కాంగ్రెస్‌కు రూ. 25 కోట్లు..

22 Apr, 2023 04:04 IST|Sakshi

మునుగోడు ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ ఇచ్చింది: ఈటల

ఇది నూటికి నూరుపాళ్లు నిజం.. కానీ ఆధారాలు చూపలేం

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ బొమ్మా బొరుసులాంటివి.. ఎవరికి ఓటేసినా ఒక్కటే..

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్‌పార్టీకి రూ.25 కోట్లు బీఆర్‌ఎస్‌ ఇచ్చిన విషయం నూటికి నూరుపాళ్లు నిజమని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. దీనికి ఎలాంటి లెక్కలు, పత్రాలు, ఆధారాలు చూపించలేమన్నారు. కాంగ్రెస్‌పై, ఆ పార్టీ నేతలపై విమర్శలు వస్తే ముందుగా స్పందిస్తోంది సీఎం చంద్రశేఖరరావేనన్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఒకే నాణేనికి ఉన్న బొమ్మా బొరుసు వంటివని, ఈ రెండు పార్టీల్లో ఎవరికి ఓటు వేసినా ఒకటేనని తేల్చిచెప్పారు. శుక్రవా రం ఈటల మీడియాతో మాట్లా డుతూ...సింగరేణి సంస్థను కేంద్రం ప్రైవేటీకరిస్తోందని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలపై సీఎం కేసీఆర్, ఆ పార్టీనేతలు బహిరంగ చర్చకు రావాలని, సమయం, తేదీ చెబితే చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. చర్చకు రాకుంటే సింగరేణి ప్రైవేటీకరణ అంశంపై మాట్లాడటం ఆపేయాలని డిమాండ్‌ చేశారు. తాడిచర్ల మైనింగ్‌ బొగ్గు తీయడం సింగరేణికి ఎందుకు లాభదాయకం కాదో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

సింగరేణి సంస్థను కేంద్రం ప్రైవేటీకరిస్తోందని ప్రజలను బీఆర్‌ఎస్‌ నమ్మించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రామగుండం సభలో ప్రధాని మోదీ సింగరేణిని ప్రైవేట్‌పరం చేయబోమని స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. సింగరేణిమైన్స్‌లో పనుల్ని ప్రైవేట్‌ పరం చేస్తోంది కేసీఆరేనని ధ్వజమెత్తారు. ధనస్వామ్యంతో ఎన్నికల వ్యవస్థనే కేసీఆర్‌ దిగజార్చారని తనను ఓడించేందుకు హుజురాబాద్‌ ఉపఎన్నికల్లో రూ.6 వేల కోట్లు ఖర్చు చేసినా ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోలేదన్నారు. 

మరిన్ని వార్తలు