సీఎం కేసీఆర్‌ది రాజకీయ వ్యభిచారం

28 Jul, 2021 07:49 IST|Sakshi

సాక్షి, ఇల్లందకుంట(కరీంనగర్‌): నాయకులను కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్‌ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని  కాంగ్రెస్‌ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ విమర్శించారు. ఇల్లందకుంట మండలంలోని సీతారామ చంద్రస్వామి దేవాలయంలో మంగళవారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ ఒక్కడి వల్లే రాష్ట్రం ఏర్పాటు కాలేదని, అమరుల త్యాగాలను చూసి చలించిన సోనియాగాంధీ మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చారన్నారు.

నేడు రాష్ట్ర అప్పులు రూ.4 లక్షల కోట్లకు పైగా ఉన్నాయని తెలిపారు. కేసీఆర్‌ రూ.వేల కోట్లు కమీషన్‌ తీసుకొని, ఆంధ్రావాళ్లకు ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఇచ్చారని మండిపడ్డారు.  కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. సీఎం అభద్రతా భావంతో దళితులను ప్రగతి భవన్‌కు పిలిపించుకొని, నాటకాలు ఆడుతున్నారని అన్నారు. మొన్నటివరకు కాంగ్రెస్‌ నేతగా ఉన్న కౌశిక్‌రెడ్డి కోవర్టుగా పనిచేసి, టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారని పేర్కొన్నారు.

కొద్ది రోజుల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని నిలబెడతామని, నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్‌ను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, నరేందర్‌ రెడ్డి, మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, శ్రీరాంచక్రవర్తి తదితరులున్నారు.  

మంత్రిగా ఈటల చేసిందేమీ లేదు
జమ్మికుంట(హుజూరాబాద్‌): ప్రత్యేక రాష్ట్రంలో రెండుసార్లు మంత్రిగా ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తెలంగాణ సామాజానికి చేసిందేమీ లేదని టీపీసీసీ ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆరోపించారు. మంగళవారం సాయంత్రం జమ్మికుంట పట్టణంలోకి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.

ఈటల ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 8 వేల వైద్యుల పోస్టులు ఖాళీగా ఉంటే ఎందుకు చేయలేదని, కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనన్నారు. దళిత సీఎం హామీని సీఎం కేసీఆర్‌ విస్మరించారని, హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఆయనకు గుణపాఠం చెప్పాలని కోరారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు