బిహార్‌ ఫలితాలు: శివసేనకు ఎదురుదెబ్బ

12 Nov, 2020 19:23 IST|Sakshi

సాక్షి, ముంబై : ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా ఆఘాడీ ప్రభుత్వం ప్రజా గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తోందని మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ ఆరోపించారు. రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నబ్‌ గోస్వామిపై వ్యక్తిగత కక్ష పెంచుకుని, ఆయన్ను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఇంటీరియర్‌ డిజైనర్‌ అన్వయ్‌ ఆత్మహత్య కేసులో నవంబర్‌ 4న అర్నబ్‌ అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. మేజిస్ట్రేట్‌ అర్నబ్‌ను పోలీస్‌ కస్టడీకి ఇవ్వడానికి నిరాకరిస్తూ నవంబర్‌ 18 వరకు జ్యూడీషియల్‌ రిమాండ్‌కు అనుమతించింది. అయితే హైకోర్టులో అర్నబ్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను బెంచీ కొట్టివేసింది. సెషన్స్‌ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. (‘మహా’ ప్రభుత్వం పతనం ఖాయం.​‍!)

అయితే అర్నబ్‌ మధ్యంతర బెయిల్‌ కోసం సుప్రీం తలుపు తట్టారు. అర్నబ్‌కు సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో బుధవారం ఫడ్నవిస్‌ మీడియాతో మాట్లాడారు. శివసేన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మహారాష్ట్ర ప్రభుత్వ స్థానాన్ని సుప్రీం చూపించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు అనుమతి తీసుకోకుండా, మూసివేసిన కేసును తిరిగి తెరిచి, అర్నబ్‌ను వీధి నేరస్థుడిలా చూసిందని మండిపడ్డారు. అతన్ని ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందని, అతన్ని ఒక జైలు నుంచి మరొక జైలుకు మార్చారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రజల గొంతును అణిచివేసేందుకు ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం ఇష్టపడుతోందని ఫడ్నవీస్‌ ఆరోపించారు.  ఇది రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని తలపిస్తోందని అన్నారు. 

శివసేనకు ఎదురుదెబ్బే.. 
కాంగ్రెస్‌ పార్టీలో నాయకత్వం సరిగా లేదని, ప్రజలు ఆ పార్టీని నమ్మడం లేదని ఫడ్నవిస్‌ ఎద్దేవా చేశారు. బిహార్‌లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించడంపై ఆయన స్పందించారు. ఫడ్నవిస్‌ బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నందుకు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఫలితం అనుభవిస్తుందని వ్యాఖ్యానించారు. బిహార్‌లో ప్రధాని మోదీ ప్రచారం బీజేపీకి కలిసొచ్చిందని ఫడ్నవిస్‌ స్పష్టంచేశారు. గ్రామగ్రామానికి బీజేపీ అభివృద్ధి మంత్రం పనిచేసిందని, వారి వరకు తీసుకెళ్లగలిగామన్నారు.  కాంగ్రెస్‌ చర్యలు భవిష్యత్తులో మహా రాజకీయాలను ప్రభావితం చేస్తాయని తెలిపారు. ఆ ప్రభావం శివసేనపై పడుతుందని, ఇపుడు సేనకు అర్థం కాబోదని, వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో తగలబోయే ఎదురుదెబ్బతో తెలుస్తుందని ఫడ్నవిస్‌ జోస్యం చెప్పారు.

బాధితులకూ న్యాయం జరగాలి: మంత్రి మలిక్‌ 
వ్యక్తిగత స్వేచ్ఛ అందరికీ ఉంటుందని అదే సమయంలో బాధితులకూ న్యాయం జరగాలని ఎన్సీపీ నేత, మైనార్టీ వ్యవహారాల శాఖమంత్రి నవాబ్‌ మలిక్‌ వ్యాఖ్యానించారు. కాగా, అర్నబ్‌ అరెస్టు గురించి కోర్టు వ్యాఖ్యానిస్తూ.. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం సబబు కాదని, అది న్యాయాన్ని అపహాస్యం చేయడమేనంది.  భావజాలం, అభిప్రాయ భేదాల నడుమ కొంతమంది వ్యక్తులను టార్గెట్‌ చేసుకోవడం పట్ల కూడా సుప్రీం ఆందోళన వ్యక్తంచేసింది. ఈ సందర్భంగా మంత్రి మలిక్‌ మాట్లాడుతూ.. దేశ న్యాయవ్యవస్థను గౌరవించడం అందరి బాధ్యత అని వ్యక్తి యొక్క స్వేచ్ఛ గురించి మాట్లాడారని, అదే సమయంలో బాధితుడికి న్యాయం కూడా జరగాలని వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానులే అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు