MP Exit Poll Results 2023: నడిపించేది విజన్‌.. టెలివిజన్‌ కాదు.. కమల్‌నాథ్‌ గీతోపదేశం!

1 Dec, 2023 16:17 IST|Sakshi

భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఏర్పాటుకు ప్రజలు అంతా సిద్ధం చేశారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు కమల్ నాథ్ పేర్కొన్నారు. బీజేపీ గెలుస్తుందంటూ వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ను పట్టించుకోవచ్చని పార్టీ కార్యకర్తలకు సూచించారు. 

ఈ మేరకు కమల్‌నాథ్‌ తన ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతాలో గురువారం ఓ పోస్టు పెట్టారు. ‘కాంగ్రెస్ కార్యకర్తలందరికీ వారి బలాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. ప్రజలే కాంగ్రెస్ శక్తి. మీ (కార్యకర్తలు)  కృషి, అంకితభావం కారణంగానే ప్రజలు అధిక సంఖ్యలో ఓటు వేశారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఆమోద ముద్ర వేస్తారు’ అన్నారు.

దేశాన్ని నడిపించేది విజన్‌ అని, టెలివిజన్‌ కాదని పేర్కొన్న కమల్ నాథ్..  "కొన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పాయి. మరికొన్ని భిన్న అంచనాలను ప్రకటించాయి. వీటిని పట్టించుకోవద్దు" అని సూచించారు. 

‘అర్జునిడి లాగా లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. ఓట్ల లెక్కింపు రోజున పూర్తి దృష్టిని కేంద్రీకరించి, కాంగ్రెస్‌కు వచ్చిన ప్రతి ఓటును సరిగ్గా లెక్కించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చూసుకోవాలి’ అని కార్యకర్తలకు గీతోపదేశం చేశారు.

మరిన్ని వార్తలు