలు చేశారు. తప్పుడు కేసులు బనాయించి ఓ మంచి మనిషిని(మనీశ్‌ సిసోడియాను ఉద్దేశించి..) జైలుకు పంపించారు. ఆయన్ని ఎందుకు జైల్లో పెట్టాలి. ఎంతో మంది నేరస్తులు, దోపిడీ దారులు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఈ దేశంలో. ఒకవేళ ఆయన గనుక మంచి చేసి ఉండకపోతే.. జైలుకు వెళ్లి ఉండేవారు కాదేమో. ఆయన చేసిన మంచి.. వాళ్లకు కంటగింపుగా మారింది అంటూ మండిపడ్డారు కేజ్రీవాల్‌.

ఆయన ఈ సమాజానికి మంచి జరగాలని అనుకున్నాడు. ఆ ఆశయాలు మనం నెరవేర్చాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఆయన బయటకు వస్తారనే పూర్తి నమ్మకం నాకుంది. సత్యం ఏనాడూ ఓడిపోదు. సత్య మార్గంలో నడిచే వాళ్లకు దేవుడు కూడా తోడు ఉంటాడు. ఆయన బయటకు వచ్చేదాకా.. ఆ మంచిని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనది అంటూ పేర్కొన్నారాయన. 

లిక్కర్‌ స్కాం కేసు తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న మనీశ్‌ సిసోడియాను విచారణకు పిలిచి.. అటు నుంచి అటే అరెస్ట్‌ చేసింది సీబీఐ.  ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. మధ్యలో మనీలాండరింగ్‌ ఆరోపణలపైనా ఈడీ సెపరేటుగా ఛార్జిషీట్‌ దాఖలు చేసింది కూడా.  మరోవైపు ఢిల్లీ హైకోర్టులో ఆయన బెయిల్‌ దక్కకపోగా.. సుప్రీం కోర్టును ఆశ్రయించారాయన.

ఇదీ చదవండి: అమిత్‌ షా నివాసం వద్ద నిరసనలు

మరిన్ని వార్తలు