Election Results: ప్చ్‌.. ఎగ్జిట్‌ ఎవరికో?

1 Dec, 2023 16:18 IST|Sakshi

అది 2021 పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల టైం. దశలవారీగా పోలింగ్‌ జరుగుతూ వస్తోంది. ఫలితాలకు కొన్నిరోజుల ముందు దాదాపుగా ఓ 20 సర్వే సంస్థలు ఎగేసుకుని ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించేశాయి. అందులో సగానికిపైనే బీజేపీ 90కిపైనే స్థానాలు సాధిస్తుందని.. మరికొన్నేమో ఏకంగా బంపర్‌ విక్టరీ సాధిస్తుందని చాటింపేసుకున్నాయి. తీరా ఫలితాలు చూస్తే ఒకటి, రెండు సర్వేలు మాత్రమే ఆ అంచనాల్ని అందుకోగా.. మిగతావన్నీ బొక్కాబోర్లా పడ్డాయి. బీజేపీ 77 సీట్లు మాత్రమే సాధించి ప్రతిపక్షంలో కూర్చుంది.

ఎగ్జిట్‌పోల్స్‌ వచ్చేశాయోచ్‌.. అని అవి పట్టుకుని అటు బిజీబిజీ చర్చావేదికల్లో పాల్గొనే నేతలు, ఇటు గుంపుగా గుమిగూడి ఓ తెగ మాట్లాడేసుకునే జనాలు.. ఎవరు గెలుస్తారనేది చెప్పేశాం, మా బాధ్యత తీరింది అని చేతులు దులిపేసుకునే సర్వే సంస్థలు.. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో కనిపిస్తున్న దృశ్యాలివే. మరి తీరా ఫలితం వచ్చాక ఆ అంచనాలు సరిపోలుతాయా? అంటే.. తలకిందులే అయిన సందర్భాలు అనేకం ఉన్నాయని గతం గుర్తు చేస్తోంది. 

2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌ను, అసలు ఫలితాలను గమనిస్తే... చాలా సంస్థలు ఓటరు నాడిని పసిగట్టడంలో బోల్తా పడ్డాయని అర్థమైపోతుంది. ఆ టైంలో ప్రముఖ ఛాన్సెల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ సగటుకు, అసలు ఫలితాలకు భారీతేడా కనిపించింది. అప్పట్లో ఈ సంస్థలన్నీ ఎన్డీయే కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేస్తే.. యూపీఏకు అధికంగా సీట్లు వచ్చాయి. అప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో.. ఎగ్జిట్‌పోల్స్‌ ఎక్కువసార్లు అంచనాల్ని అందుకోలేకపోతూ వస్తున్నాయి.   

పక్కా ఫలితం.. అంత వీజీ కాదు
ఎగ్జిట్‌పోల్స్‌కు కచ్చితత్వం.. శాస్త్రీయతలు ఉన్నాయా?.. ఆ సంగతిని పక్కనపెడితే..  మీడియా సంస్థలపై ఎగ్జిట్‌ పోల్స్‌ ఒత్తిడి మాత్రం నానాటికీ పెరుగుతోంది. ఓటర్‌ పల్స్‌ ఏంటన్నది టీవీ ఛానళ్లకు కచ్చితంగా దొరకడం లేదు. పైగా ఎన్నికల సంఘం ఆంక్షల నుంచి అభిప్రాయ సేకరణకు సవాళ్లు ఎదురవుతున్నాయి. అంతా అయ్యాక చూస్తే..  ఓటర్‌ ఏకంగా ‘అంతరిక్ష పల్టీ’ కొడుతున్నాడు. ఓటు వేసేది ఒకరికని అభిప్రాయ సేకరణలో చెప్పి.. పోలింగ్‌ టైంలో మరొకరి వైపు మొగ్గు చూపిస్తున్నారు.    

ఎగ్జిట్‌ పోల్స్‌లో జరిగేది ఏంటంటే.. ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణ. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌లో కనీసం రెండున్నర లక్షలకు పైగా ఓటర్లు ఉంటారు. కానీ, ఓటర్‌ సర్వే సంస్థలు మాత్రం కేవలం ఒక్క శాతం, రెండు శాతమో అభిప్రాయం మాత్రమే తీసుకుంటాయి. అలాంటప్పుడు.. ఫలితం పక్కాగా వస్తుందా? 

సారీ తప్పైంది!
ఎగ్జిట్‌ పోల్స్‌ అనేవి అంచనాలు. ఒక్కోసారి ఆ అంచనాలు అందుకోవచ్చు.. లేదంటే దరిదాపుల్లో ఉండొచ్చు. కానీ, ఓటర్‌ నాడి పసిగట్టలేక ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పైన సందర్భాలే ఎక్కువున్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే ఆ ఎగ్జిట్‌పోల్స్‌ తీవ్ర విమర్శలకు దారి తీశాయి కూడా.  ఉదాహరణకు 2015 బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలన్నీ తప్పాయి. దీంతో ఎగ్జిట్‌ పోల్స్‌ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో ఎన్డీటీవీ ఒక అడుగు ముందుకేసింది. ‘‘క్షేత్రస్థాయిలో జరిగిన సమాచార సేకరణ మొత్తం తప్పైంది. తప్పు ఎక్కడ జరిగిందో పరిశీలిస్తున్నాం. పూర్తి బాధ్యత మాదే.. క్షమించండి..’’  అంటూ ఎన్డీటీవీ కో చైర్‌పరసన్‌ ప్రణోయ్‌ రాయ్‌ బహిరంగ ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఆ మీడియా సంస్థ ఎగ్జిట్‌పోల్స్‌కు దూరంగా ఉంటూ వస్తోంది.  

సర్వే సంస్థల్లో లోపిస్తోన్న అంశాలు

  • వయస్సు పరంగా ఓటర్లను కలవాలి (యువత, వృద్ధులు, మధ్య వయస్సు)
  • వృత్తి పరంగా ఓటర్లను కలవాలి (రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు)
  • మతం ప్రాతిపదిక తీసుకోవాలి (హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌)
  • కులం ప్రాతిపదిక ఉండాలి (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ)
  • జెండర్‌ ప్రాతిపదిక ఉండాలి (పురుషులు వేరు, మహిళల ఓటు తీరు వేరు)
  • ప్రాంతం అత్యంత కీలకం (నగరం, పట్టణం, గ్రామం, కొండ ప్రాంతం, అటవీ సమీప ప్రాంతం)

ఓటర్లకు విసుగెత్తి..
ప్రస్తుతం మార్కెట్‌లో సర్వే చేస్తోన్న సంస్థలో శాస్త్రీయత లోపించడం ప్రధానంగా కనిపిస్తోంది. అలాగే.. సర్వే చేపడుతున్న సెఫాలజిస్టుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది.  ప్రశ్నల్లో స్పష్టత లేకపోవడంతో.. ఓటర్లు ఆ సమయానికి ఏదో ఒకటి చెప్పేస్తున్నారు. ఈ విషయంలో  చాలా సార్లు లోపం కనిపిస్తోంది. పైగా ఓటరు కచ్చితంగా ఎటు ఓటు వేస్తాడనే దానిపై పక్కా అభిప్రాయం రాబట్టాలని.. చాలా ఎక్సర్‌ సైజ్‌ చేస్తున్నారు. మరోవైపు ఫోన్ల ద్వారా జరిగే సర్వేల సంగతి సరేసరి. పదే పదే ఓటర్లకు ఫోన్లు చేసి విసిగిస్తున్నాయి సర్వే సంస్థలు. దీంతో సాధారణంగానే చికాకులో ఉండే ఓటర్లు ఏదో ఒక సమాధానం చెప్తున్నారు. విద్యార్థుల్ని ఇలాంటి వ్యవహారాల్లో భాగస్వామ్యం చేస్తున్నాయి సర్వే సంస్థలు. దీంతో  అసలు ఫలితం చాలా సార్లు తేడా కొడుతోంది. 

ఈసీ ఏమందంటే.. 
ఎగ్జిట్‌ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనూ స్పందించింది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఎస్‌వై ఖురేషీ స్పందిస్తూ.. ఎగ్జిట్‌ పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌ అనేవి తెర వెనుక వ్యవహారాలు. వాటిని అసలు అనుమతించకూడదని అన్నారు. ‘‘స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికలకు ఇవి కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. రాజకీయ పార్టీలు కూడా వీటిని వ్యతిరేకించారనే విషయాన్ని ఆ సందర్భంలో ఆయన గుర్తు చేశారు కూడా. 

నేతలది అలాంటి మాటే..  
తమకు అనుకూలంగా వస్తే మంచిది. లేకుంటే చెడ్డది. ఎక్కడైనా ఇది కనిపించే తంతే. అయితే.. ఎగ్జిట్‌పోల్స్‌ విషయంలో రాజకీయ పార్టీలు ప్రతికూల వ్యాఖ్యలు చేసిన సందర్భాలే అనేకం. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌ను కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. రబ్బిష్‌.. న్యూసెన్స్‌ అంటూనే ఎగ్జిట్‌ పోల్స్‌కు అంత శాస్త్రీయత ఉందని తాము అనుకోవట్లేదని, పోలింగ్‌ జరుగుతుండగానే ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే జరుగుతుందనే విషయాన్ని ప్రస్తావించారు. వాస్తవానికి ఆ వాదనలోనూ వాస్తవం లేకపోలేదు. పోలింగ్‌ సమయం అధికారికంగా ముగిసింది సాయంత్రం ఐదు గంటలకు. అర గంట తర్వాత ఎగ్జిట్‌పోల్స్‌ బయటకు వచ్చాయి. కానీ, తెలంగాణలో పోలింగ్‌ కోసం ఓటర్లు సాయంత్రమే ఎక్కువగా వచ్చారని.. రాత్రి 10 గంటలదాకా ఓటింగ్‌ జరిగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ లెక్కన ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మొచ్చా?.. పోనీ ఆ అంచనాలే ఫలిస్తాయా?.. తెలియాలంటే డిసెంబర్‌ 3 దాకా వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు