DMDK Party: ప్రేమలత చేతికి పార్టీ పగ్గాలు..? 

9 Dec, 2021 08:08 IST|Sakshi

సాక్షి, చెన్నై(తమిళనాడు): విజయకాంత్‌ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా డీఎండీకే పగ్గాలు చేపట్టేందుకు ఆయన సతీమని ప్రేమలత విజయకాంత్‌ సిద్ధమవుతున్నారని డీఎండీకేలో చర్చ జరుగుతోంది. సినీ నటుడిగా రాజకీయ పార్టీ పెట్టి 2006 ఎన్నికల్లో  తనకంటూ ఓటు బ్యాంక్‌ను డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ చాటుకున్నారు. 2011 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు.

దివంగత సీఎం జయలలితతో వైర్యం విజయకాంత్‌ పార్టీకి గడ్డు పరిస్థితులు తెచ్చిపెట్టాయి. 2014 లోక్‌ సభ, 2016 అసెంబ్లీ, 2019 లోక్‌ సభ,  2021 అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయి. ముఖ్య నేతలందరూ విజయకాంత్‌కు హ్యాండిచ్చారు. అయినా ఏ మాత్రం తగ్గకుండా పార్టీని విజయకాంత్‌ నడుపుతున్నారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. దీంతో పార్టీ కోశాధికారిగా పగ్గాలు చేపట్టిన ఆయన సతీమని ప్రేమలత డీఎండీకేను ముందుండి నడిపిస్తున్నారు.  

అధ్యక్ష...లేదా ప్రధాన కార్యదర్శిగా.. 
నగర పాలక సంస్థల ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కొనేందుకు డీఎండీకే సిద్ధం అవుతోంది. ఇందు కోసం పార్టీ పూర్తి బాధ్యతలను తన భుజాన వేసుకునేందుకు ప్రేమలత విజయకాంత్‌ సిద్ధమవుతున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లు సంకేతాలు వెలువడ్డాయి. పార్టీ నిర్వాహక అధ్యక్ష పదవిని ప్రేమలత చేపట్టే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

అయితే అధ్యక్షుడిగా విజయకాంత్‌ వ్యవహరిస్తున్న దృష్ట్యా, పార్టీలో కొత్తగా ప్రధాన కార్యదర్శి పదవిని సృష్టించి ఆ పదవి చేపట్టాలని ప్రేమలతకు జిల్లాల కార్యదర్శులు సూచించారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ, సర్వ సభ్య సమావేశంలో ఇందుకు తీర్మానాలు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు డీఎండీకేలో జోరుగా చర్చ జరుగుతోంది. విజయకాంత్‌ వారసులు సైతం పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టబోతున్నట్టు సమాచారం.   

మరిన్ని వార్తలు